జలవలయం

చౌటుప్పల్ : వరద నీటితో చౌటుప్పల్ జలవలయంగా మారింది. చౌటుప్పల్ పెద్ద చెరువు, లక్కారం, తంగెడపల్లి, తాళ్లసింగారం దివి నిండుకొని అలుగులు పోస్తున్నాయి. స్థానిక బస్టాండ్, పోలీస్‌స్టేషన్, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు, అయ్యప్ప దేవాలయం పూర్తిగా నీట మునిగాయి. అయ్యప్ప దేవాలయం నైట్ వాచ్మెన్ దానయ్య, భార్య లక్ష్మమ్మ మంగళవారం రాత్రి వచ్చిన వరద ఉధృతిని తప్పించుకునేందుకు దేవాలయం పైకి ఎక్కారు. స్థానికులు దేవాలయం వద్దకు వెళ్లి వారిని సురక్షింతగా బయటికి తీసుకొచ్చారు. మున్సిపాలిటీలో చైర్మన్ వెన్‌రెడ్డి రాజు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం రాత్రి నుంచే సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలైన రాంనగర్, విద్యానగర్ వాసులను అప్రమత్తం చేశారు.
సర్వీస్ రోడ్డు చేపల మయం..
చౌటుప్పల్‌లోని చిన్నకొండూరు రోడ్డు నుంచి వలిగొండ క్రాస్ రో డ్డు వరకు ఉన్న సర్వీస్ రోడ్డు చేపల మయంగా మారింది. సర్వీస్‌రోడ్డును ముంచెత్తిన వరద నీటిలో పెద్ద సంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు వలలతో చేపలు పట్టుకున్నారు.
చౌటుప్పల్ రూరల్‌లో..
చౌటుప్పల్ రూరల్ : మండలవ్యాప్తంగా 2200 ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. 1000 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగినట్లు వ్వవసాయ అధికారులు తెలిపారు. 71 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 9 రోడ్లు తెగిపోయాయి. 14 చెర్వు కుంటలు అలుగులు పారుతున్నాయి. పిల్లాయిపల్లి కాల్వకు రెండు చోట్ల గండిపడింది. దేవలమ్మనాగారం చెర్వు 7 ఏండ్ల తర్వాత నిండింది.
భూదాన్‌పోచంపల్లిలో..
భూదాన్‌పోచంపల్లి : మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరద నీటిలో ఇద్దరు కొట్టుకుపోయి మృతి చెందారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోచంపల్లి- కొత్తగూడెం గ్రామల మధ్య బుషిరెడ్డోని బావి వద్ద మూసీ పిలాయిపల్లి కాల్వ ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి పోచంపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకోగా అందులో ప్రయాణిస్తున్న పోచంపల్లికి చెందిన బాలరాజు భార్య పెద్దల మైసమ్మ(48), భోగ వెంకటేశం చిన్న కూతురు భోగ వైష్ణవి(18) బస్సు దిగి వడ్డుకు చేరే క్రమంలో వరద నీటిలో కొట్టుకుపోయారు. రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపడితే బుధవారం ముల్లపొదల్లో మైసమ్మ, వైష్ణవి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
మృతదేహాలను సందర్శించిన ఎమ్మెల్యే పైళ్ల..
మృతదేహాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బుధవారం సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనుకోని విధంగా ప్రకృతి సృష్టించిన విలయంలో ఇద్దరు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందడం బాధాకరమన్నారు. వర్షాలు మరికొన్ని రోజులు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అపార నష్టాన్ని మిగిల్చిన భారీ వర్షం..
భూదాన్‌పోచంపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం గత 15 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 25.2 సె.మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. చెరువులు, కుటుంలు పొంగడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మండల పరిధిలో ప్రస్తుతం అధికారులు అంచనావేసిన దాని ప్రకారం 3 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 20 రోడ్లకు గండిపడగా 15 రోడ్లపై నీటి ప్రవాహం ఉధృతి కొనసాగుతుంది. ఈ భారీ వర్షానికి మండల వ్యాప్తంగా 250 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 18 ఇండ్లు కూలిపోయాయి.
భువనగిరిలో..
భువనగిరి : రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లోని కుంటలు తెగిపోవడంతో పాటు, చెరువులు అలుగులు పోస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలోని 4100 వరిపంట, 2750 ఎకరాల పత్తిపంట నీట మునిగిందని అధికారులు తెలిపారు. 13 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. భువనగిరి-నల్లగొండ ప్రధాన రహదారిపై నందనం-నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలను దారి మళ్లించారు.
బీబీనగర్‌లో..
బీబీనగర్ : మండలంలో చెరువులు, కుంటలు ఉగ్రరూపం దాల్చి మత్తడి దుంకుతున్నాయి. బీబీనగర్‌లోని పెద్ద చెరువుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో కట్టకు ప్రమాదం చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు జైనపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు జేసీబీతో గండి కొట్టి నీటిని చిన్నేరు వాగులోకి మళ్లించారు. అదేవింధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు చిన్నేటి వాగుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. మగ్దుంపల్లిలో ఒక ఆవు, మూడు బర్రెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భట్టుగూడెం-మామిండ్లగూడెం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వరద నీటిలో 15 గొర్రెలు కొట్టుకుపోయాయి. 15 వందల ఎకరాల మేర పంట నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ అధికారులు తెలిపారు.
వలిగొండలో..
వలిగొండ : మండల వ్యాప్తంగా 22.6 సె.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. 30 తర్వాత మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీ వర్షానికి మండలంలో 1911 ఎకరాల వరి, 580 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లింది. గోపరాజుపల్లి గ్రామ సమీపంలోని మూసీ వాగులో చిక్కుకొని 3 గేదెలు, 1 దూడ మృతి చెందాయి. 16 ఇండ్లు కూలిపోయాయి. మండలంలోని కమ్మగూడెం, రామన్నపేట మండలంలోని ఇంద్రపాల నగరం మధ్య వరదపోటెత్తడంతో భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి.
28 ఏండ్ల తరువాత పరవళ్లు..
ఆలేరు టౌన్ : కురుస్తున్న వర్షాలకు ఆలేరు పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ఆలేరు- కొలనుపాక మధ్య, ఆలేరు -మంతపురి రోడ్డుపై ఉన్న కాజ్వే పై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయిగూడెంలో రెండు చెట్లు విరిగిపడ్డాయి. ఆలేరు-రఘునాథపురం మధ్య ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడంతో కొత్తగా నిర్మాణం చేపట్టారు. అయితే వర్షం కారణంగా అక్కడ పనులు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పాడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరు పెద్దవాగు సుమారు 28 ఏండ్ల తరువాత పూర్తిస్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం : భారీ వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. శామిర్‌పేట వాగుపైన ఉన్న సోలిపేట గంగమ్మబండ చెక్ డ్యాం వద్ద భారీ గండి పడి రైతుల పంటలకు తీవ్ర నష్టం కలిగింది. అదేవిధంగా హాజీపూర్‌లో కింది చెరువుకు గండి పడి పంటలు నీటమునిగాయి. బొమ్మలరామారం, తుర్కపల్లి ప్రధానరహదారి ఖాజీపేట వద్ద బ్రిడ్జిపై నుంచి వస్తున్న వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఫక్కీర్‌గూడెం, తాజ్పూర్ గ్రామాల మధ్య బ్రిడ్జిపై 28 సంవత్సరాల తర్వాత నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేసి గంగమ్మకు పూజలు చేశారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి : మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగులు పోస్తున్నాయి. వెంకటాపూర్ గ్రామ సమీపంలో వరద ఉధృతికి రోడ్డు తెగిపోవడంతో తుర్కపల్లి యాదాద్రికి రాకపోకలు నిలిచిపోయాయి. గంధమల్ల చెరువు నిండి మత్తడి దుంకుతుండటంతో తుర్కపల్లి, గంధమల్లకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పుపల్లిలో వర్షానికి కల్వర్టు కొట్టుకుపోయింది. మండల వ్యాప్తంగా 1010 ఎకరాల్లో వరి, 295 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు తెలిపారు.
వర్షంతో రైతన్నలకు భారీ నష్టం..
మండలంలోని రుస్తాపూర్ గ్రామానికి చెందిన మొగిరెడ్డి నర్సిరెడ్డి, రామిడి భూపాల్‌రెడ్డి, మొగిరెడ్డి రాజిరెడ్డి, ర్యాకల మల్లేశ్, నర్సింహాలు 80 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. వరి పంట మొత్తం నీటిలో మునిగిపోయింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి చేతికి వస్తుందనుకునే సమయంలో పంట పూర్తిగా నీట మునిగి చేతికి రాకుండాపోయిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గుండాలలో..
గుండాల : వర్షాలతో మండలంలోని చె రువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని బిక్కేరు వాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. వెల్మజాల చెరువుకు పడిన గండిని ఇరిగేషన్ అధికారులు పూడ్చివేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పత్తి, వరి, కంది పంటలు నీట మునిగిపోయాయి. మండల వ్యాప్తంగా 26 ఇండ్లు కూలినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ముఖేష్ అంబానీ ఇంటి వద్ద వాహనం కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ
- ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు చేదు అనుభవం
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్‌తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్‌పై లైంగిక దాడి!
- లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం