గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 15, 2020 , 02:03:46

కట్టలు తెగిన చెరువులు, కుంటలు

కట్టలు తెగిన చెరువులు, కుంటలు

  • n రహదారులపై జలవిలయం  
  • n చాలామార్గాల్లో స్తంభించిన రాకపోకలు 
  • n లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇండ్లల్లోకి వరద  
  • n వరదలో కొట్టుకపోయి  ఐదుగురు మృత్యువాత 
  • n 47,800 ఎకరాల్లో పంటనష్టం..  90కిపైనే మూగజీవాలు మృతి  
  • n  నేలమట్టమైన ఇండ్లు..  కూలిన విద్యుత్‌ స్తంభాలు
  • n ఉగ్రరూపం దాల్చిన మూసీ నది 
  • n హైదరాబాద్‌-విజయవాడ  హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌
  • n వరద ప్రాంతాల్లో పర్యటించిన  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పైళ్ల  

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో వరుణుడు ఆగ్రహించాడు. కుండపోతగా కురిపించాడు. ధారకట్టిన వర్షంతో అతలాకుతలం కాగా జనజీవనం స్తంభించింది. ఎన్నో ఆవాసాలతో సంబంధాలు తెగిపోగా.. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో ప్రజానీకం తల్లిడిల్లింది. పంట చేతికందే దశలో వర్షార్పణం కావడంతో రైతు గుండె చెరువయ్యింది. బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు ఆస్తి నష్టం, పంట నష్టాలపై అంచనాలు రూపొందించారు. 25,100 ఎకరాలలో వరి పంటకు, 20వేల ఎకరాల్లో పత్తి పంటకు, 1,250 ఎకరాల్లో కంది పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గుండాల మండలంలో అత్యధికంగా 10వేల ఎకరాల్లో, భువనగిరిలో 7వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ఈ నష్టం ఇంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వరద ఉధృతికి 27 కాల్వలు, మరో 13 చెరువులకు తెగిపోయాయి. జిల్లాలో 1300 వరకు చెరువులు ఉండగా 1200 వరకు చెరువులు ప్రస్తుత వర్షాలకు అలుగులు పోస్తున్నాయి. అయితే ఇందులో 70 వరకు చెరువులు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ మేరకు అధికారులు ఆయా చెరువులకు గండ్లు కొట్టడమో లేక వేరే మార్గంలో వరద నీటిని తరలించడమో చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చెరువులకు సమీపంలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌తోపాటు పలు ప్రాంతాలకు చెందిన 70 మందికి సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. వరద నీటిలో కొట్టుకుపోయి జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడగా భువనగిరి పట్టణంలోని పచ్చల సోమేశ్వరాలయం వెళ్లే దారిలో ఉన్న కత్వాలో పడి కార్తీక్‌ శర్మ అనే 11 ఏండ్ల బాలుడు గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టగా శవమై తేలాడు. వర్షాలకు 125కి పైగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లు నేలమట్టం కాగా.. 20 వరకు బర్రెలు, 70కి పైగా గొర్రెలు మృతిచెందాయి. 11కేవీ లైన్‌కు సంబంధించి 76 స్తంభాలు, ఎల్టీ లైన్‌కు సంబంధించి 56 స్తంభాలు నేలకొరిగాయి. ఒక డిస్ట్రిబ్యూటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్ధమైంది. ఫలితంగా చాలా ఆవాసాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 వరకు రహదారులు దెబ్బతిన్నాయి.

అంతా అప్రమత్తం..

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా యం త్రాంగం చర్యలు చేపట్టింది. ప్రజలు వీలైనంత వరకు ఇండ్లకే పరిమితం అవ్వాలని, సాధ్యమైనంత వరకు ప్రయాణాలను పూర్తి గా వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సహాయ చర్యల కోసం ఏడు రెస్క్యూ టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఒక నాయబ్‌ తహసీల్ధార్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌, ఏఏస్‌ఐ, ఇరిగేషన్‌ ఏఈ ఉంటారు. వీరితో పాటు కలెక్టరేట్‌లో 18004257105 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేయగా.. నలుగురు తహసీల్ధార్‌లు 24 గంటలు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణం సాయం అందించేలా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు.

VIDEOS

logo