ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Oct 10, 2020 , 01:46:19

చీరె మురిపెం..

చీరె మురిపెం..

  • బతుకమ్మకు  సీఎం కేసీఆర్‌ కానుక 
  • ఆడబిడ్డలకు పూల పండుగ సారె 
  • నిరాడంబరంగా బతుకమ్మ చీరెల పంపిణీ 
  • డిజైన్లను చూసి మురిసిన అతివలు 

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్‌ ప్రభుత్వం బతుకమ్మ పం డుగ సందర్భంగా ప్రతియేటా అందించే బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం తొలిరోజు శుక్రవారం జిల్లా వ్యాప్తం గా ఉత్సాహభరిత వాతావరణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. యువతులు మొదలు.. వృద్ధ మహిళల వరకు ప్రతి ఒక్కరూ బతుకమ్మ చీరెను చూసి మురిసిపోయారు. తీరొక్క రంగుల్లో.. రకరకాల డిజైన్లలో.. మొత్తంగా వంద వెరైటీల్లో ఉన్న చీరెలు ఎంతో బాగున్నాయంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో 18 ఏండ్లు నిండి ఆహార భద్రత కార్డు కలిగిన 2,59,841 మందికి చీరెలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా పరిస్థితుల్లో ఇంటి వద్దకే వెళ్లి చీరెలను అందించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆలేరు మున్సిపాలిటీలో చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి మహిళలను ఆప్యాయంగా పలుకరించి చీరెలను అందజేశారు. భువనగిరి, భూదాన్‌ పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అడ్డగూడూరు మండలంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, రామన్నపేట మండలంలో చిరుమర్తి లింగయ్య చీరెలను పంపిణీ చేశారు. భువనగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ ఆలేరు మున్సిపాలిటీలో చీరెల పంపిణీ సందర్భంగా ప్రభుత్వ విప్‌ వెంట ఉన్నారు. పలుచోట్ల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు పాల్గొని మహిళలకు చీరెలను పంపిణీ చేశారు. ఆప్తుడిగా, పెద్దన్నగా ప్రతి బతుకమ్మకు చీరెలను అందిస్తున్న సీఎం కేసీఆర్‌ సల్లంగుండాలని మహిళలు దీవెనలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగింది. వాడవాడల్లో పండుగ వాతావరణం నెలకొనగా.. చీరెలను అందుకున్న ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వులు విరిశాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆద్యం తం ఉత్సాహంగా సాగింది. కరోనా పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలుకరించి చీరెలను అందజేయడంతో మహిళలు ఆనందపడ్డారు. గ్రామ, పట్టణస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వీఆర్‌ఏలు, గ్రామ సమాఖ్య సభ్యులు, చౌకధర దుకాణాల డీలర్లను ఇందులో భాగస్వాములను చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు. పారదర్శకంగా నిర్వహించేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 2.45లక్షల చీరెలు జిల్లాకు చేరగా.. మిగతా చీరెలను రెండుమూడు రోజుల్లో తెప్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

VIDEOS

logo