సోమవారం 01 మార్చి 2021
Yadadri - Oct 10, 2020 , 01:46:17

కందిలోసస్యరక్షణ చర్యలివే..

కందిలోసస్యరక్షణ చర్యలివే..

కందిలో పూత దశ కీలకమైంది. ఈ సమయంలో నీటి ఎద్దడి ఉన్నా లేదా ఆవసరానికి మించి ఎక్కువ నీరు ఇచ్చినా పూత రాలి దిగుబడి తగ్గుతుంది. పూతరాలుడు నివారణకు 8-10లీటర్ల నీటికి ప్లానోఫిక్స్‌ రెండు మి.లీ. చొప్పున కలిపి 10రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కలపై పిచికారీ చేయాలి. 

పూత పెంకు పురుగు..

ఎర్రటి లేదా నారింజ రంగు మచ్చలు, నల్లటి గీతలు ఉంటే పెంకుపురుగులు ఆశించినట్లే. ఇవి పూతదశలో ఆశించి మొగ్గలను తింటాయి. దీంతో కాత తగ్గిపోతుంది. వీటిని గమనించి ఉదయం పూట ఏరి మంటలో కాల్చివేయాలి. 

మారుక మచ్చల పురుగు..

ఈ పురుగు లార్వాలు కంది ఆకులు, పూలు, కాయలను కలిపి గూడులాగ చేసి తింటాయి. నివారణకు లీటర్‌ నీటికి 2.5మి.లీ. క్లోరోఫైరిఫాస్‌, ఒక మి.లీ. డైక్లోరోవాస్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే 3 మి.లీ. స్పైనోసాడ్‌ 10లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

ఆకుచుట్టు పురుగు..

ఈ పురుగు సాధారణంగా పంట పెరిగే దశలో ఆశించి నష్టపరుస్తుంది. కొన్ని సమయాల్లో పూత దశలోనూ దీని ప్రభావం ఉంటుంది. లద్దెపురుగు పూతను గూడులా చేసి లోపలి పదార్థాన్ని తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు మొగ్గలను దగ్గరగా చేర్చి గూడు కడుతుంది. కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలు తినటం వల్ల పంటకు ఎక్కువ నష్టం జరుగుతుంది. విత్తనం మొలకెత్తే దశలో ఈ పురుగు ఆశిస్తే మొత్తం పంటకాలం దీని ప్రభావం ఉంటుంది. దీంతో పంట తీవ్రంగా నష్టపోతుంది. దీని నివారణకు లీటర్‌ నీటికి మోనోక్రొటోపాస్‌ 1.6 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2.మి.లీ. కలిపి పూత దశలో పిచికారీ చేయాలి. 

పంట కోత, నిల్వ..

కాయలు ఎండిన తరువాత మాత్రమే కంది పంటను కోయాలి. పూత రెండు నెలల వరకు వస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కట్టెతో కొట్టి కాయల నుంచి గింజలను వేరు చేయాలి. కందులకు బూడిద లేదా వేప ఆకు కలిపి నిల్వ చేయాలి. పురుగులు ఆశించకుండా ఉండేందుకు ముందుగా బాగా ఎండబెట్టాలి. ఇలా తగు సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల కందిపంటలో అధిక దిగుబడి సాధించవచ్చు. 

VIDEOS

logo