సమగ్రంగా నమోదు చేయండి

- పారదర్శకంగా ఆస్తుల నమోదు చేపట్టాలి
- పనులకెళ్లకముందే ఇండ్లకు చేరుకోండి
- మొబైల్ యాప్, పత్రాల్లో వివరాలన్నీ రాయాలి
- పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు
- బీబీనగర్, భువనగిరిలో నమోదు ప్రక్రియ ఆకస్మిక తనిఖీ
బీబీనగర్ / భువనగిరి : వ్యవసాయేతర ఆస్తుల గణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘనందన్‌రావు తెలిపారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంతో పాటు గూడూరు గ్రామాల్లో,భువనగిరి మండలంలోని అనంతారం, హన్మాపురం, తాజ్పూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రతి ఇంటి వివరాలను సర్వేల్లో సమగ్రంగా రూపొందించాలన్నారు. ఆన్లైన్ నమోదులు చేపట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు బృందంగా పని చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉదయం 6 గంటల నుంచి సర్వేను ప్రారంభించాలన్నారు. సర్వేలకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లే ముందు సిబ్బంది సంబంధిత ప్రొఫార్మాలను సిద్ధం చేసుకోవాలని, ప్రతి ఇంటి ఫొటోతోపాటు యజమాని ఫొటోను తప్పక తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గల వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సేకరించి మొబైల్‌యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. వ్యవసాయేతర ఆస్తుల గణనలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్‌ను అడిగి తెలుకున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిం టి సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమెకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, శిక్షణ కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, ఎంపీడీవోలు శ్రీవాణి, నాగిరెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు చిందం మల్లికార్జున్, ఎడ్ల రాజిరెడ్డి, సురేశ్, ఎంపీటీసీ సభ్యులు సామల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
టేపులతో కొలతలు వేస్తే కఠిన చర్యలు
చివ్వెంల : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల సర్వేకు ప్రజలు, అధికారులు సహకరించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రాఘవేందర్రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు అక్కలదేవిగూడెం, జయరాంగుడితండాలో జరుగుతున్న అసిస్మెంట్ సర్వేను తనిఖీ చేసి మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు చాటింపు ద్వారా సమాచారం చేరవేయాలని సూచించారు. సర్వే చేస్తున్న సమయంలో అధికారులు టేపు ద్వారా కొలతలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటి యజమాని చెప్పిన విపయాలు మాత్రమే యాప్‌లో చేర్చాలని సూచించారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఈ యాప్ చూస్తుందన్నారు. వలసవెళ్లిన యజమానులకు సమాచారం చేరవేసి సర్వేలో చేర్చాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ కుమారిబాబునాయక్, ఎంపీడీవో జమలారెడ్డి, సర్పంచ్‌లు జూలకంటి సుధాకర్‌రెడ్డి, పుట్టా గురువేందర్, సుశీల, ఎంపీవో గోపి, పంచాయతీ కార్యదర్శులు రజిని, శ్రావణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.