గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 05, 2020 , 01:17:25

గులాబీదే పట్టు నాలుగోసారి గెలుపు దిశగా...

గులాబీదే పట్టు నాలుగోసారి గెలుపు దిశగా...

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 

నాలుగోసారి గెలుపు దిశగా టీఆర్‌ఎస్‌ వ్యూహం

జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు 

సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం 

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ను 

నింపిన మంత్రి కేటీఆర్‌ 

టెలీకాన్ఫరెన్స్‌, పర్యటనలు

విస్తృతంగా సన్నాహక సమావేశాలు 

నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన

గెలుపు లాంఛనమే అంటున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ స్థానంలో మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగిస్తూ వస్తోంది. ఇప్పటికే హ్యాట్రిక్‌ కొట్టగా, నాలుగోసారి గెలవాలని టీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉన్నది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను అమలు చేయడంతోపాటు పకడ్బందీ వ్యూహాన్ని రచించే పనిలో సీఎం కేసీఆర్‌ నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ రెండు రోజుల కిందట ప్రగతి భవన్‌లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు దిశగా ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డితోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశం కావడంతోపాటు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్ల నమోదు కోసం నియమించిన గ్రామ, మండల, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఇదే ఉత్సాహంతో క్యాడర్‌ రంగంలోకి దిగి రెట్టించిన ఉత్సాహంతో తమ పనులను మొదలుపెట్టింది.

ముమ్మరంగా సన్నాహక సమావేశాలు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో చడీచప్పుడు లేకపోగా.. టీఆర్‌ఎస్‌ మాత్రం చురుకుగా వ్యవహరిస్తోంది. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ జిల్లాకు చెందిన ఎన్నికల బాధ్యులతో మాట్లాడడం.. ఇటీవలనే కేటీఆర్‌ భువనగిరిలో పర్యటించడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ నెలకొన్నది. దీంతోపాటు పట్టభద్రులతో సమావేశాలను నిర్వహించి చైతన్యపరుస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆ తర్వాత జరిగిన సర్పంచ్‌, పరిషత్‌.. ఇలా ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను జిల్లా ప్రజానీకం ఆదరిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే ఆదరణను పట్టభద్రుల నుంచి కూడా పొందేదిశగా నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నియోజకవర్గంలోని మండలాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిలు విస్తృతంగా పర్యటించి సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

ముమ్మరంగా ఓటర్ల నమోదు..

జిల్లాలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు పట్టభద్రుల ఓటర్ల నమోదును ఉద్యమంలా చేపడుతున్నాయి. గ్రామగ్రామాన ముఖ్య నాయకులు ఇంటింటి సర్వే నిర్వహించి పట్టభద్రుల వివరాలు సేకరిస్తూ ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. 2017 నవంబర్‌ నాటికి పట్టభద్రులైన ఓటర్లతోపాటు గత ఎన్నికల్లో ఓటు వేసిన ఉపాధ్యాయ, ఉద్యోగులను సైతం ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. 1.5లక్షల ఉద్యోగాల భర్తీ, మరో 15 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్‌, పంటల కొనుగోలు, ఇంటింటికీ తాగునీరు, గోదావరి జలాల మళ్లింపు, జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం తదితర అంశాలను ఈ సందర్భంగా పట్టభద్రుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో 63 వేలకు పైగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు ఉండగా, ఆలేరు నియోజకవర్గంలో 72వేలకు పైనే కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని పొంది ఉన్నారు. వార్డు స్థాయి నుంచి టీఆర్‌ఎస్‌కు ఉన్న నెట్‌వర్క్‌తో పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న భావనను క్యాడర్‌ వ్యక్తపరుస్తోంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల దరఖాస్తుల ఫారాలను అందజేసి ఉద్యమంలా నమోదు ప్రక్రియను చేపడుతుండటంతో 2015లో ఉన్న 92,490 ఓటర్ల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో ఓటర్ల సంఖ్య ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన ఓటర్ల నమోదుకు వస్తున్న అనూహ్య స్పందనతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమే అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.

మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తితో 

ఓటరు నమోదు వేగవంతం

తుర్కపల్లి : ఐటీశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన ప్పూర్తితో తనతో పాటు అన్ని గ్రామాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిలు ఓటరు నమోదును వేగవంతం చేశాం. గత కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌ తనకు ఫోన్‌చేసి బేటా శ్రావణి అంటూ అప్యాయంగా పలకరిస్తూ ఓటరు నమోదుపై చేసిన దిశ నిర్దేశం తమలో ఎంతో స్పూర్తిని కలిగించింది. సార్‌ ఇచ్చిన స్పూర్తితో రెట్టించిన ఉత్సాహంతో గ్రామంలో ఇంటింటా తిరిగి పట్టభద్రులను చైతన్య పరుస్తూ ఓటరు నమోదు దరఖాస్తులను అందజేస్తున్నాం. 

- మొగిరెడ్డి శ్రావణి, రుస్తాపూర్‌ 

ఎమ్మెల్సీ ఎన్నికల గ్రామ ఇన్‌చార్జి


కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు

బీబీనగర్‌: ఉమ్మడి జిల్లాలో ఉన్నత చదువులు చదివిన విద్యార్థుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఐటీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా ప్రైమరీ నుంచే పిల్లలు పక్కదారి పట్టకుండా ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి కార్పొరేటు పాఠశాలలకు దీటుగా విద్యతో పాటు నాణ్యమైన భోజన వసతులను కల్పిస్తున్నారు.  

- జక్కి నగేశ్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి, 

రాఘవాపురం, బీబీనగర్‌ మండలం

VIDEOS

logo