గురువారం 26 నవంబర్ 2020
Yadadri - Oct 04, 2020 , 00:17:31

నులిపురుగును నులిపేద్దాం

నులిపురుగును నులిపేద్దాం

  • రేపటి నుంచి అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ 
  • వారంపాటు ఇంటింటికీ అందజేత 
  • కరోనా నేపథ్యంలో ఇండ్లకే వెళ్లి ఇవ్వాలని నిర్ణయం 
  • 1 నుంచి 19 ఏండ్ల వరకు మాత్రలు వేయొచ్చు..  
  • జిల్లావ్యాప్తంగా 1,56,338 మందికి ఇచ్చే లక్ష్యం 

వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, కలు షితాహారం తినడం, సరిగ్గా చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల పిల్లల్లో నులిపురు గులు ఏర్పడుతాయి. ఇవి శారీరకంగా, మానసి కంగా ఎదగకుండా అడ్డుకోవడం తోపాటు జీర్ణ సమస్యలు సృష్టిస్తాయి. దీనినివారణకు ప్రభుత్వం ప్రతియేటా అల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కరోనా నేపథ్యం లో పాఠశాలలు మూతబడడం, పిల్లలంతా ఇండ్లకే పరిమి తం కావడంతో ఇంటికెళ్లి అందించాలని నిర్ణయించారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, వైద్య సిబ్బంది పంపిణీ చేసేలా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.  

ఆలేరు టౌన్‌ : నులి పురుగులు(నట్టలు) ఇవి చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ప్రతి సంవత్సరం నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈసారి వారం రోజులపాటు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి మాత్రలను పంపిణీ చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో 1,56,338 మందికి మాత్రలు ఇవ్వాలని గుర్తించారు. ఇందుకు గాను 1,82,660 మాత్రలను సరఫరా చేశారు. కరోనా అధికంగా ఉండడంతో పాఠశాలలకు విద్యార్థులు రావడం లేదు. దీంతో కరోనా నిబంధనలను పాటిస్తూ ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, వైద్య సిబ్బంది, సామాజిక కార్యకర్తల సహకారంతో ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు వారం రోజులపాటు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఏడాది నుంచి రెండేండ్ల పిల్లలకు సగం మాత్ర, రెండేండ్ల నుంచి 19 ఏండ్ల వయసున్న వారికి 400 మిల్లీ గ్రాముల మాత్ర వేయాలని వైద్య సిబ్బంది చెబుతున్నారు. 

నులిపురుగులు ఇలా ఏర్పడుతాయి..

నులిపురుగులతో రక్తహీనత, దగ్గు, శరీరంపై దురదలు వంటి సమస్యలు ఎదురవుతాయి. పిల్లలు మట్టిలో ఆడుకోవడం, చెప్పులు లేకుండా మలవిసర్జనకు వెళ్లడం, కలుషితమైన ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో నులిపురుగులు, ఏలిక పాములు, కొంకి పురుగులు ఇలా మూడు రకాలైన పురుగులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి పిల్లల జీర్ణకోశ వ్యవస్థలో చేరి రక్తహీనత, పోషకాహార లోపం, చురుకుదనం తగ్గడం, అంతర్గత రక్తస్రావం, నిద్రలేకపోవడం, ఆకలి మందగించడం, శారీరక పెరుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆడ పిన్‌వర్మ్‌.. మలద్వారం వద్దకు పాకి రోజుకు 15వేల చొప్పున గుడ్లు పెడుతుంది. మలం ద్వారా బయటకు వచ్చి ధూళి ద్వారా గుడ్లు గాలిలో కలిసి రెండు రోజుల వరకు సజీవంగా ఉంటాయి. ఇవి తెల్ల రంగులో ఉండి.. అర అంగుళం పొడవు ఉంటుంది. వీటి వల్ల మల, యోని ద్వారం వద్ద దురద, జీర్ణాశయ వ్యవస్థలో ఇబ్బందులు, నిద్రలేమి, చికాకు తదితర లక్షణాలుంటాయి. 

కొంకి పురుగులు.. 

ఇవి శరీరంలోకి చొచ్చుకుపోయి పెరిగిన తరువాత శక్తిహీనులుగా మారుస్తాయి. పేగులకు రంధ్రం చేసి రక్తాన్ని పీలుస్తాయి. పేగుల్లో నివసించే పరాన్న జీవులు నోటి ద్వారానే కాకుండా చర్మం ద్వారా సంక్రమిస్తాయి. రక్తహీనత, పొడి చర్మం, పొడివెంట్రుకలు, కడుపునొప్పి, ఆకలిమంట, మట్టి తినాలనే కోరిక, వాపు, కడుపు ఉబ్బడం, ఆలస్యంగా రజస్వల కావడం, చురుకుదనం తగ్గడం, గుండె ఆగి చనిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. 

ఏలికపాములు..

ఇవి వాన పాములను పోలి ఉంటాయి. రోజుకు 2లక్షల గుడ్లు పెడుతాయి. పేగుల్లో అండగా నిలుస్తాయి. ఆకలి మందగించడం, పోషకాహారం వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపునొప్పి, శరీరంపై దుద్దుర్లు, నిద్రలేమి, విరేచనాలు, వేళకు.. సరిగా విరేచనం కాకపోవడం, వాంతి కావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

అల్బెండజోల్‌ మాత్రలతో...

ఐదేండ్ల నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న వారంతా ప్రతి 6 నెలలకు ఒకసారి అల్బెండజోల్‌-400 ఎంజీ మాత్ర వేసుకోవాలి. భోజనం చేసిన తరువాత నమిలి మింగాలి.

భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి

వండె ఆహారం వేడిగా ఉన్నప్పుడు తీసుకోవాలి 

స్వచ్ఛమైన నీటినే తాగాలి

వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి 

పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ఇంటింటికి అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు పూర్తి చేశాం. కరోనా కారణంగా వారం రోజులపాటు నిర్వహిస్తున్నాం. అన్ని పీహెచ్‌సీలకు మాత్రలు పంపిణీ చేశాం. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. 

- సాంబశివరావు, డీఎంహెచ్‌వో