శనివారం 05 డిసెంబర్ 2020
Yadadri - Oct 04, 2020 , 00:17:31

తుర్కపల్లి రెండేండ్ల కిందే

తుర్కపల్లి రెండేండ్ల కిందే

  • మోడల్‌గా తుర్కపల్లి  తహసీల్దార్‌ ఆఫీసు ఎంపిక 
  • రెండేండ్ల నుంచి జోరుగా రిజిస్ట్రేషన్లు
  • మండలవాసులకు  తీరిన ఇబ్బందులు 
  • ఇప్పటివరకు 4,281డాక్యుమెంట్లు పూర్తి
  • సర్కారుకు  రూ.6,93,77,125 ఆదాయం
  • నూతన రెవెన్యూ చట్టంలోనూ తహసీల్దార్‌కు  రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు 
  • రెవెన్యూ,రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్న తహసీల్దార్లు

రెవెన్యూలో భారీ సంస్కరణలకు సర్కారు శ్రీకారం చుట్టింది. అత్యంత పారదర్శకంగా, వేగంగా సేవలందించేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అక్రమాలకు తావులేకుండా  సేవలందించేలా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. తాజా నూతన రెవెన్యూ చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది. అయితే జిల్లాలో రెండేండ్ల కిందటే తహసీల్దార్‌ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పైలట్‌ ప్రాజెక్టుగా 2018 మే 19న తుర్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌లు రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటివరకు 4,281 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా, స్టాంపు డ్యూటీ, ఇతర రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.6,93,77,125  ఆదాయం సమకూరింది. గతంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే 20 కి.మీ. దూరాన యాదగిరి గుట్టకు రావాల్సి వచ్చేది. అయితే నూతన రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయ భూములను తహసీల్దార్లు, వ్యవసాయేతర భూములు, భవనాలను సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.

తుర్కపల్లి: తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రెండు విభిన్నమైన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తూ ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయం ఆవరణలోనే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. పైలట్‌ ప్రాజెక్టు కింద మండలాన్ని ఎంచుకొని సబ్‌ రిజిస్ట్ట్రార్‌ కార్యాలయాన్ని తాసీల్దార్‌ కార్యాలయంలోనే ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.  2018 మే 19న  మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌  సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ప్రారంభించి రిజిస్ట్రేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

తహసీల్దార్‌కే రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు

 రెవెన్యూ సేవలకే పరిమితమైన తహసీల్దార్‌కు తెలంగాణ సర్కార్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలోనే  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను అప్పగించింది.  కార్యాలయానికి వివిధ భూసమస్యలతో వచ్చే రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాలయాన్ని రెండు విభాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్‌ సేవలందిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్లు చేసి అనంతరం రైతుల భూసమస్యలను పరిష్కరిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా  ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

ఇప్పటివరకు 4,281 డాక్యుమెంట్లు పూర్తి

2018లో ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తహసీల్దార్‌కు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించింది. 201819లో 1,330 డాక్యుమెంట్లు, 2019 నుంచి ఇప్పటి వరకు 2,951 డాక్యుమెంట్లు కలుపుకొని మొత్తం 4,281 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు వివిధ రకాల రిజిస్ట్రేషన్ల నుంచి మొత్తం   రూ. 6,93,77,125 ఆదాయం సమకూరింది. 2018లో 1,62,57, 649,  2019లో 3,46, 65, 483, 2020లో రూ.1,84,53,993 కోట్ల  ఆదాయం సమకూరింది. 

 తగ్గిన దూరభారం 

 మండల కేంద్రంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల దూరభారం తగ్గింది.  గతం లో భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు చేసుకునేందుకు మండల ప్రజలు 20 కిలోమీటర్ల దూరంలోని యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది.  కార్యాలయం వద్ద రోజుల తరబడి నిరీక్షించడంతో పాటు సమయం, డబ్బు వృథా అయ్యేది. దీంతో పాటు రైతన్నలు అనేక వ్యయ ప్రయాసాలకు గురయ్యేవారు.  

-ఇంద్రపాల లక్ష్మయ్య, రైతు, గోపాలపురం 

రైతన్నల నిరీక్షణకు తెర 

గతంలో 20 కిలోమీటర్ల దూరంలోని యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రైతన్నలు వెళ్లి భూ రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి నిరీక్షించేవారు. స్థానికంగా రిజిస్ట్రేషన్లు చేయడంతో ప్రస్తుతం రైతన్నల నిరీక్షణకు తెరపడింది. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ రిజిస్ట్రార్‌గా ఉండటంతో అవినీతి అక్రమాలకు తావులేకుండా నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి.  

-కొమిరిశట్టి నర్సింహులు, 

 రైతుబంధు సమితి మండల కన్వీనర్‌, తుర్కపల్లి

   సులభతర సేవలు 

 భూక్రయ విక్రయాల కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సులభతర సేవలు అందిస్తున్నాం. కార్యాలయంలో మధ్యా హ్నం వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అనంతరం రైతుల భూసమస్యలపై దృష్టి సారిస్తున్నాం.  ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. 

- సలీముద్దీన్‌,తహసీల్దార్‌, తుర్కపల్లి