గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 03, 2020 , 04:47:08

స్వచ్ఛ దివస్

స్వచ్ఛ దివస్

మహాత్ముడి మార్గమే అనుసరణీయం అంటూ మంత్రి కేటీఆర్‌ స్వచ్ఛత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు బయోమైనింగ్‌ చేపడుతున్నామని, భువనగిరి వేదికగా ఈ ప్రక్రియ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసి ‘తెలంగాణ సిరి’ పేరుతో విక్రయించేందుకు ఆగ్రోతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అలాగే పూల వ్యర్థాల నుంచి అగర్‌బత్తీల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో వైపు మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే భువనగిరి మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన షీ టాయిలెట్స్‌, కమ్యూనిటీ టాయిలెట్స్‌ ఫొటో ప్రదర్శనను మంత్రి తిలకించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన మాస్కులను పరిశీలించి బాగున్నాయని కితాబిచ్చారు. అదేవిధంగా డంపింగ్‌యార్డులో పాత టైర్లను ఏర్పాటు చేసి వాటి మధ్యలో మొక్కలు నాటడం, వాటికి రంగులు వేసి గార్డెన్‌లా ఏర్పాటు చేయడం చాలా బాగుందని చెప్పారు. అనంతరం తడిపొడి, ప్లాస్టిక్‌ కవర్లను వేరుచేసే యంత్రాన్ని పరిశీలించి రిసోర్స్‌ పార్కులో మొక్క నాటారు.

    -యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

డంపింగ్‌యార్డు పరిశీలనలో...

మంత్రి : రోజుకు ఎంత చెత్త సేకరణ జరుగుతుంది.

సిబ్బంది : 18 మెట్రిక్‌ టన్నులు సార్‌.. 

మంత్రి : జనాభా బట్టి చెత్త వస్తుందా ? 

సిబ్బంది : పట్టణంలో 59 వేల జనాభా ఉంది. దాని ప్రకారమే చెత్త వస్తుంది.

మంత్రి : చాలా తక్కువ చెత్త సేకరిస్తున్నారు. జనాభా లెక్కన రోజుకు 30 మెట్రిక్‌ టన్నులు రావాలి. చెత్త సేకరణకు ఎన్ని వాహనాలు ఉన్నాయి. 

సిబ్బంది : 18 వాహనాలు సార్‌  

మంత్రి : చెత్త సేకరణకు వార్డుకొక వాహనాన్ని ఏర్పాటు చేయాలి. చెత్తను బయట వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి.  

మంత్రి : ప్లాస్టిక్‌ను ఏ విధంగా కరిగిస్తారు ?

సిబ్బంది : ప్లాస్టిక్‌ కవర్లను కుప్ప చేసి మిషన్‌లో వేస్తాం. 10 నిమిషాల్లో ముద్దగా మారుతుంది. వాటిని కంపెనీలకు విక్రయిస్తాం.

మంత్రి : జిల్లాలో ముడిసరుకు పరిశ్రమ స్థాపించే ఆలోచన ఉంది. మున్సిపాలిటీ నుంచి ముడిసరుకు అందిస్తారా ? 

సిబ్బంది : తప్పకుండా అందిస్తాం సార్‌. 


మంత్రి : వర్మీ కంపోస్టును ఎలా తయారుచేస్తారు ?  

సిబ్బంది : చెత్తను ఎండబెట్టిన తర్వాత మట్టి, ప్లాస్టిక్‌ను వేరుచేస్తాం. వేరు చేసిన మట్టిని బాక్స్‌లలో వేసి హాసులలో ఉంచుతాం. ఇందులో వానపాములు వేసి 45 రోజుల నుంచి 60 రోజులు ఉంచుతాం. 

మంత్రి : రోజుకు ఎంత వస్తుంది.

సిబ్బంది : 6 టన్నుల నుంచి 7 టన్నుల వరకు వస్తుంది. 

మంత్రి : చెత్త సేకరణ పెంచడంతో వర్మీకంపోస్టును ఎక్కువ తయారు చేయవచ్చు. వచ్చిన వర్మికంపోస్టును ఏం చేస్తారు.

సిబ్బంది : వర్మి కంపోస్టును రూ.1500 చొప్పున క్వింటాల్‌కు విక్రయిస్తాం. 

 - భువనగిరి అర్బన్‌ 

 మంత్రి పర్యటన సాగిందిలా..

హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గాన ఉదయం 10.50 గంటలకు భువనగిరి పట్టణానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేరుకున్నారు.

మంత్రి కేటీఆర్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనస్వాగతం పలికారు.  

ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ సమీపంలో 14వ, 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు రూ.8.70 కోట్లతో నిర్మించే సమీకృత మార్కెట్‌ భవనానికి, ఆర్‌అండ్‌బీ వసతిగృహం ఆవరణలో నిర్మించనున్న నిరాశ్రయుల భవనానికి  శంకుస్థాపన చేశారు. 

30, 31, 32, 34 వార్డులలో ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.31.50 లక్షలతో నిర్మించే 197 మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ఎన్‌యూఎల్‌ఎం, పట్టణ ప్రగతి నిధులు రూ.11.50 లక్షలతో వీధి వ్యాపారులకు నిర్మించిన 25 దుకాణాలను మంత్రి ప్రారంభించారు. 

14వ ఆర్థిక సంఘం, పురపాలక సంఘం సాధారణ నిధులు రూ.1.51 కోట్ల వ్యయంతో సింగన్నగూడెంలో నిర్మించే స్మృతివనం పనులకు శంకుస్థాపన చేశారు.  

భువనగిరి శివారులో నిర్మించిన డంపింగ్‌యార్డుకు చేరుకొని డ్రై రీసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌, కంపోస్టింగ్‌ యూనిట్‌ను సందర్శించి, ఫొటో ప్రదర్శనను తిలకించారు. 

రూ.49.50 లక్షలతో పురపాలక సంఘ రిసోర్స్‌ పార్కు చుట్టూ నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి పునాదిరాయి వేసి మొక్క నాటారు.  

అనంతరం డంపింగ్‌యార్డు ఆవరణలో రూ.1.26 కోట్ల వ్యయంతో నిర్మించిన మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 

పట్టణ ప్రగతి పురస్కారాలలో భాగంగా పారిశుధ్య కార్మికులకు మెమొంటోను అందజేసి సన్మానించారు. 

అనంతరం మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు. 

భువనగిరి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో భోజనం చేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. 

- భువనగిరి క్రైం 


VIDEOS

logo