బుధవారం 21 అక్టోబర్ 2020
Yadadri - Sep 30, 2020 , 00:25:50

రతనాల..రాచకొండ

రతనాల..రాచకొండ

  • పచ్చని చెట్లు... గలగలా పారే సెలయేర్లు... 
  • ఆకట్టుకునేలా అద్భుతమైన శిల్ప సంపద..
  • రాజుల చరిత్రను చెప్పే రాచరికపు కట్టడాలు 
  • తెలంగాణ సాంస్కృతిక వైభవానికి దివిటీలు
  • అడవి అందాన్ని పెంచేలా అటవీశాఖ చర్యలు 
  • ప్రతి యేటా ప్రభుత్వ పర్యాటక ఉత్సవాలు 
  • ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పర్యాటకులు 

రాచరికపు కట్టడాలు.. పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు.. వాటిపై నుంచి జాలువారే జలపాతాలు.. కల్మషమెరుగని గిరిజనులు.. అక్కడక్కడా గుట్టల నడుమ కనిపించే గిరిజన ఆవాసాలు.. భానుడి కిరణాలతో పసిడి వర్ణాన్ని సంత రించుకునే పచ్చని పంటలు...  పక్షుల కిలకిలరావాలు.. వెరసి ‘రాచకొండ’ ఓ అద్భుత దృశ్యం. ఒకప్పుడు రాజులు ఏలిన ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో పర్యాటకులను అలరిస్తోంది. హైదరాబాద్‌ నగరానికి 40కి.మీ.ల దూరం లో చౌటుప్పల్‌ వద్ద ఉన్న విజయవాడ- జాతీయ రహదారి నుంచి కేవలం 30 కి.మీ.ల దూరంలో ఉన్న రాచకొండ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ ప్రాంతానికి మరింత వన్నెతెచ్చే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ ప్రాశస్త్యా న్ని నలుమూలలా చాటేలా రాచప్ప సమితి ఆధ్వర్యంలో ప్రతి యేటా పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క అడవికే అందమొచ్చేలా చిట్టడువులను సృష్టించే పనిలో అటవీశాఖ నిమగ్నమైంది. రాబోయే రోజుల్లో పర్యాటక ప్రాంతంగా మరింత సుందరీకరించి, సందర్శ కులకు మరిన్ని వసతులు కల్పించే దిశగా ఏర్పాట్లు జరు గుతున్నాయి. 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాచకొండ కాదది రతనాల కొండ. అక్కడి రాళ్లు రప్పలు చరిత్ర ఆనవాళ్లు చెబుతాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి దివిటీలు పడుతాయి. చుట్టూ అడవి.. కొండలు, అందమైన కోనేరులు, శత్రు దుర్భేద్యమైన కోట.. ఇంకొంచెం తొంగి చూస్తే ఆది మానవుల అడుగు జాడలు కనిపిస్తాయి. యాదాద్రి భువనగిరి- రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో.. సంస్థాన్‌నారాయణపురం మండలంలో ఉన్న రాచకొండ ప్రాంతం పర్యాటకులను అలరిస్తోంది. గుట్టల మధ్య నుంచి వెళ్తుంటే పచ్చనిచెట్లు, కొండలమీద చిన్నచిన్న జలపాతాలు, కుంటలు, పిచ్చుకల రాగాలు కనువిందు చేస్తాయి. గిరిజన తండాలు దాటి రాచకొండకు చేరుకోగానే అక్కడి ముఖ ద్వారాలు స్వాగతం పలుకుతాయి. తూర్పు పడమరలుగా వ్యాపించిన కొండలు.. వాటి మధ్య ఆరువందల అడుగుల కచేరికొండ ఉంది. దానిచుట్టూ పెద్దపెద్ద బండరాళ్లతో నిర్మించిన బలిష్టమైన ప్రాకారం, మధ్యలో ఎత్తయిన బురుజులు.. వాటిమీద ఫిరంగుల అమరికల గుర్తులు కనిపిస్తాయి. ఈ కొండమీదికి వెళ్లాలంటే ఆరు సింహ ద్వారాలు దాటాలి. అవి దాటుకుని వెళ్తే కనిపించే మండపాలే రేచర్ల రాజుల దర్బార్లు. ఈ కొండమీద రాజ ప్రసాదాలు, రాణివాసాలు, జలాశయాలు, అడుగడుగునా దేవాలయాలు దర్శనమిస్తాయి.

 అంతెత్తున అద్భుత ప్రపంచం..

భూమికి 600మీ. ఎత్తులో ఉన్న రాచకొండ గుట్టల్లో అద్భుత ప్రపంచం ఆవిష్కృతమైంది. వైభవంగా పాలించిన వెలమరాజులు ఈ కోటను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. శత్రురాకను పసిగట్టి మట్టుబెట్టే విధంగా వైవిధ్యంగా నిర్మించిన ఈ కోట నిర్మాణ తీరు.. నైపుణ్యత.. సాంకేతికత ఓ అద్భుతం. కోట చుట్టూ 40కిలోమీటర్ల పొడవునా రాతిగోడ.. భారీ గ్రానైట్‌ రాళ్లు.. మలుపులతో అబ్బురపరుస్తుంది. కాకతీయ రాజులకు సామంతులుగా ఉన్న రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందిన రేచర్ల సింగమ నాయకుడు 14వ శతాబ్దంలో ఈ కోట నిర్మాణానికి పునాది వేశాడు. ముస్లిం రాజులైన బహుమనీ సుల్తానులకు, విజయనగర రాజులకు మధ్య రాచకొండ రాజ్యం కొంతకాలం పాటు వారధిగా నిలిచి మత సమైక్యతకు సామరస్యతకు పాటుపడింది. రేచర్ల వంశీయులైన అనపోతా నాయుడు 1361 నుంచి 1384 వరకు రాచకొండను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఈయన పాలనలోనే ఈ దుర్గాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చాడు. తర్వాత ఆయన కుమారుడు సర్వజ్ఞ సింగభూపాలుడు రాజయ్యాడు. ఇతని కాలంలో విజయనగర రాజులు రాచకొండ మీదికి దండెత్తారు. కొంతకాలం తర్వాత బహమనీ సుల్తానుల దాడుల్లో రాచకొండ పతనమైపోయింది.

అడవికే అందమొచ్చేలా..

యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రాచకొండ మొత్తం విస్తీర్ణం 14,765,25 ఎకరాలు. ఇందులో 8,945 ఎకరాల్లో అటవీ విస్తరించి ఉన్నది. ఈ క్రమంలో అటవీశాఖ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తోంది. యాదాద్రి మోడల్‌గా ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎకరం స్థలంలో 4వేల మొక్కలను నాటి దట్టమైన అడవిని సృష్టించారు. మరో మూడు చోట్ల ఇదే తరహాలో చిట్టడవులను ఏర్పాటు చేసే దిశగా అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఈసారి 64వేల మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించగా.. కానుగు, నెమలినార, రాగి, మర్రి, జువ్వి, నేరేడు తదితర మొక్కలను నాటనున్నారు. అటవీ చుట్టూత 15కి.మీ.ల మేర రక్షణగా ఫెన్సింగ్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. రాచకొండ కోట చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తిలకించేలా వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే యోగా షెడ్డు, రచ్చబండ, వాటర్‌ ఫాల్స్‌, వాకర్స్‌ వంటి సదుపాయాలను సైతం అందుబాటులోకి తెచ్చి అడవికే అందమొచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

ప్రకృతి ఒడిలో పర్యాటకులు 

వారాంతారాల్లో పర్యాటకులు రాచకొండ ప్రాంతానికి వచ్చి ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలతో సతమతమై యాంత్రిక జీవనాన్ని వీడి వచ్చే వారికి ఇక్కడి అందాలు ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైంది. సీఎం కేసీఆర్‌ రాచకొండకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఎత్తయిన కొండలు, అందమైన దేవాలయాలు, అద్భుతమైన శిల్పసంపదతో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన రాచకొండ వైభవాన్ని నలుమూలలా చాటిచెప్పే విధంగా తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ప్రతి యేటా ఫిబ్రవరిలో ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. రాచకొండ ప్రాంతంలోనే శివాలయం, గాడిపీర్ల దర్గా ఉండగా.. ప్రతి శివరాత్రి రోజున హిందూ, ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా మూడు రోజులపాటు పూజలు, ప్రార్థనలు చేసి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు సైతం నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలి వస్తుండటం విశేషం. 


logo