శుక్రవారం 23 అక్టోబర్ 2020
Yadadri - Sep 25, 2020 , 01:41:59

డబుల్ వేగం

డబుల్ వేగం

పేదల ఏండ్లనాటి సొంతింటి కల సాకారం కాబోతున్నది. రియల్‌ వెంచర్లకు ధీటుగా ఆధునిక హంగులతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ముస్తాబవుతున్నాయి. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు 2015 అక్టోబర్‌లో పథకం అమలుపై ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రకటించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లతో మోడల్‌ కాలనీని నిర్మించి ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. 

ఈ క్రమంలో జిల్లాకు 3,102 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరవ్వగా.. భువనగిరి పట్టణ శివారులో 1400 ఇండ్లను పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఇందులో 816 ఇండ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా.. 160 ఇండ్ల నిర్మాణాలు తుది దశకు వచ్చాయి. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో మరో 10 మండలాల్లోని 44 గ్రామాల పరిధిలో 1,702 ఇండ్లను చేపడుతున్నారు. ఇందులో అన్ని ఇండ్లకు టెండర్లను పిలవగా.. 831 ఇండ్లకు అగ్రిమెంట్‌ పూర్తయింది. చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండుమల్కాపూర్‌ పరిధిలో 48 ఇండ్లు, సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని సర్వేల్‌లో 40 ఇండ్లు, ఆత్మకూరు మండలంలోని ఉప్పలపహాడ్‌లో 30 ఇండ్లకు సంబంధించిన పనులు పూర్తి దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి చేరువలో ఉన్నాయి. మిగిలిన 731 ఇండ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.

ఇండ్ల నిర్మాణాలు ఎక్కడెక్కడంటే..

భువనగిరి పట్టణంలో 1400 ఇండ్లు, ఆలేరు మండలంలోని ఆలేరులో 96, కొలనుపాకలో 60, గొలనుకొండలో 40 ఇండ్లు, ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరులో 100, దుప్పెల్లిలో 20, కాల్వపల్లిలో 10, లింగరాజుపల్లిలో 35, మురిపిరాలలో 20, సింగారంలో 30, ఉప్పలపహాడ్‌లో 60, రాయిపల్లిలో 20, కొరటికల్‌లో 20, మోదుగుబావిగూడెంలో 10 ఇండ్లు, మోటకొండూరు మండలంలోని మోటకొండూరులో 40, చామాపూర్‌లో 10, దిల్వార్‌పూర్‌లో 20, ఇక్కుర్తిలో 30, తేర్యాలలో 30, వర్టూర్‌లో 20 ఇండ్లు, రాజాపేట మండలంలోని రఘునాథ్‌పూర్‌లో 40, రాజాపేటలో 40 ఇండ్లు, తుర్కపల్లి మండలంలోని కొండాపూర్‌లో 40, తుర్కపల్లిలో 40, ముల్కపల్లిలో 10, సంగ్యతండాలో 20, వాసాలమర్రిలో 24, యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట్‌లో 40, వంగపల్లిలో 40, ఎల్లమ్మతండ(పెద్దకొండూరు)లో 23 ఇండ్లు, చౌటుప్పల్‌ మండలంలోని చౌటుప్పల్‌లో 150, దండుమల్కాపూర్‌లో 72, లింగోజిగూడెంలో 18, చిన్నకొండూరులో 20, సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని నారాయణపురంలో 120, సర్వేల్‌లో 64, అడ్డగూడూరు మండలంలోని ధర్మారంలో 30, బొడ్డుగూడెంలో 20, కంచనపల్లిలో 30, గట్టుసింగారంలో 30 ఇండ్లు, మోత్కూరు మండలంలోని మోత్కూరులో 40, బుజ్జిలాపురంలో 20, కొండగడపలో 20, దాచారంలో 40, పాటిమట్లలో 40 ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

మోడల్‌ కాలనీలుగా... 

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను మోడల్‌ కాలనీలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ధనిక వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోకుండా అధునాతనమైన సౌకర్యాలతో వీటిని నిర్మిస్తున్నారు. తాగునీటి ట్యాంకుల నిర్మాణం, మురుగునీటి సౌకర్యం,రహదారులు, విద్యుత్‌ సౌకర్యం, మిషన్‌ భగీరథ పథకం కింద తాగు నీటి సౌకర్యం వంటి ప్రాథమిక మౌలిక వసతులను కల్పిస్తున్నారు. చాలా చోట్ల మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పటికే తుది దశకు చేరాయి.సకల వసతులతో ఇండ్లు

- ఎంపీపీ బూక్యా సుశీల

నిరుపేదలు సగర్వంగా జీవించాలనే లక్ష్యంతో అన్ని వసతులతో కుటుంబం మొత్తానికి సరిపోయే విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఉంది. తుర్కపల్లిలో 40 ఇండ్లు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిం చనుంది. పేదల పక్షపాతిగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. 


logo