మంగళవారం 27 అక్టోబర్ 2020
Yadadri - Sep 25, 2020 , 01:43:18

ఎన్నికలు ఏవైనా గెలుపు మనదే..

ఎన్నికలు ఏవైనా గెలుపు మనదే..

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం 
  • సంక్షేమ పథకాలే విజయానికి రక్ష
  • రైతుల మేలు కోసమే నూతన రెవెన్యూ చట్టం 
  • టీఆర్‌ఎస్‌ శ్రేణులు పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించాలి 
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

చండూరు/మర్రిగూడ : ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయమని, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వారి సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నదని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నల్లగొండ జిల్లా చండూరు, మర్రిగూడ మండలాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను సీఏం కేసీఆర్‌ తీసుకొచ్చారన్నారు.

రైతుల బాధలు తొలగించాలని రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తే.. వారు పండించే పంటలను పెట్టుబడిదారులకు దోచిపెట్టాలని ప్రధాని మోదీ కేంద్రంలో కొత్త వ్యవసాయ బిల్లును తీసుకొచ్చారన్నారు. ఉనికిని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే తరిమికొడతారన్నారు. రానున్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌ సూచించిన నిర్ణీత గడువులోపు అర్హులైన ప్రతిఒక్కరినీ ఓటు నమోదు చేయించుకునేలా పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత విజయం కంటే ఈసారి భారీ విజయాన్ని అందుకునేలా పనిచేయాలన్నారు. 

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకుడు మునగాల నారాయణరావు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, ఎంపీపీలు మెండు మోహన్‌రెడ్డి, ఏడుదొడ్ల శ్వేతారెడ్డి, కర్నాటి స్వామియాదవ్‌, జడ్పీటీసీలు పాశం సురేందర్‌రెడ్డి, కర్నాటి వెంకటేశం, నారబోయిన స్వరూపారాణి, రవిముదిరాజ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, జిల్లా సభ్యుడు వెంకన్న, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకన్న, పురుషోత్తంరెడ్డి, జగదీశ్వర్‌, గుమ్మడపు నర్సింహారావు, సహకార చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.   

మంత్రి సమక్షంలో చేరికలు.. 

చండూరు : స్వరాష్ట్రంలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. చండూరు మండలం నుంచి వివిధ పార్టీలకు చెందిన 100 మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. 


logo