మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Yadadri - Sep 16, 2020 , 00:41:50

స‌ఫాయివాలా.. స‌లామ్‌..

స‌ఫాయివాలా.. స‌లామ్‌..

   ప్రజారోగ్యం కోసం సడలని ధైర్యంతో ముందడుగు 

కరోనా కష్టకాలంలోనూ నిరంతర సేవలు...  

 పారిశుధ్య  కార్మికుల సేవలను గుర్తించిన ప్రభుత్వం

కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు సడలని ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. అనునిత్యం ప్రజాఆరోగ్యం కోసం పాటు పడుతూ వీధుల్లోని మురుగు, చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వెన్నుచూపక కృత నిశ్చయంతో విధులు చేపడుతున్నారు. ప్రతి రోజూ తమ తమ విధుల్లో భాగంగా వీధుల్లో శానిటైజర్‌, బ్లీచింగ్‌ చల్లుతూ రోగకారక క్రిములను నాశనం చేస్తూ ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ కొవిడ్‌ యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా నిలుస్తున్న సఫాయివాలాకు ప్రజలందరూ సలామ్‌ చెబుతున్నారు.


- భువనగిరి

భువనగిరి : పల్లెలు...పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు చేపడుతున్న విధులు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంది. అనునిత్యం మురుగును తొలగిస్తూ తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమించే కార్మికులకు యావత్‌ సమాజం బాసటగా నిలుస్తుంది. కోడికూతకు ముందే లేచి పట్టణాల్లో, పంచాయతీల్లోని వీధుల్లో మురుగును, చెత్తాచెదారాలను శుభ్రం చేసేందుకు ఉపక్రమిస్తుంటారు.

 ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు వీధులను శుభ్రం చేస్తూ తమ జీవితాలను నెట్టుకొస్తూ ప్రజలకు స్వచ్ఛమైన, ప్రశాంత వాతావరణాన్ని అందించేందుకు దోహదపడుతున్నారు. అనునిత్యం మురుగు కాల్వల్లోని మురుగుతోపాటు, వీధుల్లోని చెత్తా చెదారాలను సమీకరించి వేరు చేస్తూ మురికి కూపంలో మగ్గుతూ, స్వచ్ఛ సమాజ స్థాపనలో భాగస్వాములవుతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి గామాల్లో విస్తృతమవుతున్న నేపథ్యంలో సైతం సడలని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. 

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని భువనగిరిలో-204, ఆలేరులో-44, చౌటుప్పల్‌లో-52, మోత్కూర్‌లో-40, యాదగిరిగుట్టలో-46, భూదాన్‌పోచంపల్లిలో-29 మంది చొప్పున పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా, గ్రామపంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన 500 మందికి ఒక పారిశుధ్య కార్మికుడు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు.

సడలని ధైర్యంతో ముందడుగు...

కరోనా కష్టకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య కార్మికులు సడలని ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వెన్నుచూపక కృతనిశ్చయంతో విధులు చేపడుతున్నారు. ప్రతి రోజూ తమ తమ విధుల్లో భాగంగా వీధుల్లో శానిటైజర్‌, బ్లీచింగ్‌లు చల్లుతూ రోగకారక క్రిములను నాశం చేస్తూ ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తున్నారు.

అపోహలను అధిగమిస్తూ సేవలు... 

పారిశుధ్య కార్మికులపై ప్రజల్లో గతంలో ఉన్న అపోహలను పటాపంచలు చేశారు. కరోనా నేపథ్యంలో అనునిత్యం గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవకు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ప్రతి చోటా కార్మికులకు జననీరాజనాలు అందుతున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోపాటుగా ప్రభుత్వం మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, డ్రైస్సులను అందించింది. 

ముఖ్యమంత్రి కానుకగా రూ.5వేలు జమ

ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రోత్సాహక కానుక పథకం ద్వారా ప్రతి కార్మికుడి ఖాతాల్లోకి రూ. 5వేల చొప్పున నగదును బదలాయించింది. ప్రతి కార్మికుడికి కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తమ వంతు సహకారాలను అందిస్తూ కార్మికులకు అండగా ఉంటుంది.


logo