ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Sep 13, 2020 , 00:48:05

ఇదిగిదిగో యాదాద్రి

 ఇదిగిదిగో యాదాద్రి

  • అద్భుత దివ్యక్షేత్రంగా నారసింహుడి ఆలయ పునర్నిర్మాణం  
  • నల్లటి కృష్ణశిలలతో సంప్రదాయ హంగులతో నిర్మాణాలు
  • 95 శాతం పూర్తయిన ఆలయ పనులు
  • ధార్మిక సాహిత్యం, కళలు ఉట్టిపడేలా అద్భుత కట్టడాలు
  •  ప్రధానాలయానికి తుది మెరుగులు
  • నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌ రాక  
  • స్వామి దర్శనాంతరం, పనుల పరిశీలన 
  • సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులు 
  •  గుట్ట చుట్టూ పటిష్ట పోలీసు బందోబస్తు  

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నల్లటి కృష్ణశిలలతో అతి సుందరంగా యాదాద్రి నారసింహుడి క్షేత్రం రూపుదిద్దుకుంటోంది. నేటి, భావితరాలు సంబురపడేలా ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా  జరుగుతున్నాయి. గుట్టను అద్భుత దివ్యక్షేత్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన పునర్నిర్మాణ పనులు చాలావరకు పూర్తయ్యాయి. ప్రధానాలయం పనులు పూర్తికాగా,తుది మెరుగులు దిద్దుతున్నారు.

ధార్మిక సాహిత్యం, కళలు ఉట్టిపడేలా అద్భుత కట్టడాలు నిర్మిస్తున్నారు. నారసింహుడిని దర్శించుకునేందుకు వీలుగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొండ చుట్టూ రింగ్‌రోడ్డు పనులు, రూ.22 కోట్లతో చేపడుతున్న గ్రీనరీ పనులు ఆకట్టుకుంటున్నాయి. ప్రధానాలయానికి వాయువ్యంలో 30 అడుగుల ఎత్తున నిర్మించనున్న రథమండపం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటన్నింటినీ స్వయంగా పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదివారం యాదాద్రికి వస్తున్నారు. రోడ్డు మార్గాన గుట్టకు రానున్న సీఎం తొలుత స్వామివారిని దర్శించుకొని అనంతరం పనుల పురోగతిని స్వయంగా వీక్షించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు, డీసీపీ నారాయణరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. 

-యాదాద్రి, నమస్తేతెలంగాణ   


యాదాద్రి, నమస్తేతెలంగాణ : సీఎం కేసీఆర్‌ ఆదివారం యాదాద్రిలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం ముమ్మర ఏర్పాట్లు చేశారు. నూతన ఆలయ పునర్నిర్మాణం జరిగే ప్రాంతంలో మట్టి కుప్పలు తొలగించారు. కొండపై రహదారులతోపాటు ఘాట్‌ రోడ్డు పక్కన పార్కులను శుభ్రం చేశారు. ఘాట్‌ రోడ్డు వెంట సైడ్‌వాల్‌లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో గుంతలు పూడ్చివేశారు. దాదాపు నిర్మాణం పూర్తికావచ్చిన ప్రధాన ఆలయం, శివాలయం పరిసరాలను శుభ్రం చేశారు. రెండు మూడు రోజులుగా రింగ్‌ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. హరిత హోటల్‌ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు జాగీలాలు, జామర్లతో తనిఖీలు చేశారు.

ఏర్పాట్లు పరిశీలన

సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ యాదాద్రిలో పర్యటించారు. స్వామి వారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. అంతకు ముందు పెద్దగుట్ట, హెలీప్యాడ్‌, రింగ్‌రోడ్డు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ను పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లు, పనులపై ఆరా తీశారు. కలెక్టర్‌ వెంట రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, శనివారం కొండపైకి  12 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులు, భద్రతా సిబ్బంది చేరుకున్నారు. 

చకచకా అభివృద్ధి పనులు


యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కొండపైకి వెళ్లే ఘాట్‌ రోడ్డు మార్గంలో, కొండపైన సైడ్‌ వాళ్ల నిర్మాణం, ప్రధాన ఆలయంలో మిగిలిపోయిన ఫ్లోరింగ్‌ పనులు చేపడుతున్నారు. ఘాట్‌రోడ్డు మార్గంలో విరివిగా మొక్కలు నాటుతున్నారు. ఫౌంటేన్‌ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శివాలయంలో కల్యాణ మండపం పనులు చేపడుతున్నారు. ప్రసాద విక్రయ శాలలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న మట్టి కుప్పలు తొలగించి చదును చేశారు. ఆలయంలో సింహం, ఐరావతం, గరుడ విగ్రహాలు అమర్చే పనులు వేగంగా జరుగుతున్నాయి.

నేడు 11 గంటలకు యాదాద్రికి సీఎం ఆదివారం 11గంటలకు సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకోనున్నారు. బేగంపేటలోని సీఎం క్యాంపు ఆఫీస్‌ నుంచి 10 గంటలకు బయలుదేరి రోడ్డు లో గుట్టకు వస్తారు. కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ప్రధానాలయం, శివాలయం, పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్‌ పనులు పరిశీలిస్తారు. అలాగే వైటీడీఏ పరిధిలో జరుగుతున్న రోడ్డు, ఇతర నిర్మాణాలు పరిశీలిస్తారు. 13వ సారి పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :ఆలయ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించడం ఇది పదమూడోసారి. చివరిసారిగా 2019 డిసెంబర్‌ 17న దర్శించుకున్నారు. చాలా రోజుల విరామం తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో 13వ సారి ఆదివారం యాదాద్రికి వస్తున్నారు.

మొదటిసారిగా 2014 అక్టోబర్‌ 17న సీఎం కేసీఆర్‌ యాదాద్రికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అదే ఏడాది డిసెంబర్‌ 17న రెండోసారి, 2015 ఫిబ్రవరి 25న మూడోసారి, మార్చి 5న జరిగిన కల్యాణంలో సతీసమేతంగా నాలుగోసారి పాల్గొన్నారు. మే 30న ఐదోసారి యాదాద్రిని సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. జూలై 5న ఆరోసారి దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.


2016 అక్టోబర్‌ 19న ఏడోసారి యాదాద్రికి వచ్చి పనులను పర్యవేక్షించారు. 2017 నవంబర్‌ 23న ఎనిమిదోసారి పర్యటించి ఆలయ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. తొమ్మిదోసారి 2017 అక్టోబర్‌ 24న యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని హంగులను సమకూరుస్తామని పునరుద్ఘాటించారు. 2019 ఫిబ్రవరి 3న పదోసారి యాదాద్రికి విచ్చేసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు.

ఆగస్టు 17న యాదాద్రిలో 11వ సారి పర్యటించారు. అనంతరం 2019లో డిసెంబర్‌ 17న 12వ సారి పర్యటించిన సీఎం పలు సూచనలు చేశారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ వైటీడీఏ అధికారులు పనుల్లో జాప్యం నెలకొనకుండా చర్యలు తీసుకోగా, పనులు తుది దశకు చేరాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్‌ పదమూడోసారి ముఖ్యమంత్రి హోదాలో యాదా ద్రికి వస్తున్నారు. 

VIDEOS

logo