మంగళవారం 27 అక్టోబర్ 2020
Yadadri - Sep 12, 2020 , 00:11:20

అద్భుతాల గిరి ఆలయ నగరి

అద్భుతాల గిరి  ఆలయ నగరి

  • చెక్కుచెదరని కృష్ణశిలలతో అత్యద్భుత నిర్మాణం 
  • ప్రతి అమరికలోనూ ప్రత్యేక విశిష్టత 
  • పరుగులు పెడుతున్న పునర్నిర్మాణ పనులు 
  • ఇప్పటికే ప్రధానాలయం పనులు  దాదాపు పూర్తి 
  • వేగంగా శివాలయం కల్యాణ మంటపం నిర్మాణం  
  • కొండకు ఆకపచ్చని తోరణం  
  • ముమ్మరంగా రింగ్‌రోడ్డు పనులు

యాదాద్రీశుడి ఖ్యాతి, విశిష్టతను ఖండాంతరాలకు చాటి చెప్పడంతోపాటు భావితరాలూ మురిసిపోయేలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రతీ పనిలోనూ విశిష్టత.. ప్రతి అమరికలోనూ వైవిధ్యం ఉట్టిపడేలా పనులు చేపడుతున్నారు. నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో పూర్తిగా కృష్ణశిలలతో వెయ్యేండ్లపాటు చెక్కు చెదరకుండా పునర్నిర్మితమవుతున్న ప్రధానాలయం పనులు సింహభాగం పూర్తయ్యాయి. గర్భాలయ ద్వారంపై అందమైన విగ్రహాలు, ప్రహ్లాదుడి చరిత్రను తెలిపే రాగిరేకుల అమరిక పూర్తికాగా, ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన సింహం, ఐరావతం, గరుడ విగ్రహాలను ఆలయ నలుదిక్కులా అమర్చుతున్నారు. నాలుగంతస్తుల్లో ప్రసాదం కాంప్లెక్స్‌ భవనం ఇప్పటికే పూర్తికాగా, ప్రాకార మంటపాల అంతర బాహ్య సాలహారాల్లో ఏర్పాటు చేయనున్న విగ్రహాల నమూనా చిత్రాలను ఇటీవల చినజీయర్‌స్వామి పరిశీలించి ఓకే చేశారు. శుక్రవారం ఫ్లోరింగ్‌, శివాలయంలో కల్యాణ మంటపం పైకప్పు, క్యూకాంప్లెక్స్‌, పుష్కరిణి మెట్ల ఏర్పాటు, కొండకు పచ్చదనం పెంచే పనులు చురుగ్గా సాగాయి. ఈ పనులను వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావుతో కలిసి ఈఎన్‌సీ రవీందర్‌రావు, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ వసంత్‌నాయక్‌, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, ఈవో గీతారెడ్డి పరిశీలించారు.

-యాదాద్రి, నమస్తేతెలంగాణ  

రేపు  యాదాద్రికి సీఎం కేసీఆర్‌ 

ఆలయ పునర్నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం యాదాద్రికి రానున్నారు. సీఎం చివరిసారి గతేడాది డిసెంబర్‌ 17న యాదాద్రిని సందర్శించి ఆలయ పనులను పరిశీలించారు. సుమారు 8 నెలల తర్వాత తిరిగి యాదాద్రికి వస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయ పనులు పూర్తికాగా, తుదిదశ పనుల్లో భాగంగా ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రధానాలయం పక్కనే నిర్మిస్తున్న శివాలయం, పుష్కరిణి నిర్మాణాలు కూడా పూర్తికావొచ్చాయి. వీటన్నింటినీ సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు. ప్రెసిడెన్సిషియల్‌ సూట్స్‌, రింగ్‌రోడ్డు, పెద్దగుట్టపై అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రి తిలకించే అవకాశాలున్నాయి. 


యాదాద్రి, నమస్తేతెలంగాణ : నభూతో నభవిష్యత్‌ అనే రీతిలో కృష్ణ శిలలతో వెయ్యేండ్ల పాటు చెక్కు చెదరకుండా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధానాలయం పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. మిగతా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఫ్లోరింగ్‌, శివాలయంలో కల్యాణ మంటపం పైకప్పు, క్యూ కాంప్లెక్స్‌, పుష్కరిణి మెట్ల ఏర్పాటు, కొండకు గ్రీనరీ పనులు, రింగ్‌ పనులు కొనసాగాయి. ఈ పనులను ఈఎన్‌సీ రవీందర్‌రావు, వైటీడీఏ ఇన్‌చార్జి ఎస్‌ఈ వసంత్‌నాయక్‌, వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, ఈవో గీతారెడ్డి పరిశీలించారు. కాగా గర్భాలయ ద్వారంపై అందమైన విగ్రహాలు, ప్రహ్లాదుడి చరిత్రను తెలిపే రాగిరేకుల అమరిక పూర్తయ్యింది. ఇటీవలే మహాబలిపురం నుంచి తెప్పించిన సింహం, ఐరావతం, గరుడ విగ్రహాలను ఆలయ నలు దిక్కులా అమర్చుతున్నారు.  నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తున్న ప్రసారం కాంప్లెక్స్‌ భవనం పూర్తయ్యింది. కింది రెండు ఫ్లోర్లలో ప్రసాదాల తయారీ కోసం వంట పాత్రలు అమర్చుతున్నారు. నాలుగో అంతస్తులో ప్రసాద విక్రయాల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాకార మంటపాల అంతర బాహ్య సాలహారాల్లో  ఏర్పాటు చేయనున్న విగ్రహాల నమూనా చిత్రాలను ఇటీవల చినజీయర్‌ స్వామి పరిశీలించి ఫైనల్‌ చేశారు. సాలహారాల్లో నరసింహుడి బ్రహ్మోత్సవ రూపాలు, దశావతారాలు, అష్టలక్ష్మి, శ్రీకృష్ణుడి పలు అవతారాల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయం లోపల రాతి గోడలకు నరసింహ ఆలయాల నమూనాలను ఎంబాజ్‌ విధానంలో (ఉబ్బెత్తుగా ఉండే శిల్పాలు) తీర్చిదిద్దుతున్నారు.  రాజస్థానీ చిత్రకళను తలపించేలా ఈ చిత్రాలు గీశారు.

108 రకాల మొక్కలు..


యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండను 108 రకాల మొక్కల మొక్కలతో హరితమయం చేశారు. పలు రకాల అందమైన పూలమొక్కలు, నీడ నిచ్చే, వివిధ రకాల ఆకట్టుకునే ఆకృతుల్లో పత్రాలు గల మొక్కలు నాటారు. సుమారు రూ.22 కోట్లతో మొక్కల పెంపకం, గార్డెనింగ్‌ పనులు చేపట్టారు. కొండకు పడమర వైపున రిటైనింగ్‌ గోడల కింది భాగంలో అందమైన మొక్కలు నాటారు. కార్పెట్‌ గ్రాస్‌ను ఏర్పాటు చేసి పార్కును తలపించేలా తీర్చిదిద్దారు. ఘాట్‌ రోడ్డు పక్కన కొండ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో అందమైన పూలు, సుగంధ, దేవత, నక్షత మొక్కలు నాటారు. హరిత హోటల్‌కు వెళ్లే మార్గానికి ఇరువైపలా పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటారు. అలాగే కొండ చుట్టూ గిరిప్రదక్షిణ కోసం 2.7 మీటర్ల పొడవుతో మట్టి రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. గిరి రోడ్డుకు ఇరుపైపులా మొక్కలు నాటుతున్నారు. గిరి రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. 

అందంగా శివాలయ కల్యాణ మంటపం..


శివాలయం కల్యాణ మంటపం పనులు వేగంగా జరుగుతున్నాయి. 16X16 మీటర్ల విస్తీరణంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఏకతల రాజగోపురంతో పైకప్పు పనులు పూర్తయ్యాయి. దీని పక్కనే రథ మంటపాన్ని నిర్మించనున్నారు. ప్రధాన శివాలయంతో పాటు గణపతి, పర్వతమర్థిని అమ్మవారు, ఆంజనేయస్వామి, నవగ్రహ మంటపాల నిర్మాణాలు పూర్తయ్యాయి. యాగశాలలను అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఫ్లోరింగ్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశారు. ప్రాకార మంటపాలకు స్టోన్‌ టెక్చర్‌ పనులు త్వరలోనే చేపట్టనున్నారు.

వేగంగా పుష్కరిణి పనులు..

కొండపైన అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న విష్ణు పుష్కరణి తుది దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. పుష్కరిణి మధ్యలో కృష్ణ శిలలతో అందమైన మంటపాన్ని  ఏర్పాటు చేశారు. మెట్ల నిర్మాణం పూర్తయ్యింది. లక్ష లీటర్ల పూర్తిస్థాయి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. నెల రోజుల పాటు నీటిని పునర్వినియోగం చేసుకునేలా 20 వేల నీటి సామర్థ్యంతో ఆటోమేటిక్‌ నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొండ గండిచెరువు సమీపంలో మరో పుష్కరిణిని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆర్‌సీసీతో ఫ్లోరింగ్‌, సైడ్‌వాల్‌ల నిర్మాణం పూర్తయ్యింది. బస్‌ బే పనులు ప్రారంభించాల్సి ఉన్నది.

ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా రింగ్‌రోడ్డు..


ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రింగ్‌రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. తుర్కపల్లి, రాజాపేట, రాయగిరి, వంగపల్లి నుంచి యాదగిరిగుట్టకు వచ్చే మార్గాలను అనుసంధానిస్తూ దీన్ని నిర్మిస్తున్నారు. ఆయా మార్గాల నుంచి వాహనాలు గుట్టకు రాకుండానే ఇతర మార్గాల వైపు మళ్లించేలా నిర్మిస్తున్నారు. వైకుంఠమార్గం నుంచి యాదగిరిపల్లికి వెళ్లే దారిలో పురాతన హనుమాన్‌ ఆలయ కూల్చివేత విషయం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఇక్కడ మాత్రమే పనులు నిలిచిపోయాయి. 


logo