శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 11, 2020 , 00:19:51

భూముల ‌బాధ‌లు బంద్‌

భూముల  ‌బాధ‌లు బంద్‌

  • నూతన రెవెన్యూ చట్టంపై సర్వత్రా హర్షం 
  • అవినీతికి తావులేకుండా అందుబాటులోకి ధరణి వెబ్‌సైట్‌ 
  • లొల్లి, కొట్లాటలు లేకుండా ఇకపై సజావుగా ఫౌతీ 
  • రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే మ్యుటేషన్‌
  • రైతుకు భరోసా కల్పించేలా కొత్త చట్టం ఉందని మేధావుల కితాబు
  • రెండోరోజూ జిల్లావ్యాప్తంగా సంబురాలు  
  • సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు 

రెవెన్యూలో ఎడతెగని జాప్యానికి చెక్‌పెడుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భూముల బాధలు తప్పుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైసల కోసం పీల్చుకుతిన్న సిబ్బంది, అధికారుల వేధింపులు తీరుతాయని పేర్కొన్నారు. భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లాకు నూతన చట్టం ఒక పెద్ద ముందడుగని చెప్పొచ్చు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు ఆ శాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన వారు కూడా నూతన చట్టంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చట్టంలోని మార్పుల వల్ల కోర్టుల్లో సగానికి పైగా కేసుల వివాదాలు తగ్గిపోతాయని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల రెవెన్యూ, న్యాయశాఖలకు పనిఒత్తిడి తగ్గడంతోపాటు ప్రభుత్వానికి, ప్రజలకు కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని అంటున్నారు. భూ చిక్కులు తేలక రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను పొందలేకపోతున్నారు. నూతన చట్టం అమల్లోకి వస్తే సమస్యలు తీరి అర్హులకు పథకాల ఫలాలు అందనున్నాయి. 

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుకు, ఆ తర్వాత పేరు మార్పిడి (మ్యుటేషన్‌)కి తహసీల్దార్‌ ఆఫీసుకు పోవాల్సిన అవసరం లేదు. వీఆర్వోలు, ఆర్‌ఐలను బతలాడాల్సిన పనిలేదు. ఒకసారి భూమి రిజిస్ట్రేషన్‌ అయ్యిందంటే రైతుకు అప్పటికే పాసు పుస్తకం ఉంటే అందులో నమోదవుతుంది. లేకుంటే కొత్త  పాసుపుస్తకం నేరుగా పోస్టులో ఇంటికే చేరుతుంది.  


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భూమి కబ్జా అవుతుందన్న భయం ఉండదు. రుణాలు రావన్న బాధ ఉండదు.. లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండబోదు.. నిత్యం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి రాదు. మొన్నటి వరకు ఇబ్బందులకు గురిచేసిన వీఆర్వో వ్యవస్థ లేదు. పైఅధికారులకు రెవెన్యూ బాధ్యతలు తప్పితే.. సర్వాధికారాలు లేవు. వెరసి.. సీఎం కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థలో నవ శకానికి నాంది పలికారు. కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి భూమికి కవచం లాంటి నూతన చట్టాన్ని తీసుకొస్తున్నారు. సత్వర మ్యుటేషన్‌.. అవినీతికి తావులేని భూ యాజమాన్య బదలాంపులు వంటి కొత్త విధానాలను తీసుకొచ్చి రైతుకు భరోసా కల్పించారు. రెవెన్యూ చరిత్రలో రైతుల వెతలు తీర్చే గొప్ప ముందడుగని సామాన్య ప్రజానీకం మొదలుకుని.. సబ్బండ వర్ణాలు సీఎం నిర్ణయానికి జేజేలు పలుకుతున్నాయి. భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతూ.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లాకు నూతన చట్టం ఒక పెద్ద ముందడుగు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఆ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారు సైతం నూతన చట్టంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చట్టంలోని మార్పులతో కోర్టుల్లో ఉన్న సగానికి పైగా కేసుల వివాదాలు తగ్గిపోతాయని వారు పేర్కొంటున్నారు. రెవెన్యూ శాఖ.. న్యాయ శాఖలకు పనిభారం తగ్గడంతోపాటు అటు ప్రభుత్వానికి.. ఇటు ప్రజలకు వేల కోట్ల రూపాయల ఖర్చు సైతం ఆదా అవుతుందన్న అభిప్రాయాన్ని ఆయా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండోరోజు కూడా జిల్లాలో ఉద్యోగ వర్గాలు.. రైతాంగం, ప్రజానీకం సంబురాలను జరుపుకుంది. 

   ఎన్నోఏండ్లుగా సాగు చేసుకుంటున్న పొలం నాదే.. అని చెప్పుకునే పరిస్థితి నిన్న మొన్నటి వరకు లేదు. సంబంధిత భూ హక్కు పత్రాన్ని పొందడం కూడా చాలా కష్టమైన పనే. తప్పుల తడకగా రెవెన్యూ రికార్డులు.. భూ వివరాలను అడిగినా చెప్పరు.. రికార్డులను సైతం చూపరు. తప్పులను సరిచేసుకోవడం ఎలాగో కూడా చెప్పరు. సర్వే చేయరు. ఏండ్ల తరబడిగా హద్దులు తేలవు. సుమారుగా 150కి పైగా చట్టాలు ఉన్నా.. అటు భూమికి రక్షణ లేకపోగా.. రైతన్నకు భరోసా లేకుండా పోయింది. భూములను కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేసుకున్నాక కూడా మ్యుటేషన్‌ చేసుకోవడానికి కూడా ఏండ్ల తరబడిగా వేచి చూడాల్సి వచ్చేది. ప్రతి కాగితానికీ అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం.. వారు అడిగినంత లంచాలు ఇచ్చుకోవడంలో రైతులు అరిగోస పడ్డారు. ఏండ్ల తరబడిగా పరిష్కారం కాని సమస్యలతో దిగులు చెందిన రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టిన ఘటనలెన్నో. భూముల ఆధారంగానే ప్రభుత్వం రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తోంది. భూ చిక్కులు తేలక రైతులు ప్రభుత్వ సాయాన్ని అందుకోలేక నష్టపోతున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో గత దారుణాలకు పూర్తి స్థాయిలో చెక్‌ పడనున్నది.

భూ పంచాయతీలకు పుల్‌స్టాప్‌..

భూముల వివరాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా ‘ధరణి’ వెబ్‌సైట్‌ను తీసుకొస్తోంది. కొత్త సాఫ్ట్‌వేర్‌తో వెబ్‌సైట్‌లో నిక్షిప్తమైన భూ వివరాలను మార్చే అధికారం ఎవరికీ ఉండదు. ఒక వ్యక్తికి ఎంత భూమి ఉన్నది?. అప్పులు ఏమైనా ఉన్నాయా?. వారసులు ఎవరెవరు? వంటి వివరాలన్నీ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలిసిపోతుంది. ఆస్తి మార్పిడి సందర్భంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసినప్పటికీ మ్యుటేషన్‌ చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఇకపై అలా కాకుండా.. భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆటోమెటిక్‌గా మ్యుటేషన్‌ జరిగి పాస్‌ బుక్కులు సైతం జారీ అవుతాయి. గతంలోలా భూ పంపకాల సందర్భంగా కొట్లాటలు.. ఘర్షణలకు తావు లేకుండా పారదర్శకంగా ఫౌతీని చేసేలా కొత్త చట్టాన్ని రూపొందించారు. ఏ అధికారి కూడా సొంతంగా నిర్ణయం తీసుకునేందుకు ఆస్కారం లేదు. రికార్డులను తారుమారు చేయడం.. భూ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తే బర్తరఫ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ చేయడానికి చట్టం వీలును కల్పించింది. మొత్తంగా కొత్త చట్టంతో భూ సమస్యలు లేని జిల్లాను చూడబోతున్నామని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

VIDEOS

logo