ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 03, 2020 , 00:02:24

భ యాన్ని ఎదిరించి వైర‌స్‌ను జ‌యించి

భ యాన్ని ఎదిరించి వైర‌స్‌ను జ‌యించి

  • కరోనా నుంచి కోలుకొని ఇంటిబాట 
  • బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఐసొలేషన్‌ నుంచి 16 మంది ఇంటికి 
  • ఎమ్మెల్యే పైళ్ల సొంత నిధులతో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు 
  • భోజనం, మందులు, రవాణా ఉచితం 
  • దేవుడొలె కాపాడిండని బాధితుల ఆనందం 
  •  కరోనా విజేతలకు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు 
  • విధి నిర్వహణలో వైరస్‌ బారిన ఆశావర్కర్‌ పద్మ 
  • ఇంట్లోనే ఉండి కోలుకొని తిరిగి విధుల్లోకి..

ప్రభుత్వ వైద్య సేవలే మేలని, హైదరాబాద్‌కు వెళ్లకుండా స్థానికంగా చక్కటి వైద్యమందించాలన్న ఉద్దేశంతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తన సొంత నిధులతో భువనగిరి, బీబీనగర్‌ ఎయిమ్స్‌లలో ప్రత్యేకంగా ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయించారు. పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లతోపాటు మూడు పూటలా భోజనం, శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌ అందజేస్తున్నారు. సుశిక్షుతులైన వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో సేవలు పొందిన 16 మంది కరోనా బాధితులు బుధవారం బీబీనగర్‌ ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జయ్యారు. వారికి స్థానిక నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ‘ కరోనా వచ్చిందనగానే భయపడిన. ప్రైవేటుకెళ్తే సరిగ్గా స్పందించలేదు. ఎయిమ్స్‌ ఐసొలేషన్‌లో చక్కటి సేవలందించిన్రు. ఎమ్మెల్యే అన్ని వసతులు కల్పించి దేవుడొలె ఆదుకున్నడు’  అని బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే విధి నిర్వహణలో సంస్థాన్‌నారాయణపురం పీహెచ్‌సీ ఆశావర్కర్‌ జక్కలి పద్మ వైరస్‌ బారినపడింది. ధైర్యంగా ఇంట్లోనే ఉండి చిట్కాలు పాటించి వైరస్‌ను జయించి తిరిగి విధుల్లో చేరింది. కరోనా భయం కన్నా..మా ఊరి ప్రజల తీరువల్లే చాలా బాధపడ్డానని ఆమె పేర్కొంది.

-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణ/బీబీనగర్‌

 ఉద్యోగ నిర్వహణలో కొందరు, వ్యాపారంలో మరికొందరు కరోనా బారిన పడుతున్నారు. ఏమరపాటు నిర్లక్ష్యంతో తెలియకుండా ఒంట్లోకి వైరస్‌ చొరబడుతోంది. నాలుగైదు రోజుల్లోలక్షణాలు బయటపడడంతో హడావుడిగా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. 


బీబీనగర్‌ : రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌బారిన పడినవారు చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని భావించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తన సొంత ఖర్చులతో భువనగిరిలోని జిల్లా ప్రభుత్వ దవాఖాన, బీబీనగర్‌లో ఎయిమ్స్‌లో ప్రైవేటుకు దీటుగా అన్ని సౌకర్యాలతో ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న విషయం విదితమే. 

కరోనా నుంచి కోలుకొని ఇంటికి క్షేమంగా వెళ్లిన 16 మంది..

భువనగిరి, బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఈ రెండు ఐసొలేషన్‌ వార్డుల్లో కలిసి ప్రస్తుతం 50మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఐసొలేషన్‌ వార్డులో ఉన్న 16 మంది బాధితులు పూర్తిగా కోలుకొని బుధవారం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.  స్థానిక ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోళి పింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కరోనా జయించిన వారికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం స్పందిస్తూ ఎమ్మెల్యే తీరుపై బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆహ్లాదకరమైన వాతావరణం..

కరోనా బారినపడి ఐసొలేషన్‌లో చేరిన వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించేలా అన్ని ఏర్పాట్లు కల్పించారు. అదేవిధంగా మనోధైర్యాన్ని నింపడంతో పాటు తాము కరోనా బారిన పడ్డామనే బెంగ మరిచిపోయేలా కాలక్షేపానికి ఎల్‌సీడీ టీవీలను ఏర్పాటు చేశారు. బాధితులకు కావాల్సిన వసతులన్నీ వార్డు బాయ్‌లు దగ్గరుండి సేవ అందిస్తున్నారు. 

బాధితులకు పౌష్టికాహార కిట్ల అందజేత..

కరోనా పాజిటివ్‌ వచ్చి హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తన వంతు సాయంగా సొంత డబ్బులతో 14 రోజులకు సరిపడా ప్రత్యేక పౌష్టికాహార కిట్లను అందజేస్తున్నారు. ఒక్క కిట్‌ ధర సుమారు రూ.1300 ఉంటుంది. ఇందులో దాదాపు 25 రకాల పౌష్టికాహార పదార్థాలు ఉంటాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో వెయ్యికి పైగా కిట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు ఎప్పటికప్పుడూ బాధితుల ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటూ, మెరుగైన వైద్య సేవలు అవసమయ్యే వారిని ఎయిమ్స్‌ ఐసొలేషన్‌కు తరలించి చికిత్స అందించాలని తెలిపారు.

మంత్రి కేటీఆర్‌ అభినందనతో మరింత స్ఫూర్తి..

నియోజకవర్గంలో కరోనా బాధితులకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తన సొంత నిధులతో ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయడంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో మెచ్చుకున్నారు. మంత్రి అభినందనలతో ప్రజల ఆరోగ్యం విషయంలో ఖర్చులో వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

నియోజకవర్గానికి సుజలదాతగా సుపరిచితుడు..

తన సొంత నియోజకవర్గం ఆలేరులో గత 15 సంవత్సరాల కిందట నుంచే ఎమ్మెల్యే పైళ్ల శెఖర్‌రెడ్డి తన సేవలను మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రజలకు తాగునీరు వసతి లేకపోవడం, ఫ్లోరైడ్‌ బారిన పడి అల్లాడుతుంటే చూసి చలించలేక పైళ్ల ఫౌండేషన్‌ ద్వారా తన సొంత ఖర్చులతో గ్రామ గ్రామాన బోర్లు వేయించి, మంచినీటి ఫిల్టర్లను ఏర్పాటు చేయించారు. అనంతరం భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను యథాతథంగా కొనసాగిస్తూనే రైతులకు సాగునీరు అందించే విషయంలో రాజీలేని పోరాటం చేశారు. 

VIDEOS

logo