శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Sep 01, 2020 , 23:43:58

కొత్తగా..కొంగొత్తగా

కొత్తగా..కొంగొత్తగా

  • ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఆన్‌లైన్‌ బోధన షురూ  
  • ఉదయం నుంచే అన్ని ఇండ్లల్లో సందడి 
  • కొత్త అనుభూతి కలిగిందన్న విద్యార్థులు 
  • కొన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో బోధించిన టీచర్లు  

నల్లగొండ విద్యావిభాగం : ప్రభుత్వ, రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో మంగళవారం ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యార్థులకు టీ-శాట్‌, దూరదర్శన్‌ యాదగిరి ఛానల్స్‌లో వచ్చే పాఠాలను తమ తమ ఇండ్లలోనే ఉండి వీక్షించారు. అదే విధంగా కళాశాల విద్యార్థులకు అధ్యాపకులు ఆన్‌లైన్‌లో జూమ్‌యాప్‌, వెబినార్‌, గూగుల్‌ క్లాస్‌రూం తదితర యాప్స్‌తో పాఠాలు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ప్రసారం చేసే పాఠాలను విద్యార్థులు చూస్తున్నారా? లేదా అనే అంశంపై నల్లగొండ డీఈవో బి.భిక్షపతి ఆకస్మికంగా పరిశీలన చేశారు. జిల్లా కేంద్రంలోని మర్రిగూడ జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థుల ఇండ్లకు స్వయంగా వెళ్లి పాఠ్యాంశాలపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కట్టంగూర్‌లో పర్యటించి విద్యార్థుల ఇండ్లకు వెళ్లి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సందేహాలు వస్తే ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

ఆత్మకూరు(ఎం)లో... 

ఆత్మకూరు(ఎం): డిజిటల్‌ బోధనతో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ తమ ఇండ్లలోని టీవీల్లో దూరదర్శన్‌, టీ-శాట్‌ ద్వారా ప్రసారమైన ఆన్‌లైన్‌ తరగతులను విన్నారు. 

భువనగిరి అర్బన్‌లో... 

భువనగిరి అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలలు కొవిడ్‌ నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలు నిబంధనలు సడలింపుతో ఈనెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఆయా తరగతులకు కేటాయించిన సమయంలో టీవీల ద్వారా పాఠాలను వీక్షించారు. పట్టణంలోని గంజ్‌ ఏరియాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువున్న విద్యార్థి పట్టణంలోని అర్బన్‌ కాలనీలో ఇంట్లో నుంచి ఆన్‌లైన్‌ ద్వారా క్లాస్‌ను టీవీ ద్వారా విన్నారని ప్రధానోపాధ్యాయురాలు ఎం.ఉమ తెలిపారు. 

విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక టీమ్‌లు

విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులను పూర్తి సమాచారాన్ని ఇచ్చే విధంగా ప్రోత్సహించేందుకు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు రెండు టీమ్‌లుగా ఏర్పడినారు. మొదటి టీమ్‌లో ఉపాధ్యాయులు విద్యార్థుల తరగతులను బట్టి కేటాయించిన సమయంలో టీవీ ద్వారా వీక్షించాలని సూచిస్తూ విద్యార్థులను వినేలా చేస్తున్నారు. రెండవ టీమ్‌లో ఉన్న ఉపాద్యాయులు టీవీలో వీక్షించిన తర్వాత విద్యార్థులకు వచ్చిన డౌట్స్‌ క్లియర్‌ చేయడం, హోంవర్క్‌ చేయించడం వాటిపై పూర్తి సమాచారాన్ని తెలుసుకుని, విద్యార్థులకు అర్థమైందో తెలుసుకుంటారు. విద్యార్థులకు వచ్చిన డౌట్స్‌ను క్లియర్‌ చేసే విధంగా ఉపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు. 

సంస్థాన్‌నారాయణపురంలో...

సంస్థాన్‌నారాయణపురం: ఈ ఏడాది విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలో మంగళవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ ఇంట్లోనే ఫోన్‌ ద్వారా కొంత మంది, టీవీలో ఆన్‌లైన్‌ పాఠాలను కొంత మంది విన్నారు. మండలంలో మొత్తం 9 ఉన్నత పాఠశాలలు, ఒక ఆదర్శ పాఠశాల, కస్తూర్బాగాంధీ పాఠశాల, గురుకుల పాఠశాల ఉండగా, 37 ప్రాథమిక పాఠశాలలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 10 ప్రైవేట్‌ పాఠశాలలో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండి విద్యార్థుల సందేహాలకు సలహాలు, సమాధానాలు ఇచ్చారు.

VIDEOS

logo