వామ్మో.. హైవే

ఇంతటి కీలకమైన జాతీయ రహదారులను కేంద్రం గాలికొదిలేసింది..నిర్వహణ మరిచింది. అడుగుకో గుంత, అస్తవ్యస్తమైన డివైడర్లతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. టోల్ రోడ్డు మినహాయించి చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి తూఫ్రాన్‌పేట వరకు 4కి.మీ. పొడవునా రహదారి అధ్వానంగా తయారైంది. పెద్దపెద్ద గుంతలతో వాహనాలు పట్టుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. దగ్గరకు వచ్చేవరకు గుంత కనిపించడం లేదని, రాత్రి వేళలో ప్రయాణం నరకప్రాయంగా ఉంటోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ఆర్వోబీలు, బైపాస్ రోడ్డు పనులు ఏళ్ల తరబడి కార్యరూపంలోకి రావడం లేదు. టోల్గేట్ పేరుతో వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు నిర్వహణను పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: “స్వరాష్ట్రంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఫలితంగా.. గ్రామాల నుంచి మండల కేంద్రానికి సింగిల్ లైన్.. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్.. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు లైన్ల రహదారులు ఒనగూరాయి. ఇక జాతీయ రహదారుల విషయానికొస్తే.. పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. అడుగడుగునా గుం తలు.. వాటి మీదుగా తప్పని అవస్థల ప్రయా ణం. జిల్లాలోని ఏ జాతీయ రహదారిని చూసినా ఇదే కథ. కేంద్రం నిధులు ఇవ్వక.. పనుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతోంది. పూర్తయిన రోడ్ల నిర్వహణ చేసేవారు లేక రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయి. గుంతలమయమైన చౌటుప్పల్ మండలంలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి-65 ఇందుకు ఉదాహరణ. దండుమల్కాపురం నుంచి తూఫ్రాన్‌పేట వరకు 4కిలోమీటర్ల రహదారి గుంతలమయంగా మారింది. ఇక హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి- 163 నిర్మాణంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న పనులు సైతం ముందుకుసాగటం లేదు. అండర్ పాస్ బ్రిడ్జి పనులు.. బైపాస్ రోడ్డు పనులు ఏండ్లతరబడి కార్యరూపంలోకి రావడం లేదు. ఫలితంగా ఆయా జాతీయ రహదారులపై ప్రయాణం ప్రాణాలమీదకొస్తోంది.”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-163 నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. 2014లో నిర్మాణ పనులు ప్రారంభం కాగా 2018లో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లో చేపట్టిన పనులు ఇప్పటి వరకు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా సమ్మక్క సారక్క జాతరలోపుగానే పనులు పూర్తి చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రస్తుతం బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు నుంచి ఆలేరు మండలం కందిగడ్డతండా వరకు 48కిలోమీటర్ల మేర పనులు జరుగుతుండగా.. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద మోటకొండూరు మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో నిర్మించాల్సిన అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు, ఆలేరు మండలం నుంచి జీడికల్ గ్రామానికి వెళ్లేందుకు చేపట్టాల్సిన అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు నేటి వరకు కూడా చేపట్టలేదు. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు పలుమార్లు కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీకి విజ్ఞప్తులు చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవడం ద్వారా ఈ ఏడాది మార్చిలో రూ.37కోట్లను మంజూరు చేశారు. అయినప్పటికీ ఎన్‌హెచ్ హైవే అధికారులు అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణాలను కార్యరూపంలోకి తీసుకురాలేక పోయారు. దీనివల్ల ఎగుడు దిగుడుగా ఉన్న ఈ రహదారి చిన్నపాటి వర్షాలకే నీటి మడుగును తలపిస్తోంది. ఆలేరు పట్టణంలోని సాయి దేవాలయం నుంచి కందిగడ్డతండా వరకు 7.2కి.మీ.మేర చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉంది. అసంపూర్తి పనులతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎవరికీ పట్టింపులేకుండా పోయింది.
గుంతలమయంగా ..
నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65 గుంతలమయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు ఈ జాతీయ రహదారి గుండా రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం నుంచి తూఫ్రాన్‌పేట వరకు జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. 4 కిలోమీటర్ల మేర అడుగుకో గుంత అన్నట్లుగా రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. దగ్గరికి వచ్చేవరకు కూడా గుంత ఉన్న విషయం తెలియకపోవడంతో ప్రమాదానికి హేతువుగా మారింది. పెద్ద పెద్ద గుంతలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుండగా.. రాత్రి వేళలో ప్రయాణం నరకప్రాయంగా ఉంటోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణం చేసి వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డ ఘటనలు సైతం ఉన్నాయి. టోల్గేట్ పేరుతో వసూళ్లు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్వహణను గాలికి వదిలేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామీణ రోడ్లకు మహర్దశ
2014 సంవత్సరం నుంచి ఆలేరు నియోజకవర్గంలో బీటీ రోడ్లకు మహర్దశ పట్టుకుంది. రూ.26.50కోట్లతో యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయ ఘాట్ రోడ్డు నిర్మాణం, రూ.18కోట్లతో 13కిలోమీటర్ల మేర కొండమడుగుమెట్టు నుంచి బొమ్మలరామారం, ఆలేరు పట్టణం నుంచి జీడికల్ వరకు రూ.14కోట్లతో 12.5కిలోమీటర్ల మేర, ఆలేరు పట్టణం నుంచి బచ్చన్నపేట వరకు రూ.5కోట్లతో 6.6కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. రూ.1.25కోట్లతో బొమ్మలరామారం నుంచి గట్టు మైసమ్మ టెంపుల్ వరకు, రూ.70లక్షలతో రంగాపురం నుంచి రామలింగపల్లి వరకు, రూ.70లక్షలతో పకీరుగూడెం నుంచి నాగినేనిపల్లి వరకు, రూ.1.30కోట్లతో వర్టూర్ నుంచి ఖప్రాయిపల్లి వరకు, రూ.40లక్షలతో దిలావర్పూర్ నుంచి మోటకొండూర్ వరకు, రూ.20లక్షలతో మోటకొండూర్ నుంచి సికందర్నగర్ వరకు, రూ.2.16కోట్లతో సికిందర్‌నగర్ నుంచి కాటేపల్లి వరకు, రూ.2.81కోట్లతో యాదగిరిగుట్ట నుంచి వయా రాళ్లజనగాం మీదుగా బీఎన్ తిమ్మాపురం వరకు, రూ.2కోట్లతో సైదాపురం నుంచి మల్లాపూర్ వరకు, రూ.47లక్షలతో పెద్ద కందుకూరు నుంచి యాదగిరిగుట్ట పీడబ్ల్యుడీ రోడ్డు వరకు, రూ.1.25కోట్లతో మాసాయిపేట నుంచి సాదువెళ్లి వరకు, రూ.65లక్షలతో జంగంపల్లి నుంచి రాళ్లజనగాం వరకు, రూ.2.34కోట్లతో కొరటికల్ నుంచి ఉప్పలపహాడ్ వరకు, రూ.98లక్షలతో పల్లెర్ల ఎక్స్‌రోడ్డు నుంచి లింగరాజుపల్లి వరకు, రూ.3.11కోట్లతో రఘునాథపురం నుంచి సోమారం వరకు, రూ.1.9కోట్లతో నెమిలె నుంచి సోమారం వరకు, రూ.2.20కోట్లతో కుర్రారం నుంచి వయా చిన్న మేడారం మీదుగా బొందుగుల వరకు బీటీ రోడ్లను నిర్మించారు. రూ.55లక్షలతో మల్కాపూర్ నుంచి బద్దుతండా వరకు, రూ.90లక్షలతో గొల్లగూడెం నుంచి రామోజీనాయక్ తండా వరకు నిధులు మంజూరుకాగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. రూ.1.5కోట్లతో యాదగిరిగుట్ట- జంగంపల్లి, రూ.20.80లక్షలతో జం గంపల్లి- రాంపూర్ తండా, రూ.79.30లక్షలతో మాసాయిపేట- ధర్మారెడ్డి గూడెం, రూ.36.40లక్షలతో గౌరాయిపల్లి- రఘునాథపురం రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. తుర్కపల్లి మండలంలోని వివిధ గ్రామాల రోడ్ల అభివృద్ధికి రూ.5. 17కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. యాదగిరిగుట్ట మండలంలోని రాయగిరి బ్రిడ్జి నిర్మాణానికి రూ.110 కోట్లు, ఆత్మకూరు(ఎం) మండలంలోని ఖఫ్రాయిపల్లి- మొదుగుబాయిగూడెం గ్రామాల మధ్య బిక్కేరు వాగుపై రూ.1.70లక్షలతో వంతెన నిర్మాణాలు చేపట్టారు.
దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం
చౌటుప్పల్-మునుగోడు రోడ్డును డబుల్‌రోడ్డుగా ఏర్పాటు చేయడాన్ని గత ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి. కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ ఫలితంగా.. చౌటుప్పల్ నుంచి సంస్థాన్‌నారాయణపురం మీదుగా మునుగోడు మండల కేంద్రానికి రూ.42 కోట్లతో డబుల్‌రోడ్డు ఒనగూరింది. 2017 సంవత్సరంలో 36 కి.మీ మేర ఈ రోడ్డును అభివృద్ధిపర్చారు. రూ.10కోట్లతో అడ్డగూడూరు నుంచి పాటిమట్ల మీదుగా మోత్కూరు వరకు నిర్మించిన రహదారి, రూ.20కోట్లతో గుండాల నుంచి మోత్కూరు మీదుగా అమ్మనబోలు వరకు, రూ.2కోట్లతో భూదాన్‌పోచంపల్లి నుంచి గోకారం వరకు, రూ.6.82కోట్లతో మానాయకుంట నుంచి గురజాల వరకు, రూ.5.15 కోట్లతో చౌటుప్పల్ నుంచి నల్లగొండ వరకు నిర్మించిన రహదారులు వాహనదారులకు ఉపయుక్తంగా మారాయి. రూ.1.90కోట్లతో రామన్నపేట మండలంలోని కక్కిరేణి- ఎన్నారం గ్రామాల మధ్య ఆసిఫ్‌నగర్ కాల్వపై బ్రిడ్జిని నిర్మించారు. అలాగే దుబ్బాక -రామన్నపేట గ్రామాల మధ్య రూ.3కోట్లతో బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టడంతో గతంలో వాగులు ఉప్పొంగిన సందర్భాల్లో స్థానికులు ఎదుర్కొన్న ఇబ్బందులు తీరాయి.
తాజావార్తలు
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్