శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Sep 01, 2020 , 01:49:43

నీళ్ల క‌ష్టాలు..నిల్లు

నీళ్ల క‌ష్టాలు..నిల్లు

  • కరువు ప్రాంతానికి ఉరికొస్తున్న గంగమ్మ  
  •  భారీ వర్షాలతో గుండాల మండలానికి గోదావరి 
  • బీడు భూముల్లో జలసిరులు 
  •  నవాబ్‌పేట జలాశయం ప్రధాన కాల్వ ద్వారా సరఫరా గుండాల మండలంలో 87 చెరువులు కళకళ 
  • 4280 ఎకరాల ఆయకట్టు పదిలం
  • కనువిందు చేస్తున్న పచ్చని పైర్లు  

నవాబుపేట జలాశయం(0.5 టీఎంసీ) నుంచి గోదారమ్మ గుండాల మండలానికి పరుగుపరుగున చేరుతోంది. జనగామ జిల్లా చీటకోడూరు చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. అక్కడ్నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి మీదుగా నవాబ్‌పేట ప్రధాన కాల్వతోపాటు మరో 6 ఉపకాల్వల ద్వారా మండలంలోని చెరువులకు నీళ్లు చేరుతున్నాయి. మండలవ్యాప్తంగా 87 చెరువులుండగా, ఇప్పటికే  40 చెరువులు పూర్తిగా నిండి మత్తడి దుంకుతున్నాయి. మిగతావి సగానికన్నా అధికంగా నిండడంతో రైతాంగం సంబురపడుతోంది. మిషన్‌ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం తీసుకరావడం, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ప్రత్యేక చొరువ తీసుకొని  30 తూముల నిర్మాణం చేపట్టారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులను ఉపాధి హామీ పథకంలో పూడిక తీయించి పూర్వ వైభవం కల్పించారు. ఫలితంగా మండలవ్యాప్తంగా 4280 ఎకరాల ఆయకట్టుకు ఢోకా లేకుండాపోయిందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

- ఆలేరు  


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత కరువు ప్రాంతంగా పేరొందింది గుండాల మండలం. ఇక్కడ ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేదు. పెద్దపెద్ద చెరువుల్లేవు. ఎత్తిపోతల పథకాలూ కనబడవు. సాగుకే కాదు తాగునీరు దొరకక అలమటించిన రోజులున్నాయి. ఫ్లోరైడ్‌ కూడా ఈ మండలాన్ని భయపెట్టింది. కరువు పోయింది..బీడు భూములు పచ్చదనాన్ని పరుచుకున్నాయి. బోర్లు పుష్కలంగా పోస్తున్నాయి. తాగునీటి సమస్య ముచ్చటే లేకుండా పోయింది. ఫ్లోరైడ్‌ జాడలేదు. గతంలో ఎండిపోయిన చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. అలుగులు మత్తడి దుంకుతున్నాయి.

ఆలేరు: ఏండ్లు కరువుప్రాంతంగా ఉంటూ వస్తున్న గుండాల రైతుల కష్టాలు తీరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషి ఫలించడంతో మండలం వ్యాప్తంగా చెరువుల్లోకి గోదావరి జలాలు వచ్చాయి. ఎగువ ప్రాంతమైన వరంగల్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు అక్కడి జలాశయాలు పూర్తిగా నిండాయి. జనగామ జిలాలోని చీటకోడూరు(0.30 టీఎంసీ), నవాబ్‌పేట జలాశయాల(0.50 టీ ఎంసీ) నుంచి గోదావరి జలాలు పరవళ్లు తొక్కుకుంటూ గుండాలకు చేరుకున్నాయి. 60 ఏండ్లుగా సాగునీటి సమస్యను పట్టించుకోని నాటి ప్రభుత్వాల తీరుకు, తాజాగా భారీ ప్రాజెక్టులపై ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక శ్రద్ధతో  నీళ్లు వృథా కాకుండా చెరువుల్లోకి చేరాయి.  మండలం వ్యాప్తంగా ఉన్న 87 చెరువుల్లోకి నీళ్లు చేరగా ఇందులో 40 చెరువులు పూర్తిగా నిండి పలు చెరువులు మత్తళ్లు దూకాయి. దీంతో 4280 ఎకరాల వ్యవసాయ భూమికి నీటి సమస్య తీరిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

జలాశయాలకు వరదనీళ్లు 

జనగామ జిల్లాలోని చీటకోడూరు జలాశయం నిండి మత్తడి పారుతున్నది. అక్కడి నుంచి నేరుగా స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, ఆలేరు నియోజకవర్గాలకు సాగు నీళ్లు అందించేందుకు ప్రతిపాదించిన నవాబ్‌పేట ప్రధాన కాల్వతోపాటు మరో ఆరు ఉపకాల్వలు పూర్తిగా గోదావరి జలాలతో పరవళ్లు తొక్కుతున్నాయి.  వారం రోజులుగా నవాబ్‌పేట జలాశయం నుంచి ప్రధాన కాల్వ ద్వారా 16 కిలోమీటర్లు  ప్రవహించి గుండాల మండలంలోని అనంతారం మండలానికి గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఎల్‌-6 (ఉపకాల్వ) ప్రారంభమై గుండాల మండలంలోని కొమ్మాయిపల్లి, గుండాల పట్టణం, గురుజుబావి, వెల్మజాల, మర్రి పడగ, సీతారాంపురం, సుద్దాల, మాసానుపల్లి, గంగపురం, నూనెగూడెం, బండకొత్తపల్లి, గొల్లెపల్లి, తుర్కలశాపురం,  అంబాల, కొండాపురం, రామారం, పెద్దపడిశాల చెరువుల్లోకి తూంల ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తూ ఎల్‌-6  ప్రధానకాల్వ వస్తాకొండూర్‌ వర కు ప్రవహించి అక్కడి నుంచి బిక్కేరువాగులోకి చేరుతున్నాయి.

87 చెరువులకు జలకళ..

నవాబ్‌పేట జలాశయం నుంచి ప్రధాన కాల్వ గోదావరి జలాలతో పరవళ్లు తొక్కుకుంటూ గుండాలకు చేరుకున్నాయి. ఆయా గ్రామాల్లోని 25 చెరువుల్లో  జలకళ సంతరించుకున్నది. ఈ క్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలంలోని చెరువుల్లోకి గోదావరి జలాలను నింపాలనే లక్ష్యంగా నవాబ్‌పేట జలాశయం ప్రధాన కాల్వను నిర్మించగా నీళ్లు వచ్చి చేరాయి. గుండాలలో పెద్ద చెరువు, బండకొత్తపల్లిలో పెద్దచెరువు, గంగాపురంలో ఊరచెరువు, మరిపడగలో ఊరచెరువు, మాసాన్‌పల్లి ఊర చెరువు, సీతారాంపురంలో ఊర చెరువు, తుర్కలషాపూర్‌లో ఊర చెరువు, వస్తాకొండూర్‌లో ఊర చెరువు, నల్ల చెరువు, వెల్మజాలలో బుర్జుబావికుం ట, చిప్పలకుంట, అయ్యవారికుంట, గార్లకుంట, నాగులకుంట, వెంకటన్నకంట, గుండాలలో తులసీకుంట, నెల్లచెరువు, అంబాలలో మక్తబాయికుంట, అనంతారంలో జింకలకుంట, కర్నాలబావి, బండకొత్తపల్లిలో పీరటికుంట, బ్రాహ్మణపల్లిలో బంగారుమైసమ్మకుంట, సందలకుంట, ఊరచెరువు, కొమ్మాయిపల్లిలో కుంటకుంబాయికుంట, మర్సుబాయికుంట, మరిపడగలో గార్గాకుంట, రామారంలో చింతకుంటతో పాటు మరో 12 చెరువులు కలుపుకుని మొత్తం 40 చెరువులకు 100శాతం నీరు వచ్చి చేరగా పలు చెరువులు  మత్తళ్లు దుకాయి. 35 చెరువుల్లో 80-90 శాతం, 12 చెరువుల్లో 5-20 శాతం నీళ్లు వచ్చాయి. దీంతో మొత్తం 87 చెరువులతో 4280 ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి ఢోకాలేదు.  

ఫలించిన ప్రభుత్వ ముందుచూపు...

చెరువుల్లో నీళ్లు నింపి నాటి కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు పద్ధతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవలంభిస్తున్నారు. గుండాల మండలానికి సాగుజలాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. సీఎం కేసీఆర్‌ సాగుజలాలపై తీసుకున్న కఠినమైన నిర్ణయాలతో చెరువులు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఎల్‌-6 ఉపకాల్వలకు 30 తూంల  నిర్మాణం చేపట్టగా వాటిని పునరుద్ధరించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులను ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టారు. దీంతో నీళ్లు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువులకు వచ్చి చేరాయి.

సాగునీటికి ఢోకాలేదు


నాకు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే, ఈ ఏడాది నీళ్లు సమృద్ధిగా రావడంతో మొత్తం సాగు చేశా. వర్షాలతో సంబంధంలేకుండా గుండాలలో నవాబ్‌పేట జలాశయం ద్వారా గోదావరి జలాలు వచ్చాయి. కరువు ప్రాంతమైన గుం డాలలో ఇంత పెద్ద ఎత్తున నీళ్లు రావడం చాలా ఏండ్ల తర్వాత జరిగింది. మరో రెండేండ్ల వరకు సాగునీటిని ఢోకాలేదు.  
 -చంద్రమౌళిగౌడ్‌, అనంతారం, గుండాల మండలం 

 కల సాకారమవుతోంది ..


తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రధానంగా సాగు జలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీ నూతన ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు  ప్రాజెక్టుల పునరుద్ధరణ చేపట్టారు. మిషన్‌కాకతీయ పథకంతో చెరువులకు పూర్వ వైభవం సంతరించుకున్నది.   15 రోజులు కురిసిన వర్షాలతోపాటు కాళేశ్వరం, గోదావరి జలాలతో ఎగువ ప్రాంతమైన వరంగల్‌ జలాశయాలు పూర్తిగా నిండాయి. నవాబ్‌పేట ప్రధాన కాల్వ ద్వారా గుండాల మండలానికి గోదావరి జలాలు వచ్చి చేరాయి. 
-గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ప్రభుత్వవిప్‌, ఆలేరు ఎమ్మెల్యే 

VIDEOS

logo