నో పర్మిషన్... నో రిజిస్ట్రేషన్

- అనుమతిలేని స్థిరాస్తులపై సర్కారు కీలక నిర్ణయం
- అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల రిజిస్ట్రేషన్ల నిలిపివేత
- నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం
- జిల్లాలో 173కు పైగా అక్రమ వెంచర్లు
- రియల్ వ్యాపారుల్లో ‘అనుమతుల’ గుబులు
- ప్లాట్ల కొనుగోలుదారుల్లో అయోమయం
- కొత్త మున్సిపాలిటీల్లో సెప్టెంబర్ నెలాఖరునాటికి స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం
రెండంతస్తుల భవనానికి అనుమతులు తీసుకుని నాలుగైదు అంతస్తులు కట్టేయడం.. అక్రమంగా లే అవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయించడం ఇకపై కుదరదు. ఒకవేళ ఎవరైనా అలా చేసినా వాటికి చట్టబద్దంగా రిజిస్ట్రేషన్ చేయరు. అనధికారిక ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను అనుసరించి అనుమతులు లేని ప్లాట్లు, నిర్మాణాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలను జారీ చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లు, అధికారిక లే అవుట్లు, గతంలో ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేసిన ప్లాట్లను మాత్రమే ఇకపై రిజిస్ట్రేషన్ చేస్తారు. గృహాలు, భవనాలు, అపార్ట్మెంట్లు ఏవైనా సరే అధికారికంగా అనుమతించిన ప్లాన్ ప్రకారం ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతాయి. బీఆర్ఎస్, బీపీఎస్ కింద ప్రొసీడింగ్స్ తీసుకున్న నిర్మాణాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల పరిధిలో 173 వరకు అక్రమ వెంచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రియల్ వ్యాపారుల్లో గుబులును రేపుతుండగా.. ప్లాట్ల కొనుగోలుదారుల్లో అయోమయాన్ని కలిగిస్తోంది.
- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర రాజధానికి చేరువగా ఉన్న యాదాద్రి భు వనగిరి జిల్లాలో రియల్ వ్యాపారం జోరుమీద ఉన్న ది. పట్టణాలకు సమీపంలో.. ప్రధాన రహదారుల వెం ట ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలోనే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అయితే రియల్టర్లు వెంచర్ల ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోవడం లేదు. ఇవేవీ పరిశీలించకుండానే ప్లాట్లను కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణ సందర్భంలో అనుమతులు రాక.. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక చిక్కుల్లో పడుతున్నారు. జిల్లాలో భువనగిరితో పాటు కొత్తగా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. కొన్ని మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు సైతం విలీనమయ్యాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్న సందర్భంలో ఏర్పాటు చేసిన వెంచర్లకు అప్పట్లో అనుమతులు తీసుకున్నప్పటికీ మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత కూడా వాటికి మరోసారి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అలా ఎవరూ తీసుకోకపోవడంతో మున్సిపల్ అధికారులు సంబంధిత వెంచర్లను అక్రమ లే అవుట్లుగా పరిగణించారు. వైటీడీఏ, హెచ్ఎండీఏ, డీటీసీపీవోల నుంచి అనుమతులు పొందిన వెంచర్లు జిల్లాలో వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉండగా.. భువనగిరి 42, యాదగిరిగుట్ట 3, చౌటుప్పల్ 29, భూదాన్‌పోచంపల్లి 39, ఆలేరు 14, మోత్కూరు మున్సిపాలిటీలో 10 వరకు అక్రమ వెంచర్లు ఉన్నట్లు ఇదివరకే సంబంధిత అధికారులు గుర్తించారు.
ఇవీ తాజా మార్గదర్శకాలు..
ప్రభుత్వ అనుమతులు పొందిన లే అవుట్లలోని ప్లాట్లు, లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) కింద రెగ్యులరైజ్డ్ అయిన ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ఈనెల 26న రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లు, అధికారిక లే అవుట్లు, గతంలో ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేసిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. గృహాలు, భవనాలు అపార్ట్మెంట్లు ఏవైనా సరే అధికారికంగా అనుమతించిన ప్లాన్ ప్రకారం ఉంటేనే రిజిస్ట్రేషన్లు అవుతాయి. బీఆర్ఎస్(బిల్డింగ్ రిజిస్ట్రేషన్ స్కీమ్), బీపీఎస్(బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్) కింద ప్రొసిడింగ్స్ తీసుకున్న నిర్మాణాలకు సైతం రిజిస్ట్రేషన్లు అవుతాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అనుమతిలేని లే అవుట్లలోని భూమి లేదా భవనంలోని కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. అయితే గ్రామ కంఠంలోని స్థలాల్లో ఉన్న భవనాలు, నిర్మాణాలకు ఈ నిబంధన వర్తించదని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
క్రమబద్ధీకరణకు మరోసారి అవకాశం..
అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లను అమ్ముకొని రియల్టర్లు చేతులు దులుపుకోగా.. అమాయక ప్రజలు ఆ ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోతున్నారు. వీరి పరిస్థితిని చూసి ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ఎన్నోమార్లు కల్పించింది. దరఖాస్తుదారులు నిర్ణీత రుసుము చెల్లించి క్రమబద్ధీకరణతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా.. చాలా మంది ముందుకు రావడం లేదు. పలుమార్లు గడువు ఇచ్చినా పలు కారణాలతో క్రమబద్ధీకరించుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల్లో మరోసారి అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తేదీ 25/5/2020న జీవో నం.77ను విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు నాటికి క్రమబద్ధీకరించుకనే అవకాశం ఉంది. అయితే మేళాలు నిర్వహించి సైతం అధికారులు అవగాహన కల్పించినప్పటికీ ఎల్ఆర్ఎస్ పథకానికి ఆశించిన మేరలో దరఖాస్తులు రావడం లేదు. కొత్త మున్సిపాలిటీలు, విలీన గ్రామాల పరిధిలో 2018 మార్చి 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేయడంతో పాటు రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని అనుమతులు జారీ చేసే సమయంలో పట్టణ ప్రణాళిక విభాగానికి చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
- జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నిక
- విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం
- రిమ్జిమ్ రిమ్జిమ్.. హైదరాబాద్
- భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
- 7న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం
- అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
- టీఎస్ బీపాస్‌కు విశేష ఆదరణ
- సురభి గెలుపే ధ్యేయంగా..
- పట్టభద్రులు ఆలోచించండి..!