ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Aug 30, 2020 , 00:08:13

‘నిబంధనల’పై అవగాహన... ప్రమాదాలకు నివారణ

‘నిబంధనల’పై అవగాహన... ప్రమాదాలకు నివారణ

  • n    రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌
  • n    భువనగిరిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం ప్రారంభం 

భువనగిరి అర్బన్‌: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను తగ్గించవచ్చని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్‌భగవత్‌ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల్లో గతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేవని, స్పీడ్‌ లిమిట్‌ బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు తగ్గాయన్నారు. రోడ్డు నిబంధనలు పాటించకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయన్నారు.

పెరుగుతున్న వాహనాలను బట్టి ట్రాఫిక్‌ రూల్స్‌లో మార్పులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు చౌటుప్పల్‌, యాదగిరిగుట్టలో ఉన్నాయని, భువనగిరిలో నూతనంగా ఏర్పాటు చేశామన్నారు. మూడు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లకు ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌ ఇన్‌చార్జి, భువనగిరి ఏరియా, మల్కాజిగిరి ఏరియాకు అడిషనల్‌ ఏసీపీ మనోహర్‌ ఇన్‌చార్జిలుగా నియమించామన్నారు. భువనగిరి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2వేల ఆటోలు ఉండగా, ట్రాఫిక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాయ-2 ఈజ్‌సేఫ్‌ యాప్‌లో 1107ఆటోల నంబర్లు, అడ్రస్‌లు రిజిస్టర్‌ చేశామన్నారు. మైక్యాబ్‌ ఈజ్‌సేఫ్‌ యాప్‌ ద్వారా కమిషనరేట్‌ పరిధిలోని 30వేల క్యాబ్‌ వాహనాల నంబర్‌, అడ్రస్‌లు రిజిస్టర్‌ చేశామన్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందికి ట్రాఫిక్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు తగ్గించడానికి వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. 

అనుభవంతో ఆటంకాలు తప్పించవచ్చు : ఎమ్మెల్సీ 

వాహనం నడిపిన అనుభవంతో ఆటంకాలను తప్పించవచ్చని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. వాహనాలు నడిపే విధానంలో అనుభవం ఉండాలన్నారు. వాహన డ్రైవింగ్‌ విధానంలో శిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుతున్నాయన్నారు. పట్టణం గుండా వెళ్లే భారీ వాహనాలు సులువుగా వెళ్లడానికి మున్సిపల్‌ ఆధ్వర్యంలో రోడ్డును వెడల్పు చేయాలని తెలిపారు. అనంతరం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సీపీ మహేశ్‌భగవత్‌తో కలిసి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌, ట్రాఫిక్‌ అడిషనల్‌ ఏసీపీ మనోహర్‌, ట్రాఫిక్‌ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

పెద్దకొండూర్‌ చెరువును సందర్శించిన సీపీ 

చౌటుప్పల్‌ రూరల్‌ : మండల పరిధిలోని పెద్దకొండూరు చెరువును సీపీ మహేశ్‌భగవత్‌ సందర్శించారు. వినాయక నిమజ్జనంలో భాగంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీపీ నారాయణరెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, ముని, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. 

ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించుకోవాలి

వలిగొండ: ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు వినాయక నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ అన్నారు. శనివారం మండలంలోని సంగెం గ్రామం వద్ద వినాయక నిమజ్జన ఘాట్‌ను డీసీపీ నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. భక్తులు వినాయక విగ్రహాల నిమజ్జనం చేసే సమయంలో కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

చేనేత వస్ర్తాల కొనుగోలుకు కృషి : సీపీ

సంస్థాన్‌నారాయణపురం: లాక్‌డౌన్‌ సమయంలో చేనేత కార్మికులు నేసిన వస్ర్తాలను ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా గానీ, జౌళీశాఖ ద్వారా గానీ కొనుగోలు చేసేలా కృషి చేస్తామని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పుట్టపాకలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్‌ ఆధ్వర్యంలో 8 మంది మహిళా దాతల సహకారంతో గ్రామంలోని 500 మంది చేనేత కళాకారులకు, కార్మికులకు శనివారం నిత్యావసర సరుకులను సీపీ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. పుట్టపాక చేనేతలు నేసిన తేలియారుమాల్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్నదన్నారు.

అలాగే పుట్టపాక చేనేత కళాకారులకు నేసిన వివిధ రకాల చీరలకు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని తెలిపారు. చేనేత కార్మికులు తమ పిల్లలకు చదువుతోపాటు చేనేత వృత్తిని కూడా నేర్పించాలని సూచించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్‌ మాట్లాడుతూ 68 దేశాల ప్రతినిధులు పుట్టపాకను సందర్శించి ఇక్కడ నేసిన చీరలను పరిశీలించి కొనుగోలు చేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో టెస్కో ఆర్డీజీ వెంకటేశ్వరరావు, ఐహెచ్‌డీఎస్‌ అధ్యక్షుడు దోర్నాల జనార్దన్‌, ఎంపీటీసీ మర్రి వసంత, ఉపసర్పంచ్‌ వర్కాల చంద్రశేఖర్‌, గోల సాంబయ్య, గజం గుర్నాథం, గజం సత్యం, యాదగిరి, నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.VIDEOS

logo