సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 28, 2020 , 00:14:49

ప్రగతి చక్రం..ప్రత్యామ్నాయం ఘనం

 ప్రగతి చక్రం..ప్రత్యామ్నాయం ఘనం

  • కరోనా వేళ తగ్గిన రద్దీ, పడిపోయిన ఆదాయం 
  • ప్రత్యామ్నాయంగా కార్గో సేవలు
  • పార్సిల్‌,కొరియర్‌ సేవల్లో చురుగ్గా పాల్గొంటున్న సిబ్బంది
  • ప్రస్తుతం భువనగిరి, తిరుమలగిరిలలో కార్గో కేంద్రాలు 
  • నెలకు రూ.2 లక్షల ఆదాయం 

కరోనా మహమ్మారి అన్ని రంగాలను కుదిపేసింది. వ్యాపారాలను స్తంభింపజేసింది. గుడి,బడి తేడా లేకుండా అన్నివర్గాల ఆదాయ మార్గాలను మూసివేసింది. ప్రజా రవాణాలో అత్యంత కీలకమైన ఆర్టీసీ కూడా వైరస్‌ దెబ్బకు కుదేలవుతోంది. ప్రయాణించే వారు తగ్గడంతో సంస్థ ఆదాయం గణనీయంగా పడిపోయింది. 

విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న ఆర్టీసీ..కరోనా వేళ నిలదొక్కుకునేందుకు ప్రత్యామ్నాయంగా కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలు ప్రారంభించింది. ఉత్తరాలు, చిన్నచిన్న వస్తువులను ప్యాసింజర్‌ బస్సుల్లో చేరవేస్తూ ఆదాయం పెంచుకుంటోంది. జిల్లాలో ఏకైక డిపో యాదగిరిగుట్ట. 108 ఆర్టీసీ బస్సులు కాగా, 58 అద్దె బస్సులు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం రాగా, ఇప్పుడు రూ.5-7 లక్షలకు మిం చడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తు తం భువనగిరి, తిరుమలగిరిలలో రెండుచోట్ల పార్సిల్‌ కేంద్రాలు ప్రారంభించగా, నెలకు రూ.2 లక్షల వరకు సమకూరుతోంది. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుండడంతో జిల్లావ్యాప్తంగా మరో 24 పార్సిల్‌ కేంద్రాలను ప్రారంభించే యోచన ఉన్నట్లు డిపో మేనేజర్‌ రఘు తెలిపారు. ప్రైవేటుకు దీటుగా సేవలందిస్తున్నామని, సిబ్బంది కూడా పార్సిల్‌ సేవల్లో చురుగ్గా పాల్గొం టున్నారన్నారు. కార్గో సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీని ఆదరించాలని ఆయన కోరారు.               

 - యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :కరోనా.. ఆర్టీసీని సైతం అతలాకుతలం చేసింది. రోజురోజుకు విజృంభిస్తుండటంతో సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతున్నది. ఈక్రమంలో జిల్లాలో ఉన్న ఏకైక డిపో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో సైతం నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. బస్సులు నడిపిస్తున్నా ఆశించిన ఆదాయం రావడంలేదు. భక్తుల రాక తగ్గి యాదాద్రి ఆలయం సైతం వెలవెలబోతుండడంతో గుట్టపైకి నడుపుతున్న బస్సుల రూపేణా రావాల్సిన రాబడికి భారీగా గండి పడింది. ఈ పరిస్థితుల్లో నష్టాన్ని పూడ్చుకునేందుకు డిపో అధికారులు పొదుపు చర్యలను చేపట్టడంతోపాటు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా కార్గో సేవలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడం.. ప్రస్తుతం నడుస్తున్న రెండు కేంద్రాల ద్వారా నెలకు రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుండడంతో కార్గో సేవలను మరింత విస్తృతపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మరో 24 కేంద్రాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గుతున్నది. ఇటీవల వరకు పల్లెలు సురక్షితం అనుకున్నా.. కరోనా వైరస్‌లేని పల్లె అనేది లేకుండా వైరస్‌ అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. దీంతో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ప్రజల సౌకర్యార్థం ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం మే నెలలో అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో మే నెల 21వ తేదీ నుంచి ఆర్టీసీ సర్వీసులు తిరగడం మొదలయ్యాయి. మొదట్లో ఓ మోస్తరు రద్దీగా కన్పించిన సర్వీసులు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో చేసేది లేక పలు మార్గాల్లో అధికారులు రద్దు చేశారు. డిపోలో ఉన్న బస్సులో సగం బస్సులనే ప్రధానరూట్లలో తిప్పుతున్నారు. అయినప్పటికీ ఆశించిన మేరలో ఆదాయం రాకపోవడంతో అదనపు ఆదాయం కోసం అందుబాటులో ఉన్న అవకాశాలపై దృష్టిసారించారు. 

యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో ఇదీ పరిస్థితి..

జిల్లాలోనే ఏకైక ఆర్టీసీ డిపో అయిన యాదగిరిగుట్ట డిపోలో మొత్తం 108 బస్సులు ఉండగా.. వీటిలో 58 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ప్రతి రోజు వివిధ రూట్లలో 45వేల కిలోమీటర్లు తిరిగిన ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం 25వేల కిలోమీటర్లకే పరిమితమయ్యాయి. గతంలో రోజుకు 12 నుంచి 15లక్షల వరకు ఆదాయం రాగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5-7లక్షలకు మించి దాటడంలేదు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనార్థం వచ్చే భక్తులను కొండపైకి చేర్చేందుకు గతంలో ఐదు బస్సులను నడుపగా రోజుకు రూ.30వేల వరకు ఆదాయం వచ్చేది. భక్తుల రాక తగ్గడంతో ప్రస్తుతం ఒక్క బస్సునే నడుపుతుండడంతో రోజుకు రూ.5వేల నుంచి రూ.7వేలకు మించి ఆదాయం రావడం లేదు. డిపో పరిధిలో డ్రైవర్లు, కండక్లర్లతోపాటు వివిధ విభాగాలకు చెందిన మొత్తం 440 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరి జీతభత్యాలకే నెలకు రూ.1.50కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డీజిల్‌, ఇతరత్రా వాటికి రూ.1.20కోట్ల వరకు ఖర్చవుతోంది. ఒకప్పుడు వచ్చిన ఆదాయం నేడు లేకపోవడంతో పొదుపు చర్యలకు దిగారు. చాలా వరకు రూట్లలో బస్సులను రద్దు చేశారు. ఆదాయం సమకూరే రూట్లలో అదీ.. రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైతేనే బస్సులను తిప్పుతున్నారు. సంస్థకు చెందిన 50 బస్సులను ప్రతిరోజు పలు రూట్లలో తిప్పుతుండగా.. అద్దె బస్సులను మాత్రం నిత్యం 15 మాత్రమే నడిపిస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి..

నష్టాల ఊబి నుంచి గట్టేందుకు యాదగిరిగుట్ట ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా జూన్‌ 19నుంచి కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్గో బస్సును కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం భువనగిరి, తిరుమలగిరిలలో రెండుచోట్ల కేంద్రాలను ఏర్పాటు చేయగా, నెలకు ఒక్కో కేంద్రం ద్వారా రూ.లక్ష వరకు ఆదాయం సమకూరుతోంది. చిన్నచిన్న వస్తువులు, ఉత్తరాలు.. ఇలా 50 కిలోల బరువు వరకు ప్యాసింజర్‌ బస్సుల ద్వారా తరలిస్తున్నారు. అంతకు మించి బరువు ఉన్న వస్తువులను తరలించాల్సి వస్తే కార్గో బస్సును ఉపయోగిస్తున్నారు. ఈ సేవలను మరింతగా విస్తృతపర్చేందుకు జిల్లా వ్యాప్తంగా మరో 24 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. డోర్‌ డెలివరీ కోసం ఏజెంట్ల నియామక ప్రక్రియను సైతం చేపడుతున్నారు.

కార్గో సేవలకు విశేష స్పందన


కార్గో సేవల ద్వారా వివిధ పార్సిళ్లను భద్రంగా గమ్య స్థానాలకు ఒక్క రోజులోనే చేరుస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో మరో 24చోట్ల కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. ఇందుకు సంబంధించి బొమ్మలరామారం, బీబీనగర్‌, భూదాన్‌ పోచంపల్లి ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల ఏజెంట్ల నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. కార్గో సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని ఆదరించాలని ప్రజలను కోరుతున్నాం.

- రఘు, మేనేజర్‌, యాదగిరిగుట్ట డిపో


VIDEOS

logo