ఆరోగ్యం అద్వితీయం

- రెండు పథకాలతో పల్లె,
- పట్టణవాసుల ఆరోగ్యం పదిలం
- చాలావరకు తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు
- l గతేడాదితో పోల్చితే పత్తాలేని డెంగీ, మలేరియా,చికున్‌గన్యా
- l ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదుకాని కేసులు
- l మిషన్ భగీరథ నీళ్లు, పరిశుభ్రతతో గణనీయ మార్పు
- l కలుషిత నీటికి స్వస్తి..శుద్ధ జలంతో ఆరోగ్య సమాజానికి అడుగులు
- l అనూహ్య మార్పులు తెచ్చిన మిషన్ భగీరథ, పల్లెప్రగతి
వానకాలం వచ్చిందంటే ఊరంతా రోగాలే. జ్వరం, వాంతులు, విరోచనాలు, ఒళ్లు, కాళ్లనొప్పులతో బాధపడుతుండే వారు. అందుబాటులో ఉన్న వైద్యుడిని సంప్రదించడమో లేదా పట్నానికి వెళ్లి దవాఖానలో చూయించుకునే వారు. కాలం మారింది. ప్రభుత్వ ప్రాధామ్యాలు మారాయి. పరిశుభ్రత, స్వచ్ఛమైన నీటినందిస్తే చాలావరకు రోగాలు దరిచేరవని గుర్తించిన సర్కారు మిషన్ భగీరథ ద్వారా ట్యాంకులు నిర్మించడమే కాకుండా ఇంటింటికీ పైపులైన్లు వేసింది.
స్వచ్ఛమైన నీటినందిస్తున్న ప్రభుత్వం.. పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేందుకు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పారిశుద్ధ్యం నిర్వహణ, పురాతన ఇండ్ల తొలగింపు, పిచ్చిమొక్కలు తీసేయడం, బ్లీచింగ్ చల్లడం వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గతంలో రోగులతో కిటకిటలాడిన దవాఖానల్లో ఇప్పుడా హడావుడి కనిపించడం లేదు. మిషన్ భగీరథ, పల్లెప్రగతి రెండు పథకాలు ఆరోగ్యకర సమాజానికి పునాదులు వేశాయి. కలుషితం అనే మాటే వినబడడం లేదు. జిల్లాలో పల్లెప్రగతి నిర్వహణకు ఇప్పటివరకు రూ.117కోట్లు వెచ్చించగా, మిషన్‌భగీరథ పథకానికి రూ.970.34 కోట్లు ఖర్చు చేసి 772 ఆవాసాలకు శుద్ధమైన గోదావరి జలాలను అందిస్తున్నారు.
-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆరోగ్య తెలంగాణకు తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు తగ్గట్టుగా జిల్లాలో అడుగులు పడుతున్నాయి. జిల్లాలో అమలు చేస్తున్న పల్లె ప్రగతి, మిషన్ భగీరథ పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కృష్ణా, గోదావరి శుద్ధజలాలు దాహార్తితో పాటు ఆరోగ్యాన్ని సైతం అందిస్తున్నాయి. మేడ్చల్‌లోని ఘనాపూర్ హెచ్ఎండబ్ల్యూఎస్ జలాశయం నుంచి జిల్లాలోని ఆలే రు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరి జలాలను అందిస్తున్నారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచంపల్లి, మోత్కూరు, అడ్డగూడూరు, వలిగొండ మండ లాలకు అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను అందిస్తున్నారు. రూ.970.34కోట్ల నిధులు వెచ్చించి జిల్లాలో ఉన్న 42 మండలాల పరిధిలోని 772 ఆవాసాలకు శుద్ధజలాలను పంపిణీ చేస్తున్నారు. ఇందుకు నూతనంగా 550 వాటర్ ట్యాంకులను నిర్మించి 3,300 కిలో మీటర్ల మేర పైపులైన్ వేశారు. గడపగడపకు నీరందించే ఉద్దేశ్యంతో 1,56,902 నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేశారు.
అపరిశుభ్రతకు చెక్...
పల్లె ప్రగతితో అపరిష్కృత సమస్యలకు మోక్షం లభించింది. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇబ్బడిముబ్బడిగా నిధులను విడుదల చేయడంతో స్వచ్ఛత రాజ్యమేలుతోంది. మూడు విడతల్లో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 2019-20లో 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.47.18 కోట్లను, రాష్ట్ర వాటా నిధుల కింద రూ.33.28 కోట్లను విడుదల చేసింది. 2020-21 సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.6.27 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.1.17కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.4 లక్షలను కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మాసాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.23.93 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.3.98 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.1.46 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. పాడుబడిన ఇళ్ల కూల్చివేత, పాడు బావుల పూడ్చివేత, నిరుపయోగంగా ఉన్న బోరు బావులను కప్పిపెట్టడం, రహదారులపై గుంతలను గుర్తించి మట్టిపోసి సరి చేశారు. చెట్ల పొదలను తొలగించడం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలను శుభ్రం చేశారు. ఇంటింటికి మరుగుదొడ్డి నినాదంతో సరిపెట్టకుండా ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారా.. అని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ చర్యల ఫలితంగా పల్లెల్లో అపరిశుభ్రత అనేదే లేకుండాపోయింది.
ఆరోగ్య తెలంగాణ దిశగా..
గతంతో పోలిస్తే ఏడాది కాలంలో జిల్లాలో రోగాలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం వచ్చిందంటే మలేరియా, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, కలరా, డయేరియా, ఫైలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు చుట్టుముట్టేవి. ఈ క్రమంలో 2018లో 12 డెంగ్యూ కేసులు నమోదుకాగా.. 2019లో ఆ సంఖ్య 91కి పెరిగింది. 2020లో కేవలం 9 కేసులే నమోద య్యాయి. 2018, 2019లలో మలేరియా ఒక్కొక్క కేసు మాత్రమే నమోదు కాగా ఈ ఏడాది ఒక్క కేసూ లేకపోవడం గమనార్హం. అలాగే 2018లో చికున్ గన్యా కేసులు 2 ఉంటే, 201లో కేసుల సంఖ్య 32కు పెరిగింది. ఈ ఏడాది కేవలం 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మెదడు వాపు వ్యాధి కేసులు 2018లో ఒక్కటీ లేకపోగా 2019లో ఒకే ఒక్క కేసు నమోదయ్యింది. ఈ ఏడాదిలో ఆ వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా లేదు. ప్రతి యేటా ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం జిల్లాలోని 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. కరోనా, దోమలు, లార్వాలను నిలువరించే చర్యల నిమిత్తం అదనంగా మరిన్ని నిధులను వెచ్చిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది సీజనల్ వ్యాధలకు సంబంధించి చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స నిమిత్తం దవాఖానకు వెళ్తే.. పరీక్షలు, మందుల రూపేణా తడిసి మోపయ్యేది. ప్రస్తుతం దవాఖానలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రతి యేటా జూన్, జూలై, ఆగస్టు నెలల్లోనే మందులు, చికిత్సల కోసం జిల్లా ప్రజానీకం రూ.20 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జేబులకు చిల్లులు పడే పరిస్థితులకు కూడా చెక్ పడింది.
ఆరోగ్యానికి అధికప్రాధాన్యం
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో పల్లెప్రగతి, తదితర కార్యక్రమాల మూలంగా పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీంతో వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.
- సాంబశివరావు, జిల్లా వైద్యాధికారి
సీజనల్ వ్యాధులు తగ్గాయి
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షితమైన నీటిని అందింస్తుండడంతో సీజనల్ వ్యాధులు తగ్గాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంటువ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రతపై ఇటు వైద్య ఆరోగ్య సిబ్బందికి, అటు ప్రజలకు అవగాహన కల్పిస్తుండడంతో రోగులసంఖ్య చాలా వరకు తగ్గింది.
- నర్సింహ, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
తాజావార్తలు
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- సుంకాల పెంపుతో పెట్రోల్ భారం రూ.4.21 లక్షల కోట్లు?!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
- ‘లోన్ వరాటు’కి వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రం?
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- 13 మంది ట్రాన్స్‌జెండర్స్ కానిస్టేబుల్స్‌గా నియామకం
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు