అక్రమాల కట్టడికి డిజిటల్ కీ

భువనగిరి : పంచాయతీల్లో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ‘డిజిటల్ కీ’ విధానంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీంతో పాత చెక్కులకు కాలం చెల్లనుండగా, ఇక అంతటా ఆన్లైన్ చెక్కులనే జారీ చేయనున్నది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధుల వర్షం కురిపిస్తుండగా, ఆ నిధులు దుర్వినియోగం కాకుండా వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టి డిజిటల్ కీ విధానాన్ని తీసుకువచ్చింది. ఇప్పటికే పూర్తిస్థాయి ఆన్లైన్ దిశగా అన్ని గ్రామపంచాయతీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటి వరకు పంచాయతీలకు నిధుల విడుదల రాత చెక్కుల రూపంలో ఉండేది. మరికొన్ని చోట్ల పంచాయతీ తీర్మానం లేకుండానే నిధుల వినియోగాలు జరిగేవి.. దీంతో కొన్నిచోట్ల సర్పంచ్‌లు సస్పెండ్లకు గురై, లేదా విచారణలు సైతం ఎదుర్కొన్న ఘటనలు లేకపోలేదు. అక్రమాలకు కళ్లెం వేసి నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగానే గతంలోనే ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరి సంయుక్త సంతకాలతో డిజిటల్ కీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.
పాత విధానానికి చెల్లు....
ఇప్పటి వరకు గ్రామపంచాయతీల్లో నిధుల ఖర్చు కోసం చెక్కులు రాసి ఇచ్చే విధానం అమలులో ఉండేది. గ్రామ అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసి ఆ చెక్‌ను ట్రెజరీ కార్యాలయానికి నేరుగా తీసుకెళ్లేవారు, అన్ని సరిగా ఉండి ఆమోదం పొందితే నిధులు విడుదల చేసుకునే అవకాశం ఉండేది. అయితే తప్పుడు రికార్డులు, పనులు జరుగకున్నా జరిపించినట్లు చూపడం, నకిలీ సంతకాలు, ఫోర్జరీ చేసి నిధులను డ్రా చేసే అవకాశాలు ఉండేది. ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ కీ’ మూలంగా ఎలాంటి అవకతవకలు, లోపాలకు తావు లేకుండా పంచాయతీల నిధులు సద్వినియోగం కానున్నాయి.
ఆన్లైన్ చెక్కు విధానం ఇలా...
‘డిజిటల్ కీ’ కోసం ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్, ఉప సర్పంచ్ల సంతకాల సేకరణ పూర్తై ఇక్కడి నుంచి ప్రత్యేక లెటర్ ద్వారా ఎస్టీవోలకు చేరుతుంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి మీ సేవ, ఇతర ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన ఈ-పంచాయతీ సాఫ్ట్‌వేర్‌ను పంచాయతీ కార్యదర్శులు డౌన్లోడ్ చేసుకున్నారు. గ్రామ పంచాయతీ వివరాలు కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని ఈ-పంచాయతీ వివరాలు కంప్యూటర్లో అప్లోడ్ చేశారు. ఈ-పంచాయతీ సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్లి పంచాయతీ కోడ్‌ను, పని వివరాలు నమోదు చేయాలి. పనుల తీర్మానం కాపీని స్కానింగ్ చేసి ఎంబీ రికార్డు నంబర్, పాసు పుస్తకం స్కానింగ్ చేసి పొందుపర్చాచాలి. దీని విలువ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్లికేషన్ పూర్తైన వెంటనే సబ్మిట్ అనే బటన్క్లిక్ చేయగానే సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో కూడిన డిజిటల్ చెక్ బయటకు వస్తుంది. దీంతో వీరి సెల్‌ఫోన్ నంబర్లకు ఓటీపీ వెళ్తుంది. డిజిటల్ చెక్ వెనుకాల మరోమారు సర్పంచ్, ఉపసర్పంచ్లు ప్రత్యక్షంగా సంతకాలు చేసి ఓటీపీ నంబర్లతో పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎస్టీవోకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తైతే ఎస్టీవో బిల్లు పాస్ చేస్తారు.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు