గురువారం 04 మార్చి 2021
Yadadri - Aug 25, 2020 , 00:40:22

ఘనంగా శతఘటాభిషేకం

 ఘనంగా శతఘటాభిషేకం

యాదాద్రి, నమస్తే తెలంగాణ : స్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా సోమవారం యాదాద్రి బాలాలయంలో శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్‌ నరసింహచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. స్వామివారిని సాయంత్రం రథంలో ఊరేగించారు. బాలాలయంలో నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి  నివేదనలు సమర్పించారు. ఉదయం 8 గంటలకు వేదమంత్రోచ్ఛరణలతో సుదర్శన హోమం చేశారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కల్యాణం కనుల పండువగా చేశారు. అష్టోత్తర పూజలు కూడా అంగరంగా వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడి శివకుమార్‌, వేముల వెంకటేశ్‌, ఎస్‌ వెంకటేశ్వర్‌రావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

స్వామి వారిని దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే 

సోమవారం ఉదయం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామివారికి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించి పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

శివాలయంలో వినాయక పూజలు


పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం ఘనంగా రుద్రాభిషేకం, వినాయకుడికి పూజలు  నిర్వహించారు. ప్రభాతవేళ లో రామలింగేశ్వరాలయంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. శివలింగాన్ని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగ దేవతల విగ్రహాలకు కూడా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అర్చకులు, పూజారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ క్యూలైన్లలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.


VIDEOS

logo