సోమవారం 26 అక్టోబర్ 2020
Yadadri - Aug 24, 2020 , 00:06:31

గణపతికి..ఏకమై..

గణపతికి..ఏకమై..

  • గ్రామాల్లో గణేశ్‌  ఉత్సవాలపై స్వీయ ఆంక్షలు 
  • కరోనా నేపథ్యంలో కఠిన నిర్ణయాలు అమలు 
  • ఊరంతటికి ఒకే వినాయక విగ్రహ ప్రతిష్ఠ 
  • మట్టి విగ్రహాలకే జై కొట్టిన మెజార్టీ పల్లెలు 
  • ఉత్సవాలకు దూరంగా మరికొన్ని గ్రామాలు.. 
  • జిల్లాలో గత యేడాది 3,200 విగ్రహాలు.. 
  • ఈ సంవత్సరం 758 విగ్రహాలకే పరిమితం
  • నిరాడంబరంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు

వినాయక చవితి అంటేనే సందడి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు ఊరూరా సంబురాలు హోరెత్తుతాయి. కులాలు, సంఘాలు, కాలనీల వారీగా గల్లీకి ఒకటి చొప్పున వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు కొలువుదీరుతాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారుచేసిన విభిన్న రూపాల భారీ వినాయకులు దర్శనమిస్తాయి. అయితే ఇదంతా గతం. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా పరిస్థితులు జిల్లా ప్రజల్లో మార్పును తీసుకొచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన మాటలకు జై కొట్టారు. జిల్లా పోలీసు శాఖ చేసిన విజ్ఞప్తుల మేరకు మెజార్టీ పల్లెలు ఊరికి ఒక్కటే విగ్రహాన్ని ప్రతిష్టించాలని తీర్మానించి ఆచరించాయి. అసలు ఉత్సవాలనే నిర్వహించవద్దని మరికొన్ని పల్లెలు నిర్ణయం తీసుకున్నాయి. భారీ విగ్రహాలకు బదులుగా చాలాచోట్ల మట్టి వినాయకులనే ప్రతిష్ఠించారు.  జిల్లా వ్యాప్తంగా గత యేడాది 3,200 విగ్రహాలు ఏర్పాటవ్వగా.. ఈ సారి 758 విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించారు. 

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఓవైపు కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. మరోవైపు పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు పరిస్థితుల నేపథ్యంలో  జిల్లా ప్రజానీకం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కరోనా కట్టడికి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించి స్ఫూర్తిగా నిలిచిన ప్రజలు గణేశ్‌ వేడుకల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గతంలో డీజేలు, బ్యాండ్‌మేళాలతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయకుల నిమజ్జనం సందర్భంగా చెరువుల్లో నీరంతా కలుషితమై జీవరాశులు నాశనం అయ్యేవి. ఈ పరిస్థితుల్లో ఉత్సవాల పేరిట చేసే కార్యం సమాజానికి హితంగా ఉండాలి తప్ప హానీ కలిగించేలా ఉండకూడదని జిల్లా ప్రజానీకం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఏక వినాయక మహోత్సవానికి అనేక పల్లెలు సిద్ధమయ్యాయి. ఫలితంగా శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన గణేశ్‌ ఉత్సవాలు నిరాడంబర వాతావరణంలో మొదలయ్యాయి. మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రజలు మట్టి వినాయకులను ఇంట్లోనే ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహించుకున్నారు. పంచాయతీ పాలకవర్గాలు తీర్మానం చేసుకుని ఊరికి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. గతంలో మాదిరిగా పెద్ద పెద్ద విగ్రహాలకు బదులుగా చిన్న వినాయకులతోనే సరిపెట్టుకుని పూజలు నిర్వహించుకుంటున్నారు. మొదటి రోజు పూజల్లో చాలావరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులే పాల్గొన్నారు. ఒకప్పుడు ఒక ఊరిలో ఒకే విగ్రహం పెట్టగా.. అందరూ ఒకేచోట చేరి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించేవారమని, ప్రస్తుతం.. అలాంటి వాతావరణమే కనబడుతోందంటూ పలువురు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఏకదంతుడు ఒక్కడే.. 

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా సారి గణేశ్‌ ఉత్సవాలకు ఒక ఊరిలో ఒకే వినాయక మండపం ఏర్పాటు చేసుకునేందుకు జిల్లాలో ఎన్నో పల్లెలు ముందుకొచ్చాయి. పాలకవర్గాలు, ఊరి పెద్దలంతా సమష్టి నిర్ణయం తీసుకుని ఆచరిస్తున్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలో మొత్తం 23 గ్రామ పంచాయతీలు ఉండగా గతంలో 150 వరకు గణేశ్‌ మండపాలను ఏర్పాటు చేసేవారు. ఆత్మకూరులోనే 30 వరకు మండపాలు ఏర్పాటయ్యేవి. అయితే ఈసారి మండలం వ్యాప్తంగా కేవలం 30 వినాయకులను ప్రతిష్ఠించారు. మండల కేంద్రంలోనూ ఒక్క వినాయకునే ప్రతిష్ఠించారు. మరో 19 గ్రామాల్లో ఒక్కొక్క వినాయకునే ప్రతిష్ఠించారు. ఇందులో పది గ్రామాల్లో మట్టివినాయకులనే ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తుండటం విశేషం. ఊరి పెద్దలు, పాలకవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రాజాపేట మండలంలోని కొన్‌రెడ్డిచెర్వు గ్రామస్తులు ఈసారి మండపాల వద్ద ఉత్సవాలను నిర్వహించవద్దని నిర్ణయించుకుని ఇంట్లోనే పూజలు జరుపుకున్నారు. బీబీనగర్‌ మండలంలోని పడమటి సోమారంలో గత యేడాది 10 విగ్రహాలను ఏర్పాటు చేయగా..ఈసారి ఊరంతటికీ ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించారు. వలిగొండ మండల పరిధిలోని తుర్కపల్లిలో చిన్న మట్టి గణపతిని స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రతిష్ఠించి ఊరి ప్రజలంతా పూజలు నిర్వహించుకుంటున్నారు. గతేడాది నుంచే ఇక్కడ ఈ పద్ధతి కొనసాగుతోంది. చౌటుప్పల్‌ మండలంలోని పెద్దకొండూరు, జైకేసారం, ఎస్‌.లింగోటం గ్రామాల్లో ఏకదంతుడు ఒక్కడితోనే పూజలు జరుగుతున్నాయి. సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని అల్లందేవి చెరువు, కడపగండి తండా, సీతయ్య తండా, రాధానగర్‌ తండాల్లో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని గిరిజనులు పూజలు చేస్తున్నారు. రామన్నపేట మండలంలోని భోగారం, నిదనపల్లి, లక్ష్మాపురం, కొత్తగూడెం, శోభనాద్రిపురం, ఇస్‌కిల్లా గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున వినాయకులను ప్రతిష్ఠించుకున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు, సైదాపురం, మైలారిగూడెం, మహబూబ్‌ పేట, చిన్నగౌరాయిపల్లి, మాసాయిపేట గ్రామాల్లో, మోటకొండూరు మండలంలో పది గ్రామాల్లో, రాజాపేట మండలంలోని లక్ష్మక్కపల్లి, మల్లగూడెం గ్రామాల్లో, తుర్కపల్లి మండలంలో వీరారెడ్డిపల్లి, వేల్పుపల్లి గ్రామాల్లో, బొమ్మలరామారం మండలంలోని మర్యాలలో ఒకే వినాయక విగ్రహాలతో పూజలు జరుగుతున్నాయి. భువనగిరి, చౌటుప్పల్‌, బీబీనగర్‌, యాదగిరిగుట్ట వంటి పెద్ద పట్టణాల్లోనూ ఈసారి గణనాథుల ప్రతిష్ఠాపన సంఖ్య గణనీయంగా తగ్గింది.  

ఊపిరిపీల్చుకుంటున్న పోలీస్‌ శాఖ

గతంతో పోలిస్తే జిల్లాలో ఈసారి గణేశ్‌ మండపాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత యేడాది జిల్లా వ్యాప్తంగా 3,200 వరకు గణేశ్‌ మండపాల ఏర్పాటు కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని పోలీసుల నుంచి అనుమతులు తీసుకున్నారు. అనుమతులు తీసుకోకుండా ప్రతిష్ఠించుకున్న గణపతుల సంఖ్య ఇంతకంటే ఎక్కువే. అయితే ఈసారి పోలీసులు తెలిపిన గణాంకాల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా 758 వరకు గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు చెబుతున్నారు. గతంలో మండపాల వద్ద పర్యవేక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 450 మంది పోలీసులు విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. ఉన్న అరకొర సిబ్బందితో రోజువారీ విధుల నిర్వహణతో పాటు మండపాల వద్ద అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడం పోలీస్‌ శాఖకు పెను సవాల్‌గా ఉండేది. ఈసారి మండపాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పోలీస్‌శాఖకు బందోబస్తు సమస్య చాలా వరకు తీరింది. మండపాల ఏర్పాటు సందర్భంగా ఆధిపత్య పోరులో ఘర్షణలు సైతం చోటుచేసుకునేవి. నిమజ్జనం సందర్భంగా ఘర్షణలు జరిగేవి. ఈసారి ఆ పరిస్థితులు ఉండే అవకాశాలు చాలా తక్కువని పోలీసులు భావిస్తున్నారు.  

ప్రజల్లో చైతన్యం రావడం శుభపరిణామం..  

కరోనా నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఒక వినాయకుడు మాత్రమే ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం రావడం శుభపరిణామం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పట్టణం, గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీల సభ్యులతో రెండు, మూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ, శానిటైజేషన్‌, మాస్క్‌లు ధరించాలని, పూజలు నిర్వహించే సమయంలో ఎక్కువ మంది ప్రజలు ఉండకూదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించవద్దని సూచించాం. 

- కె.నారాయణరెడ్డి,  డీసీపీ, యాదాద్రి భువనగిరి   logo