క్షణ క్షణం.. కరోనాపై రణం

- జిల్లాలో వైరస్ కట్టడికి సర్కారు ప్రత్యేక చర్యలు
- బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ భరోసా
- ఇంటింటికీ వెళ్లి హోంఐసొలేషన్ కిట్ల అందజేత
- ప్రభుత్వ చర్యలకు తోడ్పాటుగా ఎమ్మెల్యే పైళ్ల ఔదార్యం
- సొంత ఖర్చులతో రెండు ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు
- ఇక హైదరాబాద్‌కు రాం రాం.. స్థానికంగానే పూర్తి వైద్యం
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న క్రమంలో ఏ క్షణాన్నైనా బాధితులకు సత్వర వైద్య సేవలను అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బీబీనగర్ ఎయిమ్స్‌తో పాటు ఏరియా దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఐసొలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు కావాల్సిన మందుల కిట్లనూ వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి అందజేస్తున్నారు. అయితే ఐసొలేషన్‌లో ఉన్నవారికి ఏదైనా అత్యవసరంగా వైద్యం అందించాలంటే హైదరాబాద్‌లోని గాంధీ, ఇతర దవాఖానలకు తరలించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ చర్యలకు తోడ్పాటునందించేందుకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ముందుకు వచ్చారు. ఎయిమ్స్‌తోపాటు భువనగిరి ఏరియా దవాఖాన పరిధిల్లో వంద పడకలతో ఐసొలేషన్ కేంద్రాలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యాధునిక సదుపాయాలు, 24 గంటలు అందుబాటులో డాక్టర్లతో ఇకపై హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా స్థానికంగానే మెరుగైన వైద్యాన్ని పొందే వెసులుబాటు జిల్లా ప్రజలకు కలిగింది. రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రాలు రెండు రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చి కరోనా బాధితులకు సాంత్వన చేకూర్చుతున్నాయి.
- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లె, పట్నం అన్న తేడాలేకుండా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ దవాఖానల్లోనూ కరోనా చికిత్సకు అవసరమైన చర్యలను చేపట్టింది. రానున్న రోజుల్లో వ్యాధి మరింతగా ప్రబలినట్లయితే రోగుల సంఖ్యకు తగ్గట్టు వైద్య సేవలను అందించే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్‌లో 50 పడకలు, భువనగిరి ఏరియా దవాఖానలో 20 పడకలతో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. అలాగే ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో 10 బెడ్ల చొప్పునా ఐసొలేషన్ వార్డులను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా కేసుల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో ర్యాపిడ్ టెస్టులను కూడా ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4,300 మందికి టెస్టులను చేశారు. కరోనా పాజిటివ్‌గా నమోదైన బాధితుల్లో అధిక శాతం హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. వైద్యులతో వీరికి నిత్యం ఆన్లైన్లో వైద్యసాయం అందిస్తున్నారు. అలాగే బాధితులకు కావాల్సిన మందుల కిట్లనూ పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు 1500 వరకు కిట్లు రాగా.. ఇప్పటివరకు 500 వరకు కిట్లను ఇంటింటికీ వెళ్లి వైద్యసిబ్బంది అందజేశారు. అయితే అత్యవసర సందర్భాల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ అవసరమైన బాధితులను హైదరాబాద్‌కు తరలించాల్సి వస్తోంది.
ఎమ్మెల్యే ఔదార్యం..
సామాజిక సేవల్లో తనదైన శైలిలో ఉదారత చూపే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆపత్కాలంలో మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. అత్యవసర సమయాల్లో హైదరాబాద్‌కు బాధితులను తరలించకుండా అత్యాధునిక సదుపాయాలతో జిల్లాలోనే వైద్యం అందించేందుకు నిర్ణయించారు. కరోనా మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు మాస్కు, శానిటైజర్లతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే మందులతో కూడిన కిట్లను పంపిణీ చేసి ముందు నుంచీ ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కొవిడ్ బాధితుల పూర్తిస్థాయి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ.50లక్షల వ్యయంతో బీబీనగర్ ఎయిమ్స్‌లో 50 పడకలు, భువనగిరి ఏరియా దవాఖానలో మరో 50 పడకలతో ఐసొలేషన్ వార్డులను సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలోనే ఈ వార్డుల నిర్వహణ కొనసాగుతున్నప్పటికీ డాక్టర్లు, వైద్య సిబ్బంది వేతనాలతో పాటు, వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది వేతనాలను ఎమ్మెల్యేనే భరిస్తున్నారు. కట్టుబట్టలతో వచ్చే కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చి సురక్షితంగా ఇంటి వద్దకు చేర్చేలా ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రానికి వచ్చే బాధితునికి మూడు జతల బట్టలు, మూడు జతల చెప్పులు, మూడు బక్కెట్లతో పాటు పేస్ట్, సబ్బులను అందించనున్నారు. ఉదయం వేడివేడి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తూనే టీ, కషాయం, ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్‌ను ఇవ్వనున్నారు. కాలక్షేపం కోసం ఎల్ఈడీ టీవీలను కూడా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో అవసరపడే ఆక్సిజన్, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు. ఎయిమ్స్‌లో 5 మంది డాక్టర్లు, 15 మంది నర్సులను నియమించగా.. భువనగిరి ఏరియా దవాఖానలో 10 మంది డాక్టర్లు, 15 మంది నర్సులను నియమించారు. శానిటేషన్ సిబ్బంది, వార్డు భాయ్స్, దోబీలను కూడా నియమించారు. ఔట్ సోర్స్ పద్ధతిన వీరు షిప్టుల వారీగా సేవలు అందిస్తారు. అప్పటికప్పుడే నిర్ధారణ పరీక్షలు చేసేలా ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు బాధితులకు వైద్యం, మందులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు కోలుకున్న తర్వాత ఇంటి వద్ద దిగబెట్టేందుకుగాను అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి వివిధ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పైళ్ల దాతృత్వాన్ని అభినందించగా.. ఎమ్మెల్యే సేవా గుణంపై జిల్లా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అదేస్థాయిలో కరోనా బాధితుల ఆరోగ్య పరిరక్షణకు సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వానికి నా వంతుగా తోడ్పాటునందించేందుకే ఎయిమ్స్, భువనగిరి ఏరియా దవాఖానలో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. ఇందుకు రూ.50లక్షల వరకు వెచ్చిస్తున్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ఓ ఎమ్మెల్యేగా నా బాధ్యత. వైద్య సేవలకోసం ఖర్చు ఎంతైనా సరే వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న. జిల్లాలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే కరోనా బారిన పడితే ఇక్కడి ఐసొలేషన్ కేంద్రాలకు రావొచ్చు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యే వరకు వైద్య సేవలు అందించేందుకు సర్వం సిద్ధం చేసి ఉంచాం.
- పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే
తాజావార్తలు
- ఇదే ప్రతిపక్షాల పని : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- 2048 ఒలింపిక్స్‌కు ఢిల్లీ బిడ్ వేస్తుంది: కేజ్రీవాల్
- కాంగ్రెస్ నేతపై కేంద్ర మంత్రి ఫైర్ : రాహుల్‌ను స్కూల్‌కు పంపితే మేలు!
- నన్ను కాల్చేయండి.. వేడుకున్న క్రైస్తవ సన్యాసిని.. ఫోటో వైరల్
- నన్ను బిడ్డగా ఆశీర్వదిస్తామంటేనే నామినేషన్ వేస్తా: మమతాబెనర్జి
- ఏమిలేకనే దూషణలకు దిగుతున్నారు : మంత్రి జగదీష్ రెడ్డి
- బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితుడు
- ‘పాలపుంత’లో నివసించొచ్చు.. ప్రదేశం కనుగొన్న శాస్త్రవేత్తలు
- బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
- బెంగాల్ పోరు : శివరాత్రి పర్వదినాన తృణమూల్ మేనిఫెస్టో విడుదల!