ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Aug 18, 2020 , 00:02:00

పరమశివుడికి రుద్రాభిషేకం

పరమశివుడికి రుద్రాభిషేకం

యాదాద్రి, నమస్తేతెలంగాణ: యాదాద్రి కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామికి శ్రావణ చివరి సోమవారం సందర్భంగా  మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు శివకేశవులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత బాలాలయంలో లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు. ప్రభాతవేళలో రామలింగేశ్వరాలయంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. శివలింగాన్ని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగ దేవతల విగ్రహాలకు కూడా అభిషేకాలు, అర్చనలు నిర్వహించా రు. భక్తులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ థర్మల్‌ స్క్రీనింగ్‌తో పరీక్షించారు.  

బాలాలయంలో నిత్యపూజలు 

బాలాలయంలో యాదాద్రీశుడికి నిత్య పూజలు నిర్వహించారు. ఉదయం ఐదున్నర గంటలకు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి  నివేదనలు సమర్పించారు. ఉదయం ఎనిమిది గంటలకు వేదమంత్రోచ్ఛారణలతో సుదర్శన హోమం చేశారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్యకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కల్యాణం కనుల పండువగా చేశా రు. దేవేరులను అందంగా ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. అష్టోత్తర పూజలు కూడా అంగరంగ  వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. 

యాదాద్రీశుడికి రూ. 3.02లక్షల ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ. 3,02,905 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.2,74,000, కొబ్బరికాయలతో రూ. 21,000, వాహనపూజలతో రూ. 4,800, చెక్‌పోస్ట్‌ ద్వారా రూ. 570, ప్రచార శాఖ ద్వారా రూ. 825, మినీబస్సు నుంచి రూ.1710 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. 


VIDEOS

logo