శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Aug 17, 2020 , 00:26:38

ఎమ్మెల్యే పైళ్ల దాతృత్వం

ఎమ్మెల్యే పైళ్ల దాతృత్వం

  • సొంత నిధులతో బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు 
  • 50 పడకలు, పది ఆక్సిజన్‌ సిలిండర్లు, రెండు వెంటిలేటర్లు రెడీ 
  •  ప్రారంభించిన ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి 
  • కరోనా లక్షణాలున్న వారు  వినియోగించుకోవాలని హితవు 
  • ఇప్పటికే భువనగిరిలో ఐసొలేషన్‌ కేంద్రం ప్రారంభం 

బీబీనగర్‌ : రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో జనంలో ఆందోళన నెలకొంది. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.బాధితులు చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోనే వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా భువనగిరిలోని జిల్లా దవాఖానలో ప్రత్యేక కొవిడ్‌-19 చికిత్స కేంద్రాన్ని ఇటీవలే ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా బీబీనగర్‌ మండల పరిధిలోని ఎయిమ్స్‌ భవన సముదాయంలో మరొకటి ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందుకు ప్రభుత్వ నిధులతో పాటు తన సొంతంగా దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేసి 50 పడకలతో ప్రత్యేక కొవిడ్‌-19 చికిత్స కేంద్రా న్ని ఏర్పాటు చేశారు. ఆదివారం జిల్లా వైద్య బృందంతో కలిసి చికిత్స కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ దవాఖానతో పాటు బీబీనగర్‌ ఎయిమ్స్‌ భవన సముదాయంలో ప్రత్యేక కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాకులను ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్‌లో 50 పడకలు, 10 ఆక్సిజన్‌ బెడ్లు, రెండు వెంటిలేటర్లు, అత్యవసర సమయానికి మూడు అంబులెన్స్‌ల సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఇక బాధితులకు సేవలందించేందుకు 10 మంది వైద్యులు, 12 మంది స్టాఫ్‌ నర్సులు, 15 మంది వార్డు బాయ్స్‌, 12 మంది శానిటేషన్‌ సిబ్బందిని నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా కొవిడ్‌ బాధితుల కొరకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఏమైనా లక్షణాలు ఉంటే 1800425 7106 నెంబరును సంప్రదించాలన్నారు. ప్రభు త్వ దవాఖానల్లోనే కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. మిగితా రాష్ర్టాల కంటే తెలంగాణలో కొవిడ్‌ మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి ఐసొలేషన్‌ బ్లాక్‌లో ఉంచి వైద్య సేవలందిస్తారన్నారు.వ్యాధి తీవ్రతను బట్టి గాంధీ, ఉస్మానియా దవాఖానకు పంపిస్తారన్నారు. ప్రజ లు భయపడవద్దని, అదేసమయంలో నిర్లక్ష్యం కూడా తగదని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్‌, ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యమందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కరోనా వచ్చిందని తెలియగానే భయపడి, ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవొద్దని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోళి పింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి, బీబీనగర్‌ సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్షీ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్‌, యువజన విభాగం అధ్యక్షుడు ఎలుగుల నరేందర్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.