శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Aug 14, 2020 , 03:19:54

ఉపాధ్యాయ విద్య ఇక నాలుగేళ్లు..!

ఉపాధ్యాయ విద్య ఇక నాలుగేళ్లు..!

నల్లగొండ విద్యావిభాగం :  ఉపాధ్యాయులుగా రాణించాలంటే ఉపాధ్యాయ విద్య విధిగా చదవాల్సిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా ‘ఎన్‌సీటీఈ’ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌), ‘ఎన్‌సీఈఆర్‌టీ’(నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) ఉపాధ్యాయ విద్య (డీఎడ్‌, బీఎడ్‌) కోర్సులో మార్పులు చేస్తూ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దానిలో భాగ ంగా గతంలో ఏడాది ఉన్న ఈ కోర్సులు రెండేళ్లుగా మారింది. సుప్రీం కోర్టు నియమించిన జేఎస్‌.వర్మ కమిషన్‌ నివేదిక ప్రకారం కొన్ని కళాశాలలు నాణ్యతతో కూడిన విద్యనందించడంలో విఫలమవుతూ వస్తున్నాయని, ఛాత్రోపాధ్యాయులు ప్రమాణాలు లేకుండానే డీఎడ్‌, బీఎడ్‌ డిగ్రీలు పొంది ఎలాంటి అవగాహన, కనీస సామర్థ్యాలు లేకుండా ఉంటున్నారని సూచించారు. దీంతో   నాణ్యమైన ఉపాధ్యాయ విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని పలు అంశాలను పేర్కొంటూ కీలక మార్పులు చేసి ఇంటిగ్రేటెడ్‌ నాలుగేళ్ల బీఎడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.  

సమూల మార్పుల దిశగా..

ప్రభుత్వంతోపాటు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే కచ్చితంగా బీఎడ్‌ ఉండాల్సిందే. కానీ దేశవ్యాప్తంగా పుట్టగొడుగులా వస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థల్లో ఉపాధ్యాయులు/అధ్యాపకుల నియామకంలో బోధన నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బీఎడ్‌ డిగ్రీ ఉంటేచాలు అనే విధంగా చాలా సంస్థలు వ్యహరిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించిన విషయం విదితమే. ఈ పరిస్థితిని సమూలంగా మార్పు చేయాలనే నూతన విధానంలో భాగంగా ఇంటిగ్రేడ్‌ బీఎడ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. 

 2030 వరకు రెండేళ్ల బీఎడ్‌కు అవకాశం..

ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఎడ్‌ కోర్సు 2030 వరకు కొనసాగుతుంది. తర్వాత నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ అందుబాటులోకి వస్తుంది. అయితే నాలుగేళ్ల బీఎడ్‌ కోర్సు అందించే సంస్థలు మాత్రమే రెండేళ్ల కోర్సు అందించే అవకాశం ఉంటుంది. రెండేళ్ల కోర్సును అంతకు ముందు బ్యాచిలర్‌ డిగ్రీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ) పూర్తి చేసిన వారు మాత్రమే చదవాల్సి ఉంటుంది.   

మారనున్న ‘బీఎడ్‌' కోర్సు నిర్మాణం ఇలా... 

దేశంలో 2030నాటికి పాఠశాల విద్యా బోధనకు కనీస అర్హతగా నాలుగేళ్ల ఇంటిగ్రేడ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌)ను పరిగణలోకి తీసుకోవాలని నూతన విద్యావిధానంలో సూచించారు. నాలుగేళ్ల కోర్సు చదివేవారికి విస్తృతమైన పరిధిలో కంటెంట్‌, పెడగాజీతోపాటు బహువిషయాలకు సంబంధించిన శిక్షణ అందించవచ్చని భావిస్తున్నారు. ఇక బీటెక్‌ వంటి నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసినవారు, వివిధ పీజీ కోర్సులు పూర్తి చేసినవారు ఒక సంవత్సరం బీఎడ్‌ చేయడానికి అవకాశం కల్పించారు. తర్వాత పీజీలో తమ ప్రత్యేక సబ్జెక్టును పరిగణలోకి తీసుకుని ప్రత్యేక ఉపాధ్యాయునిగా వెళ్లవచ్చు. మరో వై పు ఇన్‌సర్వీస్‌లో ఈ కోర్సులో చేరేవారికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నిర్వహించే అవకాశం కల్పించారు.      

2021-22లో ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ ..

నూతన విద్యావిధానం ప్రకారం 2021-22లో  అన్ని ప్రభుత్వ డైట్‌(డీఎడ్‌) కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సు అందుబాటులోకి రానుంది. ఇంటర్మీడియేట్‌ అర్హతతోనే ఈ కోర్సులో విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్‌సీటీఈ, ఎస్‌ఈఆర్‌టీ ఆధ్వర్యంలో సిలబస్‌(కరిక్యులమ్‌), పెడగాజీని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రత్యేక ఎడ్‌సెట్‌తో ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు పర్యవేక్షణ ఎస్‌ఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) ఆధ్వర్యంలో ఉండనుండగా పరీక్షల నిర్వహణ మాత్రం యూనివర్సిటీలకు కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ డైట్‌లో చేరే విద్యార్థులకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించనుంది.    

VIDEOS

తాజావార్తలు


logo