శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 13, 2020 , 00:04:22

దిట్టంగా ఆర్థికంగా..

దిట్టంగా ఆర్థికంగా..

  • జాతీయ కృత్రిమ గర్భోత్పత్తిప్రారంభం 
  • మేలైన పశుసంపదే ప్రధాన లక్ష్యం 
  • రెండేండ్లుగా కృషి కల్యాణ్‌ యోజన పథకం అమలు 
  • జిల్లాలో రెండోదఫా మొదలైన కృత్రిమ గర్భోత్పత్తి  
  • వచ్చే మే 31 వరకు కొనసాగించేలా పశుసంవర్ధకశాఖ ప్రణాళిక 
  • గ్రామానికి వంద పశువుల లెక్కన 356 గ్రామాల్లో అమలు
  • మేలుజాతి పశుసంపదతోపాటు పాల ఉత్పత్తి పెంపునకు చర్యలు  

పశువులు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటేనే పాల ఉత్పత్తి పెరగడంతోపాటు వాటిసంపద వృద్ధి చెందుతుంది. మేలుజాతి పశుసంపద  పెంపే లక్ష్యంగా కేంద్రం జాతీయ కృషి కల్యాణ్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టగా రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్నది. పథకం కింద కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ రెండేండ్లుగా నిర్వహిస్తుండగా, ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రెండో విడుత జిల్లాలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా లక్షా పదివేల ఆవులు,బర్రెల్లో 50 శాతం పశువులకు ఉచితంగా వీర్య దానం చేయనున్నారు. దీనికి సంబంధించి 356 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేయగా ఒక్కో గ్రామంలో 100 పశువులకు ఉచితంగా ఇంజక్షన్లు ఇస్తారు. దీనివల్ల పశుసంపద భారీగా వృద్ధి చెందడమేగాక పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి పాడి రైతులు ఆర్థికంగా రాణించనున్నారు. కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల వివరాలను పశువైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 

-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,  నమస్తేతెలంగాణజిల్లాలో మేలు జాతి పశు సంపదను అభివృద్ధి చేయడంతో పాటు పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం రెండో దఫా చేపడుతున్న జాతీయ కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈ కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచే జిల్లాలో మొదలవ్వగా వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా పశు సంవర్ధక శాఖ చేసింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షా పదివేల ఆవులు, బర్రెల్లో 50 శాతం పశువులకు ఉచితంగా వీర్య దానం చేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో 356 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేయగా, ఒక్కో గ్రామంలో వంద పశువులకు ఉచితంగా వీర్యదానం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో జిల్లాలో రెండో విడుతలోనూ చేపడుతున్నారు.

        యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మేలైన పశు సంపదను అభివృద్ధి చేసేందుకు కృషి కల్యాణ్‌ యోజన పథకం కింద కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గత రెండుండ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేలుజాతి దేశీయ, సంకరజాతి ఆంబోతు, దున్నపోతుల నుంచి సేకరించిన వీర్యంతో సాధారణ పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. గత యేడాది జిల్లాలో మొదటి విడుతలో సెప్టెంబర్‌ 26 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో గుర్తించిన వంద రెవెన్యూ గ్రామాల్లో 17,356 మంది రైతులకు చెందిన 20వేల పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం మరో దఫా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నది. ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు జిల్లాలో లక్షా పదివేల పశువులు గర్భధారణకు అనుకూలంగా ఉంటాయని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 50శాతం పశువులకు ఉచితంగా మూడుసార్లు వీర్యదానం చేసే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

ప్రతి రెవెన్యూ గ్రామంలో వంద పశువులకు వీర్యదానం

జిల్లాలో చేపడుతున్న కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమం అమలు కోసం 356 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. ప్రతి గ్రామంలో వంద ఎదకు వచ్చిన పశువులను ఎంపిక చేసి కృత్రిమ గర్భధారణ చేయనున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 35,600 పశువులకు గర్భధారణ చేయనుండగా, ఒక్కొక్క పశువుకు మూడు ఉచితంగా వీర్యదానం చేస్తారు. ఒకవేళ ఒకటి, రెండు వీర్య దానాలకే గర్భం నిలిచినట్లయితే మిగిలిన వీర్య నాళికలను ఇతర పశువులకు అందించే వీలు కలుగుతుంది. దీనివల్ల జిల్లాలో 50వేల పశువుల వరకు ఉచితంగా వీర్యదానం చేసే అవకాశం కలుగుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన గ్రామాలకు పశువైద్య సిబ్బంది, గోపాల మిత్రలు వెళ్లి నేరుగా రైతులను కలిసి వారికి సంబంధించిన పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్‌ వేస్తారు. వంద కంటే ఎక్కువ పశువులకు ఇంజక్షన్‌ వేయాల్సి వస్తే సంబంధిత రైతు నుంచి ఇంజక్షన్‌కు రూ.40 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ కార్యక్రమం అమలుతో జిల్లాలో మేలు జాతి పశు సంపదతోపాటు పాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉన్నది.

పాడి రైతులకు ప్రయోజనం

ప్రభుత్వం అమలు చేస్తున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమంతో పాడి రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతున్నాయి. పశు సంపద, పాల ఉత్పత్తి పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా రాణించే అవకాశం ఉంటుంది. జిల్లాలో గత యేడాది నిర్వహించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి రెండో దఫాలో అమలు చేస్తున్నాం. గర్భధారణ చేసిన పశువుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. పలు ప్రయోజనాలు ఉన్న ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లను ఇప్పించాలని కోరుతున్నాం.

- కృష్ణ, పశు సంవర్ధక శాఖ అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా


VIDEOS

logo