శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 12, 2020 , 02:42:22

మీనం..ఘనం

మీనం..ఘనం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు గోదావరి జలాలు.. మరోవైపు మూసీ ప్రవాహంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో నీటి వనరుల్లో చేపల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నీలి విప్లవం పేరుతో ప్రతియేటా ఉచితంగా చేపపిల్లలను నీటి వనరుల్లో వదులుతున్న ప్రభుత్వం ఈసారి ఐదో విడుతలోనూ చేపల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో నీటి వసతి ఉన్న 366 చెరువుల్లో 2.20 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు జిల్లా మత్స్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను రూ.కోటికి పైగా ప్రభుత్వం వెచ్చిస్తున్నది. నీటి వనరుల్లో చేపల విడుదల ప్రక్రియ బుధవారం నుంచి జిల్లాలో లాంఛనంగా ప్రారంభమవుతుండగా, తొలుత బీబీనగర్‌ చెరువు నుంచి ఇందుకు శ్రీకారం చుడుతున్నారు. సమీకృత అభివృద్ధి పథకం కింద మత్స్య కార్మికుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుండగా.. తాజాగా చేప పిల్లలను సైతం వదులుతుండటంతో జిల్లాలోని 123 మత్స్య పారిశ్రామిక సంఘాల పరిధిలో ఉన్న 8,500 కుటుంబాలు ఏడాది పొడవునా జీవనోపాధి పొందనున్నాయి.

మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతియేటా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను జలాశయాల్లో వదులుతోంది. 2018-19 సంవత్సరంలో 99లక్షల చేపపిల్లలను, 2019-20 ఏడాదిలో 2.15 కోట్ల చేపపిల్లలను జిల్లా మత్స్యశాఖ చెరువుల్లో వదలగా, ఈ ఏడాది 2.20కోట్ల చేప పిల్లలను వదులుతోంది. 82ఎం.ఎం సైజుగల ఒక్కో చేపపిల్లకు రూ.1.04 పైసలను, 35-40ఎం.ఎం సైజుగల చేప పిల్ల కోసం 45 పైసల చొప్పున ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది వదిలే చేప పిల్లల కోసం రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. నీలి విప్లవం పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం చేప పిల్లలను సైతం పూర్తి సబ్సిడీపై మత్స్య కార్మికులకు అందిస్తుండటంతో ఆయా వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

366 చెరువుల్లో వదిలేందుకు ఏర్పాట్లు..

జిల్లా వ్యాప్తంగా 172 వరకు పెద్ద చెరువులు, 956 వరకు చిన్న చెరువులు ఉన్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతం వెంట మరో 20 వరకు చెరువులున్నాయి. ఈసారి జిల్లాకు తొలిసారిగా గోదావరి జలాలు రాగా.. వర్షాలు సైతం సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు చెరువులు నిండు కుండల్లా కన్పిస్తుండగా, చేప పిల్లలు పెరిగేందుకు నీటి లభ్యత ఉన్న 366 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. మత్స్యశాఖ ఆధీనంలో ఉన్న 172 చెరువుల్లో 142 వరకు చెరువుల్లో నీటి లభ్యత ఉండటంతో వీటిల్లోనూ చేప పిల్లలను వదలనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 123 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, మరో ఐదు వరకు మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 8,500 మంది సభ్యులు ఉన్నారు. గడిచిన నాలుగేండ్లలో చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదలడంతో ఏటా రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని మత్స్యకార్మికులు అందిపుచ్చుకుంటున్నారు. వీరితోపాటు గ్రామ పంచాయతీ చెరువుల పరిధిలో ఉన్న నాన్‌ సొసైటీ సభ్యులకు సైతం ప్రతి ఏటా నీటి విప్లవం ఫలితాలు అందుతున్నాయి. బుధవారం నుంచి జిల్లాలో చేపల పంపిణీ ప్రక్రియ మొదలవుతుండగా, బీబీనగర్‌ పెద్ద చెరువు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

నేడు ఎమ్మెల్యే రాక  

బీబీనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లలను బుధవారం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చేతులమీదుగా వదలనున్నట్లు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

VIDEOS

logo