మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 11, 2020 , 02:51:35

‘ఫోర్జరీ’తో భూములు కాజేశారని మహిళ ఆత్మహత్యాయత్నం

‘ఫోర్జరీ’తో భూములు కాజేశారని మహిళ ఆత్మహత్యాయత్నం

యాదాద్రి, నమస్తేతెలంగాణ : వారసత్వంగా వస్తున్న తమ భూములను కొందరు గ్రామ పెద్దలు ఫోర్జరీ సంతకాలతో అమ్ముకున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన మల్లెబోయిన నర్సమ్మ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకెళ్తే.. 1956 నుంచి తమ కుటుంబ పెద్దల మీదనే ఉన్న భూమిని గ్రామ మాజీ సర్పంచ్‌ మంగ సత్యనారాయణ, పల్లెపాటి శ్రీను, ఎర్ర అయిలయ్యలు ఫోర్జరీ సంతకాలతో అమ్ముకున్నారని ఆరోపిస్తూ సోమవారం యాదగిరిగుట్ట తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట బరిగె కిష్టయ్య, పండుగ సుశీల, మల్లెబోయిన నర్సమ్మ, కందుకూరి పోసాని, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కార్యాలయం నుంచి తహసీల్దార్‌ బయటకు వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు.

కొవిడ్‌ నేపథ్యంలో కార్యాలయంలోకి ఒక్కొక్కరిని మాత్రమే అనుమతిస్తుండటంతో వారు ఆఫీసు బయటనే ఆందోళనకు దిగారు. తాసిల్దార్‌ బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఆందోళన చేస్తున్న పండుగ సుశీల డబ్బాలో తెచ్చుకున్న కిరోసిన్‌ ఒంటిపై  పోసుకోవడంతో పోలీసులు వెంటనే ఆమెను వారించారు. కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తాసిల్దార్‌ అశోక్‌రెడ్డికి బాధితులు  వినతిప్రతం అందించారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ మాట్లాడుతూ.. వినతిపత్రంలో పేర్కొన్న మేరకు ఆయా సర్వే నంబర్లలోని రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలోనూ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  


logo