బుధవారం 30 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 11, 2020 , 00:03:47

కరోనా పరీక్షలు వేగిరం

 కరోనా పరీక్షలు వేగిరం

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లు 
  • శరవేగంగా పరీక్షలు, అరగంటలోనే ఫలితం 
  • పాజిటివ్‌ వచ్చి ఆరోగ్యంగా ఉన్నవారికి హోం ఐసొలేషన్‌ 
  • లక్షణాలు తీవ్రంగా ఉంటేనే దవాఖానకు తరలింపు 
  • బాధితులకు మెడికల్‌ కిట్లు అందజేత 

శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం ఓ పక్క చర్యలు తీసుకుంటూనే మరోవైపు పరీక్షలను వేగవంతం చేసింది. కరోనా అనుమానితులకు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తూ అరగంటలో ఫలితమిచ్చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చి ఆరోగ్యంగా ఉన్న వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచుతుండగా, లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని వెంటనే దవాఖానలకు తరలిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యులు, సిబ్బంది కొండంత ధైర్యాన్నిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ మెడికల్‌ కిట్లు అందిస్తున్నారు. 

- చౌటుప్పల్‌/బీబీనగర్‌ 


చౌటుప్పల్‌/బీబీనగర్‌: చౌటుప్పల్‌  మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో కరోనా పరీక్షలను ముమ్మరం చేశారు.  రోజూ ఉదయం 10 గంటల నుంచే పరీక్షలకు బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా ప్రభుత్వ దవాఖాన నుంచి 500 కరోనా పరీక్షల కిట్లు రాగా..390 మందికి పరీక్షలు చేశారు. పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఏరోజు చేసిన పరీక్షల ఫలితాలను అదే రోజు వెల్లడిస్తున్నారు.పాజిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు.

అరగంటలో ఫలితాలు..

కరోనా టెస్టులు చేయించుకునేందుకు చౌటుప్పల్‌తో పాటు చుట్టు పక్కల మండలాల నుంచి నిత్యం 20 నుంచి 30 మంది వస్తున్నారు. టెస్టులకు వచ్చిన వారి అడ్రస్‌, ఫోన్‌ నంబర్లు తీసుకుంటున్నారు. పరీక్షకు వచ్చిన వారి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్న గంటలోపే ఫలితాలు వెల్లడిస్తున్నారు. అరగంట నుంచి గంట వ్యవధిలోనే  కరోనా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు  390 మందికి పరీక్షలు చేయగా..అందులో 65 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో 62 మందిని హోంఐసొలేషన్‌లో ఉంచగా..ఎక్కువ లక్షణాలు ఉన్న ముగ్గురు సికింద్రాబాద్‌లోని గాంధీ, పంజగుట్టలోని నిమ్స్‌, మరొకరు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.  కరోనా లక్షణాలు లేక పాజిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచుతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చిన మాస్కులు, గ్లౌజులతో పాటు మెడిసిన్‌ ఉన్న కిట్‌ను అందజేస్తున్నారు. 

మెరుగైన వైద్య సేవలు..

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి చౌటుప్పల్‌ మం డల వైద్యాధికారి డా. శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. హోం ఐసొలేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మెడికల్‌ కిట్లను అందజేస్తున్నారు. 17 రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. మెడిసిన్‌ వాడే పద్ధతిని సవివరంగా వివరిస్తున్నారు. లక్షణాలు ఎక్కువైతే వెంటనే ఫోన్‌చేసి సంప్రదించాలని సూచిస్తున్నారు. కాగా స్థానిక సీహెచ్‌సీలో కరోనా  టెస్టులు చేయడం, ఉచితంగా మెడికల్‌ కిట్లు అందజేయడంపై చౌటుప్పల్‌ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బీబీనగర్‌లో... 

బీబీనగర్‌లోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మొ దటి విడుతగా 25 కిట్లు వచ్చాయి. తాజాగా రెం డో విడుతలో 50 చొప్పున కిట్లు  అందజేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. 12 మందికి కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్‌ వచ్చింది. నియోజకవర్గంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానతో పాటు బీబీనగర్‌, బొల్లెపల్లి, వలిగొండ, వర్కుట్‌పల్లి, వేములకొండ, పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కిట్లు పంపిణీ చేశారు. భువనగిరిలోని జిల్లా దవాఖాన, బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో నిర్వహించే టెస్టులకు సైతం  కిట్లు అందజేస్తున్నట్లు జిల్లా సర్విలెన్స్‌ ఆఫీసర్‌ మనోహర్‌ తెలిపారు.

390 మందికి కరోనా పరీక్షలు 


చౌటుప్పల్‌ సీహెచ్‌సీలో కరోనా పరీక్షలు చేస్తున్నాం.  రోజూ కరోనా టెస్టులు చేయించుకునేందుకు చాలామంది వస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలి. ఇప్పటికే 500 కిట్లు రాగా..390 మందికి పరీక్షలు చేశాం. పాజిటివ్‌ వచ్చిన వారిని హోంఐసొలేషన్‌లో ఉంచి మెరుగైన వైద్యం చేస్తున్నాం. ఎవరూ భయాందోళనకు గురికావద్దు. 

- డా. అలివేలు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌, చౌటుప్పల్‌


logo