మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Aug 10, 2020 , 00:02:33

ఆధ్యాత్మిక గిరి

ఆధ్యాత్మిక గిరి

  • అద్భుత క్షేత్రంగా యాదాద్రి పునర్మిర్మాణం
  • l తుది దశకు చేరిన ప్రధాన ఆలయ పనులు
  • l పర్యాటకంగా పరిసర ప్రాంతాల అభివృద్ధి
  • l నలుదిక్కులా విస్తృతమవుతున్న రహదారులు
  • l రెండు మహానగరాల మధ్య దివ్యమైన క్షేత్రం
  • l ‘ప్రారంభోత్సవం’ తర్వాత భారీగా భక్తులు వచ్చే అవకాశం


యాదాద్రి, నమస్తే తెలంగాణ : రాష్ర్టానికే తలమానికంగా, నల్లరాతి శిలలతో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 4ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో ప్రధాన ఆల య నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నా యి. గర్భాలయం, ముఖమంటపం, అంతర బా హ్య ప్రాకార మంటపాలు, అష్టభుజి మంటపా లు, దివ్య విమానం, ఆరు రాజగోపురాలు, బ్ర హ్మోత్సవ మంటపం, పుష్కరిణిల నిర్మాణాలు తుదిదశకు చేరుకొని తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. 12 భక్తాగ్రేసర ఆళ్వారుస్వాముల విగ్రహాల ఏర్పాటు పూర్తికావచ్చింది. శివాలయం, ఆంజనేయస్వామి, ఆండాళ్‌, గరుడాలయాల ఫ్లోరింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి


నల్లరాతి నిర్మాణానికి విద్యుత్‌ వెలుగులు..

అత్యంత దృఢమైన, నాణ్యమైన, కాలుష్యానికి, వాతావరణ మార్పులకు వెరవని, చెదరని నల్లరాతి శిలలతో అద్భుతంగా పునర్నిర్మితమవుతున్న ఆలయంలో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో విద్యుత్‌, లైటింగ్‌ పనులు చేపట్టనున్నారు. ఆమేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, భవిష్యత్‌లో ప్రమాదాలకు వీలు లేకుండా విద్యుదీకరణ పనులు చేపట్టనున్నారు. ఆలయానికి  నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా కొండ కింద సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతికతో 1600 కేవీ సామర్థ్యం గల విద్యుత్‌ కంట్రోల్‌ రూమ్‌ను నిర్మిస్తున్నారు. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఇది దోహదపడుతుంది. అత్యవసర వినియోగం కోసం 1000 కేవీ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రానికి పడమరన కొండకింద ఉన్న గండి చెరువు వద్ద  రూ.6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పుష్కరిణి పనులు ఊపందుకున్నాయి. 68 మీటర్ల పొడవు, 58 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న పుష్కరిణికి అడుగు భాగంలో రియిన్‌ ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ (ఆర్‌సీసీ)తో ఫ్లోరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రానైట్‌ పనులు కొనసాగుతున్నాయి. పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా మొత్తం 150 గదులు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. తలనీలాలు సమర్పించుకునే భక్తులకు ఇబ్బందులు లేకుండా దీనికి సమీపంలో కల్యాణ కట్టను ఏర్పాటు చేయనున్నారు.

పర్యాటకంగా పరిసరాలు..

ఓ వైపు అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తుది దశకు చేరుకోగా, కొండ కింద పరిసర ప్రాంతాలు పర్యాటక శోభను సంతరించుకుంటున్నాయి. ఆలయానికి మూడు కిలోమీటర్ల  దూరంలో ఉన్న రాయగిరిలో నరసింహ, ఆంజనేయ అరణ్యాల్లో అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేశారు. వీటిని ఇటీవలే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. భువనగిరి మండలంలోని రాయగిరి-1 రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రూ. 2.8 కోట్లతో 56 హెక్టార్లలో ఆంజనేయ అరణ్యాన్ని, రాయగిరి-2 రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 97 హెక్టార్లలో రూ. 3.6 కోట్ల వ్యయంతో నరసింహ అరణ్యాన్యి అభివృద్ధి చేశారు. ఇక్కడ ఎత్తయిన గుట్టపై జలపాతాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేలా సౌకర్యాలు కల్పించారు. అలాగే కొండకు పడమర వైపున ఉన్న గండి చెరువును అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ తెప్పోత్సవాలు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు. టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయనున్న 800 ఎకరాల్లో భాగంగా యాదాద్రి దివ్య క్షేత్రానికి దక్షిణం దిక్కున ఉన్న పెద్దగుట్టపై సుమారు 250 ఎకరాల పైగా స్థలాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పెద్దగుట్ట పైకి వెళ్లడానికి రెండు ఘాట్‌ రోడ్లు నిర్మించారు. కొండపై సుమారు 250 ఎకరాల స్థలాన్ని చదును చేసి విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశారు. పచ్చదనం ఉట్టిపడేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. అక్కడ నిర్మాణాల కోసం ప్లాట్లు చేశారు. వసతి గృహాలు, తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు.

సమీపంలోనే భాగ్యనగరం

యాదాద్రి క్షేత్రానికి సమీపంలోనే సుమారు 55 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‌ నగరం ఉన్నది. శివారు ప్రాంతాలతో కలిసి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) 80 లక్షల జనాభా ఉంటుంది. అలాగే యాదాద్రితో సరిహద్దు కలిగిన మేడ్చల్‌ జిల్లాలో జవహర్‌నగర్‌, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, నిజాంపేట కార్పొరేషన్లు అత్యంత సమీపంలో ఉన్నాయి. చేరువలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పేట కార్పొరేషన్లు ఉన్నాయి. యాదాద్రికి 90 కిలోమీటర్ల దూరంలో వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ఉన్నది. ఇక్కడ సుమారు 15 లక్షల జనాభా ఉన్నది. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఈ రెండు మహా నగరాల్లోనే ఉన్నారు. అందులోనూ ఎక్కువ ఆర్థికంగా ఉన్న వారు కూడా ఈ పట్టణాల్లోనే ఉన్నారు. దీంతో ఈ రెండు మహానగరాల నుంచి యాదాద్రికి విశాలమైన రవాణా సౌకర్యం ఉండటంతో గంటన్నరలోనే ఇక్కడికి చేరుకోవచ్చు.

వేగంగా ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌..

యాదగిరిపల్లి- సైదాపురం మార్గంలో యాదాద్రికొండకు సమీపంలోనే దక్షిణం వైపున ఉన్న ఓ గుట్టపై నిర్మిస్తున్న ప్రెసిడెన్సిల్‌ సూట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. స్వామి వారి దర్శణానికి వచ్చే ప్రముఖులకు వసతి సౌకర్యం కల్పించడాని చిన్నగుట్టపైన, కొండ కింద కలిపి సుమారు 15 వరకు విల్లాలు నిర్మిస్తున్నారు. వీటి స్లాబ్‌, గోడల నిర్మాణం పూర్తై తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఒకటి రెండు నిర్మాణాలకు రంగులు కూడా వేశారు. ఆలయానికి వచ్చే ప్రముఖుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో వీటిని  ఏర్పాటు చేస్తున్నారు.

పర్యాటకంగా బస్వాపూర్‌..

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నరసింహ(బస్వాపూర్‌) రిజర్వాయర్‌ను పర్యాటకంగానూ అభివృద్ధి చేయనున్నాను. ఇది యాదాద్రి క్షేత్రానికి 10కి.మీ. దూరంలోనే ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు 16ప్యాకేజీ కింద చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయింది. 11.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లోనే 1.5 టీఎంసీల నీటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి ఈ ప్రాజెక్టులోకి గ్రావిటీ ద్వారానే నీటిని తరలించవచ్చు.  ఇక్కడ బోటింగ్‌తో పాటు టూరిజం కాటేజీలు నిర్మించనున్నారు.

నలు దిక్కులా విశాలమైన రోడ్లు..


యాదాద్రి క్షేత్రానికి  సులభంగా చేరుకోవడానికి నలు దిక్కులా  విస్తృతమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌-వరంగల్‌ ప్రధాన రహదారిలో రాయగిరి నుంచి యాదాద్రికి నాలుగు లేన్ల రహదారిని ఇప్పటికే పూర్తి చేసి ప్రారంభించారు. రహదారికి ఇరువైపులా, సెంట్రల్‌ మీడియన్‌లో మొక్కలు నాటి  పచ్చదనం ఉట్టిపడేలా అభివృద్ధి చేశారు. రాయగిరి స్టేషన్‌ వద్ద ఇప్పటికే ఉన్న రెండు లేన్ల రైల్వే ఓవర్‌ బ్రిడ్జితోపాటు మరో బ్రిడ్జిని నిర్మించి ఇటీవల ప్రారంభించారు. బ్రిడ్జి పక్కన రక్షణ గోడలపై నరసింహుడి చరిత్ర, ఆధ్యాత్మిక సూక్తులతో వాల్‌ రైటింగ్‌ చేశారు. హైదరాబాద్‌ శివారు నుంచి రాయగిరి వరకు గతంలో నిర్మించిన నాలుగు లేన్ల టోల్‌ రోడ్డు ఉండగా, రాయగిరి నుంచి వరంగల్‌ వరకు చేపడుతున్న నాలుగు లేన్ల రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి. అలాగే కొండ చుట్టు గిరి ప్రదక్షిణ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి.  యాదాద్రి నుంచి కీసరకు చేపడుతన్న నాలుగు లేన్ల 150 ఫీట్ల రోడ్డు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి.. తుర్కపల్లి నుంచి గుట్ట వైపు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. యాదాద్రి నుంచి రాజపేట మార్గంలోనూ నాలుగు లేన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి భక్తులు యాదాద్రి చేరుకోవడానికి ఇప్పటికే సువిశాల రోడ్లు అందుబాటులో ఉండగా..  రాజాపేట, కీసరల వైపు నుంచి కూడా గుట్టకు రావడానికి 150 అడుగుల నాలుగు లేన్ల రోడ్లు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీ, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా యాదాద్రికి రోడ్డు మార్గాలు విస్తృతం చేస్తున్నారు. 


VIDEOS

logo