మహమ్మారి ప్రతాపంతో తగ్గిన నేరాలు

- ప్రజలు ఇండ్లల్లో.. పోలీసులు వీధుల్లో
- నిరంతరం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు
- రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలకు బ్రేక్
- సగానికి తగ్గిన హత్యలు,హత్యాయత్నాలు
- పెచ్చరిల్లుతున్న కుటుంబ వివాదాలు, భూతగాదాలు
- ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు
ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టాలంటే భయం..ఎక్కడికెళ్లితే కరోనా అంటుకుంటుందోనన్న ఆందోళన.. వెలవెలబోతున్న రహదారులు..మరోవైపు స్వచ్ఛందంగా లాక్డౌన్..వెరసి జిల్లావ్యాప్తంగా నేరాలు తగ్గుముఖం పట్టాయి. ప్రజలు ఇండ్లల్లో ఉంటుంటే..పోలీసులు వీధుల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. వాహనాల రాకపోకలు పెద్దగా లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు సగానికి సగం తగ్గాయి. హత్యలు, హత్యాయత్నాలకు బ్రేక్ పడింది. ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావడంతో చోరీలకు విరామమొచ్చింది. లాక్డౌన్ నేపథ్యంలో పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరగడంతో అక్కడ వివాదాలు ముదురుతున్నాయి. భూవివాదాలు, కౌలు పంచాయితీలతోపాటు కుటుంబ గొడవలూ అధికమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీలు అమాంతం పెరగగా, అదునుచూసి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వినియోగదారుల కళ్లుగప్పి బ్యాంకు ఖాతాల్లో నిల్వలను దోచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నేరాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేకంగా విశ్లేషించింది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో నేరాలను కూడా విశ్లేషించింది. ఇందులో పలు ఆసక్తికరమైన కోణా లు వెలుగుచూశాయి.
-భువనగిరి క్రైం
భువనగిరి క్రైం : కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు అన్ని రంగాలపైన స్పష్టంగా కనిపిస్తున్నది. అన్నింటితోపాటు నేరాలు, ఘోరాలు, రోడ్డు ప్రమాదాల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తున్నది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు, ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చుకుంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో క్రైం రేట్ తగ్గిందనే చెప్పవచ్చు. కరోనా ఎఫెక్టుతో మార్చి నుంచి విధించిన లాక్డౌన్ కారణంగా పోలీసులు అనునిత్యం పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి గల్లీగల్లీలో గస్తీని పెంచారు. దీంతో ఇండ్లల్లో చోరీలు, రోడ్డు ప్రమాదాల లాంటివి చాలావరకు తగ్గాయి. ఇదే క్రమంలో ప్రజలు పూర్తిగా ఇండ్లకే పరిమితమవడంతో గ్రామాలు, పట్టణాల్లో కొన్ని రకాల చిన్నచిన్న తగాదాలు మాత్రం పెరిగాయి.
పెరిగిన గస్తీ..
కరోనా నివారణకు ప్రభుత్వం లాక్డౌన్ ఏర్పాటుచేయడంతో పోలీసులకు లాక్డౌన్ అమలును సవాల్‌గా స్వీకరించారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటునే వైరస్‌పై అవగాహన కల్పించారు. ప్రజలందరి క్షేమం కోసం పోలీసులు నిరంతరం రోడ్లపైనే విధులు నిర్వహించారు. దీంతో పాటు గ్రామస్థాయిలో ప్రతి కూడా ప్రతి గల్లీకి పోలీసులు రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహించారు. దీంతో చాలా చోట్ల ఇండ్ల దొంగతనాలతో పాటు ఇతరత్రా నేరాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయి.
తగ్గిన నేరాలు..
గత సంవత్సరం నాలుగు నెలలతో (మే నుంచి జూలై) పోల్చుకుంటే ఈ సంవత్సరం హత్యానేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. గత సంవత్సరం 7 హత్యలు, 19 హత్యాయత్నాలు జరుగగా.. ఈ సంవత్సరం 2 హత్యలు, 9 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు రోడ్డు ప్రమాదాలపై కూడా చాలా ఎఫెక్టు పడింది. లాక్డౌన్ రోజుల్లో దాదాపుగా రహదారిపై వాహనాల ప్రయాణాలు ఎక్కువగా కొనసాగలేదు. లాక్డౌన్ సడలింపులతో కొద్దికొద్దిగా ప్రయాణాలు మొదలయ్యాయి. అయితే గత సంవత్సరంలో 79 రోడ్డు ప్రమాదం కేసులు నమోదవగా, ఈ సంవత్సరం 41 కేసులు నమోదయ్యాయి.
పెరిగిన తగాదాలు...
గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈసారి చిన్నచిన్న తగాదాలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదైనట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ప్రజలంతా ఇంటి వద్దనే ఉండటంతో పాటు, పట్టణాలు, తదితర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సొంత గ్రామాలకు వచ్చారు. దీంతో గ్రామంలో పెండింగ్‌లో ఉన్న భూ తగదాలతో పాటు, ఇతరత్రా చిన్నచిన్న గొడువలు మాత్రం కొద్ది మేరకు పెరిగాయి. అదేవిధంగా లైంగిక దాడులకు సంబంధించి గత సంవత్సరం 4 కేసులు నమోదవగా.. ఈ సారి 11 కేసులు నమోదు అయినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
డీసీపీ ప్రత్యేక శ్రద్ధ..
యాదాద్రి భువనగిరి జోన్ జిల్లా పరిధి పూర్తిగా జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంటుంది. విజయవాడ-హైదరాబాద్, వరంగల్-హైదరాబాద్ రహదారులు జిల్లా మీదనుంచే వెళ్లడంతో డీసీపీ నారాయణరెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హైవేలపైన నిరంతరం గస్తీ, అంతరాష్ట్ర దొంగలపై నిఘా, ఎప్పటికప్పుడు జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేస్తూ అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తుల కదలికలను అనునిత్యం గమనిస్తూనే ఉన్నారు.
ప్రజల సహకారం చాలా అవసరం..
కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటుచేసిన లాక్డౌన్ ప్రారంభం నుంచి జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిఘాను పెంచాం. హైవేలతో పాటు అన్ని రహదారులపై చెక్‌పోస్టులు, గ్రామాల్లో పెట్రోలింగ్ చేయడం వలన చాలా నేరాలు అదుపులో ఉన్నాయి. అయితే ప్రతి నేర నియంత్రణకు పోలీసులు తీసుకునే చర్యలతో పాటుగా ప్రజల సహకారం చాలా అవసరం. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రజలు సైతం పోలీసులకు సహకరించారు. ఇలాంటి సమన్వయం భవిష్యత్‌లో కూడా చాలా ముఖ్యం. పాత నేరస్తులపైన కూడా నిఘాను పెంచాం. మా పోలీసులు కూడా అనునిత్యం అప్రమత్తతతో పనిచేస్తున్నారు.
-నారాయణరెడ్డి, యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ
తాజావార్తలు
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
- సాయి పల్లవి సారంగదరియా పాటపై ముదురుతున్న వివాదం
- సైనిక స్థావరంలో భారీపేలుడు.. 20 మంది మృతి