బుధవారం 30 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 05, 2020 , 22:37:33

క‌రువు తీరా కాళేశ్వ‌ర గంగ‌

క‌రువు తీరా కాళేశ్వ‌ర గంగ‌

నీళ్లుంటేనే చేతినిండా పని. నీళ్లుంటేనే సంపద. నీళ్లుంటేనే ఆర్థికవృద్ధి. దీన్ని గుర్తెరిగిన అపరభగీరథుడు, సీఎం కేసీఆర్‌ ఎక్కడో కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. జూన్‌లో ప్రారంభించిన కొండపోచమ్మ జలాశయం ఎడమ కాల్వ ద్వారా జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు గోదారమ్మ తరలివస్తోంది. ఇప్పటివరకు తుర్కపల్లి మండలంలో గోపాలపురం పరిధిలోని పొట్టోనికుంట, మల్లయ్య కుంట, పోచమ్మ చెరువు, నాగాయపల్లి చెరువులు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయి. బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్‌ పరిధిలోని తిమ్మప్ప చెరువు, గూడెం చెరువుల్లోకి  ఇప్పుడిప్పుడే గోదారమ్మ చేరుతోంది. రేపోమాపో మల్లన్న చెరువు, సోలిపేట ఊర చెరువులోకి నీళ్లు రానున్నాయి. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో మత్తడి దుంకుతున్న చెరువులను చూసి రైతన్నల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నది. ‘ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నం. కరువు ప్రాంతానికి నీళ్లిచ్చి గోస తీరుస్తున్న సీఎం కేసీఆర్‌కు మేమంతా రుణపడి ఉంటాం. గోదారమ్మ రాకతో ఈ రెండు మండలాల్లో సాగు విస్తీర్ణం రెట్టింపు కానుంది’ అని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ఆనందం వ్యక్తం చేశారు.  

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘సంకల్పం సిద్దించింది.. కార్యదీక్షత ఫలించింది.. ఊరికి ఆదెరువు.. జలకళలాడుతున్నది. నిండుకుండల్లా కనిపిస్తున్న తటాకాలు.. వాటిల్లో అనేకం మత్తడిపోస్తున్న దృశ్యాలు.. అన్నదాతల్లో భరోసా నింపుతున్నాయి. కొండపోచమ్మ సిగ నుంచి దిగువకు పారుకుంటూ వచ్చి వాగులు.. వంకలు దాటుకుంటూ చెరువుల్లోకి చేరిన గోదారమ్మతో ఎటు చూసినా చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. కరువు నేలపై అడుగిడిన కాళేశ్వరం నీళ్లను చూసి రైతాంగం ఆనందపడుతున్నది. ప్రతి ఎకరాన్ని అభిషేకించి బతుకు చిత్రాన్ని మార్చేందుకు వచ్చిన గంగమ్మ రాకతో సబ్బండ వర్ణాలు ఆనందంలో ముగినితేలుతున్నాయి. కలల స్వప్నాన్ని కళ్లెదుట సాక్షాత్కరింపజేసిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌కు గ్రామీణ ప్రజానీకం జేజేలు పలుకుతున్నది. కొండపోచమ్మ జలాశయం నుంచి గత జూన్‌లో విడుదల చేసిన నీటితో జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులు, కుంటలు నిండుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఎవరి నోట విన్నా కాళేశ్వరం ముచ్చటే వినిపిస్తున్నది. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి భగీరథ ప్రయత్నాలు ఫలించి చెరువులు, కుంటలన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితులు.. కరువు కాటకాలతో గత పదేండ్లుగా చుక్క నీరు లేక వెలవెలబోయిన జలాశయాలు పంటల సాగుకు ఊరట కల్గిస్తున్నాయి. ఇకపై పంటలు ఎండుడన్న మాటలే వినబడవని రైతులు ఆనందపడుతున్నారు. సమృద్ధిగా చేరిన వరద నీటితో భవిష్యత్‌పై బెంగ అనేదే లేకుండా పోయిందని మత్స్యకార్మికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.’

అపర భగీరథుని కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ జలాశయం జిల్లా రైతాంగం ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ ఫలితంగా కాళేశ్వరం తొలి ఫలాలు జిల్లాలో ఆలేరు నియోజకవర్గానికి దక్కాయి. ప్రభుత్వ విప్‌ కరువు ప్రాంతానికి నీరందించేందుకు చేసిన భగీరథ ప్రయత్నాలు సైతం ఫలించడంతో గోదావరి జలాలతో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. కొండపోచమ్మ సాగర్‌ జలాశయం ద్వారా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన 1.80లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందులో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ జలాశయం ఎడమ కాల్వ నుంచి మర్కూక్‌, జగదేవపూర్‌ మండలాలతో పాటు జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్న చెరువులను నింపేందుకు జూన్‌ 24న ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. రానున్న రెండు, మూడు నెలల్లో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని అన్ని చెరువులను నింపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని గొలుసుకట్టు చెరువులను క్రమక్రమంగా నింపుతున్నది. ఇప్పటివరకు తుర్కపల్లి మండలంలో గోపాలపురం పరిధిలోని పొట్టోని కుంట, మల్లయ్య కుంట, పోచమ్మ చెరువు, నాగాయపల్లి చెరువులను నింపారు. నాగాయపల్లి చెరువు చిన్న లక్ష్మాపూర్‌ గ్రామ చెరువులోకి గోదావరి జలాలు మెలమెల్లగా చేరుతున్నాయి. అలాగే బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్‌ గ్రామ పరిధిలోని తిమ్మప్ప చెరువు, గూడెం చెరువుల్లోకి ప్రస్తుతానికి గోదావరి జలాలు చేరాయి. కొద్దిరోజుల్లోనే మల్లన్న చెరువు, సోలిపేట ఊర చెరువుల్లోకి సైతం గోదావరి నీళ్లు వచ్చి చేరనున్నాయి. 

పెరిగిన సాగువిస్తీర్ణం..

గత కొన్నేండ్లుగా తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లో సాగు అంతంత మాత్రంగానే ఉంది. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి వర్షమే ఆధారం. చెరువుల్లోకి కొద్దిపాటిగా వచ్చే వర్షం నీటితోనో.. ఆగిఆగి పోసే బోరు బావుల నీళ్లతోనో పంటలను సాగు చేసేవారు. శాశ్వత నీటి వనరులు లేక వానకాలంలో తప్ప మిగతా సమయాల్లో భూములన్నీ బీడుగానే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్‌ నుంచి వస్తున్న గోదావరి నీటితో ఈ ప్రాంత ముఖచిత్రమే మారబోతున్నది. బీడుగా మారిన భూములన్నీ పచ్చని పంట పొలాలుగా మారనున్నాయి. ప్రస్తుతం వానకాలంలో పెరిగిన సాగు విస్తీర్ణమే ఇందుకు ఉదాహరణ. తుర్కపల్లి మండలంలో గత ఏడాది వానకాలంలో 2,149 ఎకరాల్లో వరి సాగవ్వగా ఈసారి ఏకంగా వరి సాగు విస్తీర్ణం 5,869 ఎకరాలకు పెరిగింది. అలాగే బొమ్మలరామారం మండలంలో గత యేడాది వానకాలంలో 2వేల ఎకరాల్లో వరి సాగవ్వగా ఈసారి అదనంగా 500 ఎకరాలు వరి సాగవుతోంది. దశాబ్దాలుగా నిండని చెరువులు గోదావరి జలాలతో కళకళలాడుతుండటంతో ఇకపై ప్రతి యేటా రెండు పంటలను పండించుకునే మంచి రోజులు వచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నం..

మొదటి నుంచీ ఆలేరు నియోజకవర్గానికి గోదావరి నీళ్లిస్తమని చెబుతూనే వస్తున్నం. 2018 ఎన్నికల్లోనూ ఇదే హామీని ప్రధానంగా ఇచ్చాము. సీఎం కేసీఆర్‌ ఆలేరు ప్రచార సభలో ఆలేరు నియోజకవర్గానికి గోదావరి నీళ్లిస్తమని స్పష్టమైన ప్రకటన చేసినరు. ఇది సాధ్యం అయ్యే పనికాదని చాలామంది నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినరు. కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నుంచి తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఎంతటి కష్టసాధ్యమైన లక్ష్యానైనా చిత్తశుద్ధి ఉంటే పూర్తి చేయవచ్చని నిరూపించినం. అప్పట్లో విమర్శించినోళ్లే నీళ్లను చూశాక పొగుడుతున్నరు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నలభై ఏండ్ల కరువును పారదోలేందుకు గోదావరి నీళ్లను పారించిన సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. - గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌

కలలో కూడా ఊహించుకోలే.. భీమరి కుమార్‌, రైతు, గోపాలపురం

కలలో కూడా ఊహించుకోలేనిది సీఎం కేసీఆర్‌ కండ్ల ముందర ఉంచినరు. నా చిన్నప్పటి నుంచి జూత్తున్న. మా చుట్టుపక్కల అంతా కరువే ఉండేది. బావులు, బోర్లకింద పారే కొన్ని నీళ్లతోనే ప్రతి యేడు కొద్దిపాటిగ పంటలను వేసుకుంటూ వస్తున్నం. గోదావరి నీళ్లను తీసుకొచ్చి కేసీఆర్‌ సారు.. మాకు కరువనేదే లేకుండా చేస్తున్నరు. మత్తడి దుముకుతున్న చెరువులను గిప్పుడే జూస్తున్న. ఇసోంటి రోజులు వస్తయనుకోలె. 

బతుకుకు భరోసా ఇచ్చిర్రు..నాయిని పోచయ్య,  మత్స్యకార్మికుడు, తిమ్మాపురం

వర్షం వస్తనే చెరువులల్లకు నీళ్లొస్తయి. అదీ.. ఎప్పుడో ఐదేండ్లకోసారి. వచ్చిన నీళ్లు కూడ కొద్దిరోజుల్లనే ఎండిపోయేవి. చేపలు పడితేనే మాకు బతుకు దెరువు. చెరువుల్ల నీళ్లు లేక మా బతుకులు ఆగం అయినవి. కేసీఆర్‌ సారు ఉచితంగ చేప పిల్లలను చెరువులల్ల వదులుతున్నా.. నీళ్లు లేక చేతినిండ పని లేకుండా పాయే. గిప్పుడు గోదారమ్మ వచ్చినంక చెరువులన్నీ కళకళలాడుతున్నయ్‌. కండ్ల సంబురంగా ఉన్నది. బతుకుకు భరోసా ఇచ్చిన కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటం.
logo