మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 04, 2020 , 23:58:11

గ‌ణ‌ప‌య్యా.. గండాలు తీర్చ‌వ‌య్య‌

గ‌ణ‌ప‌య్యా.. గండాలు తీర్చ‌వ‌య్య‌

మోత్కూరు : రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా చేసుకునే పండుగ వినాయక చవితి.. వాడవాడలా విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఇందు కోసం పండుగ రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తుంటారు. వినాయక ప్రతిమలను తయారు చేసే వారికి ఆర్డర్లు ఇచ్చి వినూత్నంగా  అలంకరణ చేయించుకుంటారు. పండుగ రోజు నుంచి నిమజ్జనం వరకు ఎంతో కోలాహలంగా ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పరిస్థితి తలకిందులయ్యేలా ఉంది. దీంతో వినాయక ప్రతిమల తయారీదారులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా కాటు తప్పేలా లేదు.. 

ఆగస్టు 22వ తేదీన వినాయక చవితి. అయితే ఈ ఏడాది పండుగకు కరోనా కాటు తప్పేలా లేదు. కొవిడ్‌-19 కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతున్న తరుణంలో కూలీలు, వలస కూలీలు జీవన భృతిని కోల్పోతున్నారు. ప్రతి యేటా గణపయ్య ప్రతిమల తయారీల ద్వారా జీవనోపాధి పొందుతున్న కూలీలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. వినాయక ప్రతిమలను పెద్ద సంఖ్యలో రూపొందించాలంటే కరోనా వల్ల గ్రామాలు, పట్టణాల్లో ప్రతిమల ఏర్పాటు చేస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి విగ్రహాలు తయారు చేస్తే.. వాటిని భక్తులు కొనుగోలు చేయకుంటే తీవ్రంగా నష్టపోతామని బెంబేలెత్తుతున్నారు. కరోనా మా పొట్ట కొట్టేలా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా...

 పట్టణ, మండల కేంద్రాల్లో రాజస్థాన్‌తోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వారు, స్థానికులు వందల సంఖ్యలో  విగ్రహాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదికి ఆరు నెలల పాటు ప్రతిమల తయారీల వల్ల కూలీలు, వలస కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. మోత్కూరు, చౌటుప్పల్‌, భువనగిరి, రామన్నపేట, యాదగిరిగుట్ట, ఆలేరు,  పెంబర్తీ, జనగామ ఇంకా అనేక చోట్ల ప్రతిమలను తయారు చేసే  కూలీలు, శిల్పులు ఉన్నారు.

పెట్టుబడి అధికం.. 

ప్రతి యేటా వినాయకచవితి సందర్భంగా తయారీదారులు రూ.లక్షలు వెచ్చించి విగ్రహాలను రూపొందిస్తారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, రంపపు పొట్టు, టెంకాయ పీచు, చెక్కలు తదితర ముడి సరుకులను భారీగా కొనుగోలు చేస్తారు. రెండు దశల్లో ప్రతిమలను తయారు చేసి అమ్మకాలు సాగిస్తారు. ప్రతి యేటా ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచే విగ్రహాల తయారీ పనులు ప్రారంభించి జూన్‌ చివరి వారంలోగా పూర్తిచేస్తారు. రెండో దశలో తయారు చేసిన ప్రతిమలకు రంగులను అద్దడం ప్రారంభించి పండుగనాటికి విగ్రహాలను సిద్ధం చేస్తారు. ఇందుకోసం ప్రతినిత్యం ఐదారుగురు కూలీల ఒక్కొక్కరికీ రోజుకు రూ.450 నుంచి రూ.500 వరకు రోజువారీ కూలీ డబ్బులు చెల్లిస్తారు. రంగులు వేసేందుకు బయటి ప్రాంతాల నుంచి రప్పించి వారికి కాంటాక్టు పద్ధతిలో నగదు చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల యువకులు పండుగకు రెండు నెలల ముందుగానే తమకు కావాల్సిన ఆకృతుల్లో వినాయకుని ప్రతిమ చేయాలని తయారీ కేంద్రాల వారికి ఆర్డర్‌ ఇస్తారు. ఇందు కోసం కొందరు అడ్వాన్సుల రూపంలో కూడా నగదు చెల్లిస్తుంటారు. ఈసారి పరిస్థితి అలా లేదు. కరోనా కారణంగా ప్రతిమలను పెట్టాలా? వద్దా? అని అనేక మంది ఉత్సావాల  నిర్వాహకులు ఆలోచనలో పడి వెనకడుగు వేస్తున్నారు. దీంతో తయారీదారులు అందోళన చెందుతున్నారు.


logo