సోమవారం 26 అక్టోబర్ 2020
Yadadri - Aug 04, 2020 , 00:04:11

కరోనా కుదుపు..ఆదుకున్న పొదుపు

కరోనా కుదుపు..ఆదుకున్న పొదుపు

  • n ఆపత్కాలంలో పొదుపు నిధులు జమ చేసిన సర్కారు  
  • n గడువు ముందే రూ.29.44 కోట్లు అందజేత 
  • n చేనేత మిత్ర ద్వారా నూలు కొనుగోలుపై రూ.2.50 కోట్ల సబ్సిడీ  
  • n నిల్వ వస్ర్తాలు కొనుగోలు చేసి రూ.2 కోట్ల వరకు చెల్లింపు
  • n లాక్‌డౌన్‌ వేళ చేనేత కార్మికులకు సర్కారు చేయూత  
  • n ఆర్థిక భరోసా కలిగిందంటున్న నేతన్నలు 

లాక్‌డౌన్‌ వేళ నూలు పోగును నమ్ముకున్న నేత కార్మికులకు సర్కారు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం 2017లో థ్రిఫ్ట్‌ పథకాన్ని ప్రారంభించింది. కార్మికులు ప్రతినెలా తమ వేతనంలో 8 శాతం పొదుపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం తన వాటా కలిపి నేతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నది. మూడేండ్లు పూర్తయ్యాక వడ్డీతో కలిపి అందజేస్తుంది. జిల్లావ్యాప్తంగా 44 చేనేత సహకార సంఘాలుండగా, వీటి పరిధుల్లో 5400 మంది కార్మికులున్నారు. వీరంతా పథకంలో చేరి పొదుపు చేసుకుంటూ వస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆదాయమార్గాలు మూసుకపోవడంతో ప్రభుత్వం ఆరునెలల ముందుగానే పొదుపు సొమ్మును విడుదల చేసింది. పొదుపు సొమ్ముకు వడ్డీ కలిపి ఇప్పటివరకు 5వేల మందికి రూ.29 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అలాగే 261 మంది మరమగ్గాల కార్మికులకు రూ.44 లక్షల వరకు పొదుపు నగదు అందించింది. ఇలా ఒక్కో నేతన్నకు సగటున రూ.40 వేల నుంచి రూ.1.40 లక్షల వరకు అందాయి. 

-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణ 

  • మనకు వచ్చిన ఆదాయంలో భవిష్యత్తు అవసరాల కోసం నెలకు కొంత పొదుపు చేసుకుంటాం. ఆపత్కాలంలో అవసరం పడుతుందని దాచుకుంటాం. ఇలా దాచుకున్న సొమ్ము కష్టకాలంలో ఎన్నో అవసరాలు తీరుస్తుంది. కరోనా మహమ్మారిఅన్నిరంగాలను కుదేలు చేసినట్లే చేనేత రంగాన్ని కూడా కుదిపేసింది.
  • చేతినిండా పనిలేక, చెమటోడ్చి నేసిన బట్టలు గుట్టల్లా పేరుకుపోయాయి. నిల్వ వస్ర్తాలుకొనుగోలుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే విరివిగా చేనేత వస్ర్తాలు ధరించాలని ప్రచారం చేస్తోంది. 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ వేళ.. నూలు పోగును నమ్ముకున్న నేతన్నలు ఆర్థికంగా చితికిపోతున్నారు. రంగురంగుల చీరలను ప్రపంచానికి అందించిన చేనేత బతుకుల్లో చీకట్లు ముసురుకున్నాయి. ఒకప్పుడు తాను చేనేతను అని గర్వంగా చెప్పుకున్న నేతన్న ఇప్పుడు అప్పులపాలై ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతో ఇష్టంగా ఈ వృత్తిని ఎంచుకున్నవారే నేడు ఇతర రంగాల్లో దినసరి కూలీలుగా మారిపోతున్నారు. మరమగ్గాల నుంచి విపరీతమైన పోటీ.. ముడి సరుకుల ధరలు ఆకాశానికి చేరి.. మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు తీపి కబురును అందించింది. ‘చేనేతకు చేయూత’ పథకం ద్వారా గడువుకు ఆరు నెలల ముందుగానే రూ.29.44కోట్ల పొదుపు నగదును యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నేతన్నల ఖాతాల్లో జమ చేసింది. ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా కొనుగోలు చేసిన నూలుకు సంబంధించి రూ.2.50కోట్ల సబ్సిడీ మొత్తాన్ని అందజేసింది. కరోనా పరిస్థితుల్లో కొనుగోళ్లు లేక నిల్వలు పెరిగిన పరిస్థితుల్లో టెస్కో ద్వారా చేనేత వస్ర్తాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2కోట్ల వరకు చెల్లించింది. కరోనా వ్యాప్తితో పనులులేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నేతన్నలకు గొప్ప ఊరటను కలిగిస్తున్నాయి.

కరోనా మహమ్మారి ఎన్నో కీలక రంగాలను అతలాకుతలం చేసింది. మార్చిలో మొదలైన కరోనా వ్యాప్తి చేనేత రంగాన్ని సైతం తాకింది. ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపి చేనేత కార్మికులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. మే నెలలో తిరిగి పనులు ప్రారంభమైనప్పటికీ కార్మికులకు గతంలో మాదిరిగా చేతినిండా పని దొరకడం లేదు. ఓ వైపు ఉపాధి సన్నగిల్లడం.. మరో వైపు కొనుగోళ్లు తగ్గి నిల్వలు సైతం పేరుకుపోవడంతో కార్మికులకు పని లేకుండా పోయి కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న చేనేత సంఘాల్లో సగానికి పైగా మూతపడ్డాయి. దీంతో కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం ‘చేనేతకు చేయూత’, ‘చేనేత మిత్ర’ పథకాల కింద ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు టెస్కో ద్వారా పేరుకుపోయిన వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి అండగా నిలిచింది.

త్రిఫ్ట్‌ పథకం కింద నేతన్నల ఖాతాల్లో రూ.29.44కోట్లు జమ..

ఆపత్కాలంలో తెలంగాణ ప్రభుత్వం త్రిఫ్ట్‌ పథకంలో భాగంగా అమలు చేస్తున్న చేనేతకు చేయూత పథకం కింద విడుదల చేసిన నిధులు చేనేత కార్మికుల జీవనానికి కొండంత భరోసా కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించింది. కార్మికుడు తన వేతనంలో ప్రతి నెలా 8 శాతం పొదుపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 16శాతం తన వాటా ధనంగా నేతన్నల ఖాతాల్లో జమ చేస్తుంది. మూడేండ్ల వ్యవధి ముగిశాక మిత్తితో సహా కార్మికులకు ఈ పథకం ద్వారా నగదును అందజేస్తారు. జిల్లా వ్యాప్తంగా 44 చేనేత సంఘాల పరిధిలో 5,400 మంది కార్మికులు ఉండగా.. వీరంతా త్రిఫ్ట్‌ పథకంలో చేరి నెలనెలా పొదుపు చేసుకుంటూ వచ్చారు. పథకం ప్రారంభమైన ఆరు నెలల తర్వాతనే చాలా మంది ఈ పథకంలో చేరారు. అయితే లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే పొదుపు నగదును విడుదల చేసింది. పొదుపు సొమ్ముతోపాటు మిత్తిని కలిపి ఇప్పటి వరకు 5వేల మంది చేనేత కార్మికులకు రూ.29కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే 261 మంది మరమగ్గాల కార్మికులకు సైతం రూ.44లక్షల వరకు పొదుపు నగదును అందించింది. ఒక్కో కార్మికుడికి సగటున రూ.40వేల నుంచి రూ.1.40లక్షల వరకు పొదుపు డబ్బులు వచ్చాయి.

చేనేత మిత్ర ద్వారా రూ.2.50కోట్ల సబ్సిడీ అందజేత..

చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలు పైననూ 40 శాతం సబ్సిడీ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఇందులో 35 శాతం కార్మికులకు చెల్లిస్తుండగా.. మిగతా 5 శాతం సబ్సిడీని సంఘానికి, లేకుంటే గ్రూపు లీడర్‌కు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రభుత్వం ఆమోదించిన ఎన్‌హెచ్‌డీసీ సంస్థలో గానీ, ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్న డిపోల్లో గానీ కొనుగోలు చేసిన నూలుకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లిస్తున్నది. జనగామ, చౌటుప్పల్‌, ఆలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో కార్మికులు ఎక్కువగా నూలును కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు రూ.2.50కోట్ల వరకు సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం కార్మికుల ఖాతాల్లో జమ చేసింది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 6వేల మంది లబ్ధిపొందారు. లాక్‌డౌన్‌ ప్రభావం చేనేత వస్ర్తాల కొనుగోళ్లపై సైతం చూపడంతో నేతన్నల వద్ద పెద్ద మొత్తంలో నిల్వలు పేరుకుపోయాయి. దీంతో టెస్కో ద్వారా ప్రభుత్వమే వస్ర్తాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం ఇటీవలనే విడుదల చేసింది. జిల్లాలో 11 సంఘాల ద్వారా కొనుగోలు చేసిన వస్ర్తాలకు సంబంధించి ఇప్పటికే రూ.2కోట్ల వరకు చెల్లించడం పూర్తయిందని, త్వరలోనే రూ.3 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించనున్నది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలువడం పట్ల ఆయా కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.

పారదర్శకంగా పొదుపు డబ్బుల చెల్లింపు..


దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పొదుపు డబ్బులను ప్రభుత్వం నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేస్తున్నది. లాక్‌డౌన్‌లో ఉపాధి కరువైన కార్మికులకు ‘చేనేతకు చేయూత’, ‘చేనేత మిత్ర’ పథకాలు గొప్ప మేలును చేకూర్చుతున్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఈ సాయం కొంతమేర ఊరటనిస్తోంది. టెస్కో ద్వారా కొనుగోలు చేసిన వస్ర్తాలకు సంబంధించి పూర్తిస్థాయిలో బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

- ఎం.వెంకటేశం, అసిస్టెంట్‌ డైరెక్టర్‌,  చేనేత, జౌళిశాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా
logo