బుధవారం 30 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 03, 2020 , 00:09:28

అనుబంధాల రాఖీ

అనుబంధాల రాఖీ

  • నేడు రక్షా బంధన్‌ 
  • సోదరీసోదరుల ఆత్మీయ పండుగ 
  • తరాలు మారినా చెక్కుచెదరని వేడుక 
  • రాఖీ పౌర్ణమికి కరోనా ఎఫెక్ట్‌.. తగ్గిన రాఖీల విక్రయాలు 
  • అనుబంధ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం 

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. నాకు నీవు రక్ష.. నేను నీకు రక్ష అంటూ సందేశాన్నిచ్చే పండుగ నేడు. తరాలు మారినా చెక్కు చెదరకుండా అన్నాచెల్లెళ్లు,అక్కాతమ్ముళ్ల బంధాలను గుర్తు చేస్తుందీ వేడుక. కరోనా ఎఫెక్ట్‌ రాఖీ పౌర్ణమిపై తీవ్రంగా పడుతోంది. ఏటా రూ.కోట్లలో రాఖీలు విక్రయాలు జరుగుతుండగా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు దుకాణాలు వెలవెలబోతున్నాయి. చాలావరకు ఇండ్లల్లోనే సొంతంగా తయారు చేసుకుంటుండడంతో అమ్మకాలపై ప్రభావం పడుతోంది. రాఖీలతోపాటు దాని అనుబంధ వ్యాపారాలు కూడా అంతంతమాత్రమే జరుగుతున్నాయి. 

 -ఆలేరు

తరాలు మారినా తరగని వన్నెతో తారతమ్యం లేకుండా జరుపుకునే పండుగ.. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ వేడుక రాఖీ. రక్తసంబంధానికి ప్రతిరూపంగా నిలిచే వేడుక. తోబుట్టువుల తియ్యటి జ్ఞాపకం రక్షాబంధన్‌. దీనినే రాఖీపౌర్ణమిగా పిలుస్తారు. ఆప్యాయతలకు సాక్షిభూతమై అవనిపై అజేయంగా వర్థిల్లుతున్న సంబురం. కొన్ని ప్రాంతాల్లో జంద్యాల పౌర్ణమిగా పిలిచే ఈ పండుగ శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సోమవారం రాఖీ సందర్భంగా పండుగ విశేషాలు మీకోసం..

 అమ్మలోని ప్రేమను, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షా బంధన్‌. ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున తోడబుట్టిన అన్నాతమ్ముళ్లతో తమ పేగు బంధం కలకాలం నిలువాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. ఈ సందర్భంగా సోదరుల నోరు తీపి చేసి సుఖ, సంతోషాలతో వర్థిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి రాఖీ పండుగ వారధిలా నిలుస్తోంది. 

రాఖీ పౌర్ణమి చరిత్ర...

  బంధన్‌పై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా సోదరుల క్షేమాన్ని కాంక్షించి అక్కాచెల్లెళ్లు మహావిష్ణువును ధ్యానిస్తూ సోదరుల చేతికి రక్ష కట్టే సందర్భంగా చెబుతారు. అందుకే ఈ పండుగను రక్షాబంధనం అంటారు. దీన్ని శ్రావణ పౌర్ణమి రోజున తోడబుట్టిన వాళ్లు తన సోదరులకు రాఖీ కట్టి తమ పేగు బంధాన్ని చాటుకుంటారు. 

  చక్రవర్తితో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు, తన సర్వాధిపత్యాన్ని కోల్పోతాడు. పూర్వవైభవం కోసం విష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకునేందుకు సిద్ధమవుతాడు. ఆ తరుణంలో భరత విజయాన్ని కాంక్షిస్తూ ఇంద్రుడి భార్య శచిదేవి ఆదిపరాశక్తిని స్మరిస్తూ కంకణం కడుతుంది. ఇది తొలి రాఖీ అని పురాణాల్లో చెబుతుంటారు. 

విశ్వజననీన స్ఫూర్తి.. 

రాఖీబంధం కేవలం సోదర సోదరీమణుల మధ్యే గాకుండా మానవీయతతో కూడిన కరుణాంతరంగంగా వేడుకగా జరుపుకోవాలి. ఇదే విషయాన్ని విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌ పిలుపునిచ్చారు. మన దేశంలోని హిందువులు, ముస్లింల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి రక్షాబంధన్‌ ఉత్సవాన్ని వేడుకగా చేసుకోవడంతో ఇది అంతర్జాతీయంగా గుర్తింపులోకి వచ్చింది. 

యజ్ఞోపవితం..  

శ్రావణ పౌర్ణమినే జంద్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజు యజ్ఞోపధారణ చేసుకుంటారు. బ్రాహ్మణ, వైశ్య, పద్మశాలి, విశ్వబ్రాహ్మణులు తదితర సామాజిక వర్గాలు యజ్జోపవితాలు మార్చుకుంటారు. పాత వాటి స్థానాల్లో కొత్తవాటిని ధరిస్తారు. పద్మశాలీలు ఉదయమే జంధ్యాలు మార్చుకుని సాయంత్రం మార్కండేయస్వామికి పూజలు చేసి కొన్ని ప్రాంతాల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు.   

రక్షాబంధనంపై పలు కథనాలు.. 

  రక్షాబంధన్‌ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన పండుగ. అప్పట్లో రాజపుత్రులు ఎక్కువగా ఈ వేడుక జరుపుకునేవారని చెబుతారు. రాజపుత్ర రాజైన పురుషోత్తముడు అలెగ్జాండర్‌తో జరిగిన యుద్ధంలో ఓడిపోవడానికి ఈ రక్షాబంధనమే కారణమంటారు. అలెగ్జాండర్‌ భార్య రొక్సానా పురుషోత్తముడికి రాఖీ కట్టి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకున్నందునే కావాలని ఓడిపోయాడనేది కొందరి కథనం.

  బలిరాజా .. దానవేంద్రో మహాబలం.. తేనేత్వ మబిబద్నామి రక్షే మాచల.. అంటే ఓ రక్షాబంధమా..! మహా బలవంతుడు, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని పురాణ కవుల నుంచి వినిపిస్తోంది. మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతడితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. మహాలక్ష్మీ వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది.  

  రక్షాబంధనం గురించి శ్రీకృష్ణుడిని అడుగగా శ్రీకృష్ణుడు ఈ గాథను వివరించినట్లు పురాణాల్లో ఉంది. దేవతలకు , రాక్షసులకు మధ్య ఒకసారి పన్నెండేళ్లు భీకర యుద్దం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు స్వర్గాన్ని వదిలి అమరావతికి వెళ్లి తలదాచుకున్నాడు. ముల్లోకాలను ఆక్రమించుకొన్న దానవులు ఇంద్రుడిని పట్టుకోవడానికి అమరావతిపైకి దండెత్తారు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు భయాందోళనకు గురై బృహస్పతి వద్దకు వెళ్లి సాయం కోరాడు.  వారు సంభాషించుకుంటుండగా బృహస్పతి భార్య వింటుంది. నేటి ఉదయం పర్వదినం నేను ఒక రక్షాబంధన్‌ కట్టెదను. దానితో మీకు విజయం తథ్యమని తెలిపింది. ఒక రక్షాబంధన్‌ తయారుచేసి  ఇంద్రుడి కుడిచేతి మణికట్టుకు కట్టింది. తనకు రాఖీ కట్టిన బృహస్పతి భార్యను సోదరిగా భావించిన ఇంద్రుడు విజయదరహాసంతో ఐరావతాన్ని ఎక్కి దానవుల సైన్యంపై దాడి చేయగా దానవులు ఓడిపోయి రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్తాడు. జరిగిందంతా తెలిపి తమకు విజయం చేకూరే ఉపాయం చెప్పమన్నారు. అందుకు శుక్రుడు బృహస్పతి భార్య కట్టిన రక్షాబంధంతోనే ఇంద్రుడికి విజయం చేకూరిందని చెబుతాడు. ఇలా రక్షాబంధనం అమలులోకి వచ్చిందని పలు కథనాలు చెబుతున్నాయి. 

మారుతున్న ట్రెండ్‌

నాలుగేండ్లు వెనక్కి వెళ్తే రాఖీలన్నీ ఒకేలా ఉండేవి. గతంలో రాఖీలు ఒక్కొక్కటి రూ. 10 నుంచి రూ. 15కు లభించేవి. కాలానుగుణంగా వివిధ రకాల రాఖీలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ప్లవర్‌, పూసదారం, స్టార్‌, చైన్‌గోల్డ్‌ కవరింగ గంధం పూసలు, నవరత్నాలు వినాయక ప్రతిమల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలోని నగరప్రాంతంతో పాటు ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో రాఖీల విక్రయాలకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా దుకాణాల్లో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. రూ.20 నుంచి రూ. 1500 వరకు రాఖీలు విక్రయిస్తున్నారు. 

మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం తప్పనిసరి..

కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కేవలం హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలకే పరిమితమైన వైరస్‌ మహమ్మారి ఇప్పుడు గ్రామాలకు పాకింది. సోమవారం రక్షాబంధన్‌  ఉండగా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లల్లో ఆందోళన మొదలైంది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం వచ్చింది. భౌతికదూరం పాటిస్తూ.. మాస్క్‌ ధరించి, శానిటైజర్‌ వినియోగిస్తే కరోనా దరిచేరదని వైద్యాధికారులు సూచిస్తున్నారు. రాఖీలు, స్వీట్లు కొనే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి.   

కాలం మారింది..

40 ఏండ్లు వెనక్కి వెళ్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. బంధుగణం దగ్గర ఊర్లల్లో ఉండేది. అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కొనుగోలు చేసి వాటిని ప్రేమగా కట్టేవారు. దూరంగా ఉంటే పోస్టు, కొరియర్‌ ద్వారా పంపేవారు. ఇంటర్నెట్‌ ప్రవేశంతో ఇప్పుడు ఈ మెయిల్‌, ఈ కార్డ్స్‌ వాట్సాప్‌ ద్వారా రాఖీలు పంపు తూ ఒకరిపై మరొకరు ప్రేమలు చాటుకుంటున్నారు. 

తాజావార్తలు


logo