సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 03, 2020 , 00:09:34

యాదాద్రిలో శ్రావణ సందడి

యాదాద్రిలో శ్రావణ సందడి

  • ఆదివారం భక్తుల రద్దీ

యాదాద్రి, నమస్తేతెలగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో శ్రావణ సందడి కనిపించింది. కరోనా నేపథ్యంలోనూ శ్రావణమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో స్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. కొండపైన ఆలయంలో, క్షేత్ర పరిసరాలు, ఘాట్‌రోడ్డు వెంట ఏర్పాటు చేసిన పచ్చిక బయళ్లు, పెద్దగుట్టపై టెంపుల్‌సిటీలో భక్తుల సందడి కనిపించింది. టెంపుల్‌ సిటీలో ఏర్పాటు చేసిన పార్కుల్లో భక్తులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. బాలాలయంలోని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రవేశ ద్వారం వద్దనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. ప్రసాద విక్రయశాల వద్ద కూడా భక్తులు బారులు తీరారు. అలాగే పాతగుట్టలోని లక్ష్మీనరసింహస్వామిని కూడా భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా నిత్యపూజలు..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ చేపట్టి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు సమర్పించారు. సుదర్శన హోమం, సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. దేవేరులను ముస్తాబు చేసి నిత్య కల్యాణం జరిపించి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపై ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ శివాలయంలో కుంకుమార్చన నిర్వహించారు.

యాదాద్రీశుడి ఆదాయం రూ. 2.92 లక్షలు 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం  రూ. 2,92,845  ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయాలతో రూ. 2,42,135, కొబ్బరికాయల ద్వారా రూ. 16,770, వాహనపూజలు ద్వారా రూ. 10,900, ప్రచారశాఖ ద్వారా రూ. 2,200, అన్నదాన విరాళాల నుంచి రూ. 1,020, ప్రధాన బుకింగ్‌ నుంచి రూ. 600, ఇతర సేవల ద్వారా రూ. 19,220 చేకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు.

VIDEOS

logo