ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jul 31, 2020 , 00:04:11

చేద బావి పాయె.. చెలిమె కష్టం పోయె.. కేసీఆర్ నీళ్లొచ్చిన‌య్‌

చేద బావి పాయె.. చెలిమె కష్టం పోయె..  కేసీఆర్ నీళ్లొచ్చిన‌య్‌

  • n తడారిన ఐదు దోనాల తండా  గొంతుకలు.. 
  • n స్వాంతన చేకూరుస్తున్న భగీరథ జలాలు 
  • n మల్లన్న చెంత నుంచి  కృష్ణమ్మ పరుగులు 
  • n తెలంగాణ ప్రభుత్వంలో  అందుతున్న సంక్షేమ ఫలాలు 
  • n సీఎం కేసీఆర్‌ వల్లేనని  సంబురపడుతున్న గిరిజనులు

ఐదు దోనాల తండా... జిల్లాకు చిట్టచివరన విసిరేసినట్లుగా ఎత్తైన గుట్టలపై ఉన్న గిరిజన ఆవాసం. యాభ్బై గడపలు.. వందకుపైగా కుటుంబాలున్న మారుమూల ప్రాంతం. సెల్‌ఫోన్‌ రింగ్‌టోన్‌కి, ఎర్ర బస్సు హారన్‌కి ఆమడ దూరం. ఎక్కడికెళ్లాలన్నా కాలినడకే శరణ్యం. గుక్కెడు నీళ్ల కోసం పుట్టెడు కష్టాలు.. చెలిమెల్లో పట్టుకున్నా, చేద బావుల్లో తోడుకున్నా ఫ్లోరైడ్‌ నీళ్లతోనే గొంతు తడారేది. తండాకు పిల్లనిచ్చేవారే కరువయ్యారు. తమ ఇంటి ఆడబిడ్డ కష్టాలు తొలిగే రోజు కోసం గిరిజనులు మొక్కని దేవుడు లేడు. వాళ్ల పూజలు ఫలించి మంచి రోజులొచ్చాయి. శ్రీశైలం మల్లన్న చెంత నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టింది. వంద కిలోమీటర్లు దాటుకుని ఐదు దోనాల తండాకు చేరింది. తరిమిన నీటి కష్టాలతో హడలిపోయిన గిరిజన ఆడ బిడ్డలు కండ్లముందరకు తరలివచ్చిన కృష్ణా నీళ్లను చూసి ఉప్పొంగిపోతున్నారు. ‘కేసీఆర్‌ నీళ్లొచ్చినయ్‌' అంటూ సంబురపడిపోతున్నారు.

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


జిల్లాకు చిట్టచివరన ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉన్న గిరిజన ఆవాసం ఐదు దోనాల తండా. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కడీలబాయితండా పంచాయతీ పరిధిలో ఈ తండా ఉన్నది. 50 గడపల వరకు ఉన్న ఈ తండాలో వందకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అనాదికాలంగా తండా పక్కన ఉన్న చేదబావి నుంచి నీళ్లను తోడి ఇక్కడి గిరిజనులు దాహార్తిని తీర్చుకునేవారు. ఉన్న ఒక్కగానొక్క చేతి పంపునకు మరమ్మతులు లేక అలంకారప్రాయంగా మారింది. ఆ తర్వాత స్కీం బోరు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆగిఆగిపోసే నీళ్లు.. తండాలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన ఏడెనిమిది పబ్లిక్‌ నల్లాలు గిరిజనం దాహాన్ని పూర్తిగా తీర్చలేకపోయాయి. స్కీం బోరు నడువని రోజు వ్యవసాయ పొలాల్లోని బోరు, బావులే దిక్కు. గుక్కెడు నీటికోసం తల్లిడిల్లుతున్న ఇక్కడి గిరిజనుల పరిస్థితి చూసి కోడలుగా తమ ఇంటి నుంచి ఆడపిల్లను పంపాలంటే ఏ తల్లిదండ్రులైనా ఆలోచించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఒకప్పుడు తండాలో నెలకొన్న నీటి కష్టాలకు ‘మిషన్‌ భగీరథ’ నీళ్లు చరమగీతం పాడాయి. గడిచిన ఎండాకాలం నుంచి గడపగడపకూ శుద్ధజలాలు అందుతున్నాయి. సమృద్ధిగా సరఫరా అవుతున్న కృష్ణా జల సిరులు ఎండాకాలం, వానకాలం అన్న తేడాలేకుండా అన్ని రోజుల్లోనూ తండా గిరిజనుల దాహార్తిని తీరుస్తున్నాయి.

ఎక్కడి శ్రీశైలం... ఎక్కడి ఐదు దోనాల..


ఎంతో సాహసంతో ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని ఐదు దోనాల తండాకు సరఫరా చేస్తున్నది. శ్రీశెలం ప్రాజెక్టు నుంచి తాగునీటి కోసం తరలిస్తున్న కృష్ణా నీటిని వయా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సర్కిల్‌పాడ్‌ మీదుగా రంగారెడ్డి జిల్లాకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి వస్తున్న రా వాటర్‌ను ముచ్చర్ల వద్ద ఉన్న వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో శుద్ధి చేస్తున్నారు. అక్కడి నుంచి 23కి.మీ.ల దూరంలో ఉన్న పటేల్‌చెరువు తండా వద్ద ఉన్న సంప్‌లోకి ఎత్తిపోశాక అక్కడి నుంచి మూడు కి.మీ.ల దూరంలో ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్న ఐదు దోనాల తండాలోని ట్యాంక్‌లోకి తరలిస్తున్నారు. అక్కడి ట్యాంక్‌ నుంచి గడపగడపకూ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఎక్కడో 150కి.మీ.ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని సుదూర ప్రాంతంలో ఉన్న ఐదు దోనాల తండాకు తరలించి తెలంగాణ ప్రభుత్వం గొప్ప సాహసానికే ఒడిగట్టింది. మల్లన్న చెంత నుంచి వచ్చిన నీటిని తాగుతామని కలలో కూడా అనుకోలేదని, సీఎం కేసీఆర్‌ చొరవ వల్లనే ఆ భాగ్యం కలిగిందంటూ తండా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమ పథకాలకూ ఢోకా లేదు..