సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 31, 2020 , 00:04:13

కనుల పండువగా పవిత్రోత్సవాలు

కనుల పండువగా పవిత్రోత్సవాలు

  • n స్వామివారికి పవిత్ర మాలధారణ
  • n హాజరైన ఆలయ ఈవో గీతారెడ్డి
  • n కొనసాగిన నిత్యపూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం రెండో రోజు పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం హవనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పవిత్ర మాలలు ధరింపజేసి అర్చనలు చేశారు. హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా, సాయంత్రం హవనం, లఘుపూర్ణాహుతి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక ఆరాధన చేశారు. అలాగే పాతగుట్టలోని లక్ష్మీనరసింహుడి ఆలయంలోనూ శ్రావణ మాసం సందర్భంగా పవిత్రోత్సవాలు కొనసాగాయి. గురువారం రెండోరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. మాస్కులు ధరించి, క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఎంట్రీ పాయింట్‌ వద్ద ఆలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు.  

నిత్య పూజల కోలాహలం..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం నిత్యపూజలు ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి సేవలు ప్రారంభించారు. వేకువజామునే సుప్రభాత సేవ కొనసాగించారు. అనంతరం బాలాలయంలో ప్రతిష్టామూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించారు. తులసీదళాలు, పుష్పాలతో అర్చించారు. మంటపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం వైభవంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నివేదన జరిపించి, శయనోత్సవం చేపట్టారు.

నేటితో ముగింపు


శ్రావణ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మూడో రోజు శుక్రవారం ముగియనున్నాయి. శుక్రవారం హవనం, మహాపూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయి. ఉత్సవాల ముగింపు తర్వాత స్వామివారికి ధరింప జేసిన కొన్ని పవిత్ర మాలలను అధికారులు భక్తులకు అందిస్తారు.


VIDEOS

తాజావార్తలు


logo