శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 29, 2020 , 01:15:41

దాయొద్దు.. తిరుగొద్దు

దాయొద్దు.. తిరుగొద్దు

విచ్చలవిడి సంచారంతోనే కరోనా వ్యాప్తి 

లక్షణాలున్న వారు దాచి పెట్టొద్దు 

కరోనా బాధితులు బయట తిరగవద్దు  

విందులు, వినోదాలతో వైరస్‌ విస్తరణ 

కాగితాలతోపాటు నోట్ల మార్పిడి ప్రమాదకరమే

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట వ్యాపార, కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి ఫోన్‌ సంభాషణ 

సూర్యాపేట టౌన్‌ : ఆప్తులతోనే కరోనా వ్యాప్తి చెందుతుందని  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డాడు. అయిన వారే కదా అని అల్లుకుపోతే అంతిమంగా నష్టపోయేది మనమేనన్నారు. ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌ ఆప్తులు, స్నేహితులు, బంధుమిత్రులతో విస్తరిస్తుందన్నారు. అటువంటి ప్రమాదకరమైన వైరస్‌ సోకినపుడు దాచిపెట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని ఆయన పేర్కొన్నారు. విందులు, వినోదాలతోనే కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాప్తిచెందుతుందన్నారు. కాగితాలతో పాటునోట్లు చేతులు మారినప్పుడు వైరస్‌ సోకే అవకాశాలు లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం సూర్యాపేటలోని మున్సిపల్‌ పాలకవర్గంతో పాటు వర్తక, వాణిజ్య, వ్యాపార, వృత్తి, కార్మికసంఘాల ప్రతినిధులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన లాక్‌డౌన్‌ అమలుపై ఆయా సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. చైనాలో మొదలు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి బయోత్పాతం సృష్టిస్తున్న కరోనా  కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న అంబులెన్స్‌లతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఇదే విషయమై వర్తక వ్యాపార వాణిజ్య వృత్తి కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్‌డౌన్‌ అమలు చేయాల్సిందేనన్నారు. వ్యవసాయ, వైద్య రంగంపై ప్రభావం చూపకుండా లాక్‌డౌన్‌ అమలుపర్చాలని పేర్కొన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌,  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత  వై.వెంకటేశ్వర్లు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఐఎం నుంచి డాక్టర్‌ విద్యాసాగర్‌, కిరాణామర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ, హోటల్‌ అసోసియేషన్‌కు చెందిన కొండపల్లి దిలీప్‌రెడ్డి, ఫర్టిలైజర్స్‌ అసోసియేషన్‌కు చెందిన ఉప్పల ఆనంద్‌, మొరిశెట్టి యోగి, ఆయా సంఘాల ప్రతినిధులతో పాటు కమిషనర్‌ రామానుజుల్‌రెడ్డి, పురపాలకవర్గం సభ్యులు పాల్గొని లాక్‌డౌన్‌ పై తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. 


VIDEOS

logo