శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 28, 2020 , 00:07:40

అంగ‌న్‌వాడీల్లో ఆంగ్ల‌బోధ‌న‌

అంగ‌న్‌వాడీల్లో ఆంగ్ల‌బోధ‌న‌

  • l ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు పెంచే  చర్యలు  
  • l చిన్నతనం నుంచే పెరగనున్న జిజ్ఞాస 
  • l టీచర్లకు పూర్తయిన శిక్షణ కార్యక్రమాలు 
  • l అన్ని కేంద్రాలకు చార్టులు, పుస్తకాల పంపిణీ పూర్తి 
  • l ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ఆటపాటలతో బోధన 
  • l జిల్లావ్యాప్తంగా 864 అంగన్‌వాడీ కేంద్రాలు
  • l వీటిల్లో విద్యనభ్యసిస్తున్న  చిన్నారులు 25,487 మంది  

ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తున్న సర్కారు..అంగన్‌వాడీ కేంద్రాలపైనా దృష్టి సారించింది. ఈ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టి కాహారం అందిస్తుండడంతోపాటు చిన్నప్పటి నుంచే ఆంగ్లంపై మక్కువ పెంచేలా చకచకా చర్యలు చేపట్టింది. ప్రతీ కేంద్రంలో ఆంగ్ల బోధన జరిగేలా విధివిధానాలు రూపొందించింది. ఇప్పటికే మార్గదర్శ కాలను విడుదల చేయడంతోపాటు టీచర్లకు శిక్షణ కూడా పూర్తి చేసింది. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన చార్టులు, పుస్తకాలను ఇదివరకే టీచర్లకు పంపిణీ చేసి బోధనకు కావాల్సిన మెళకువలను సూచించారు. ప్రతినిత్యం రెండు గంటలకు తగ్గ కుండా పీరియడ్లుగా విభజించి బోధన చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రైవేటు ప్లేస్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీలను బలోపేతం చేయడమే సర్కారు అం తిమ లక్ష్యం. జిల్లా వ్యాప్తంగా 864 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వీటిల్లో 809 ప్రధానమైనవి, 55 సూక్ష్మ అంగన్‌వాడీ కేంద్రాలున్నా యి. వీటిల్లో 25,487 మంది విద్యా ర్థులు అభ్యసిస్తున్నారు. 

భువనగిరి : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అందులో భాగంగా ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేక్రమంలో  విద్యార్థులను సంసిద్ధం చేసేందుకు మరో అడుగు ముందుకేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో సైతం పిల్లలకు ఆంగ్లబోధన చేపట్టే విషయంలో సమగ్ర విధివిధానాలు రూపొందించింది. అందుకు కావాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. పిల్లలకు మానసిక వికాసం పెంపొందించేందుకు వీలుగా విద్యాబోధన చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్యులకు సైతం ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో ముందడుగు వేసింది. దీంతో అంగన్‌వాడీల్లో ప్రాథమిక విద్యతో పాటు, ఆంగ్లవిద్యపై విద్యార్థులకు బోధన చేపట్టేలా చర్యలు తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 864 అంగన్‌వాడీ కేంద్రాలు 

జిల్లాలో 864 అంగన్‌వాడీ కేంద్రాలు  ఉండగా అందులో 809 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 55 సూక్ష్మ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 25487మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరే విద్యార్థులకు మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేందుకు వీలుగా అంగన్‌వాడీ టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. ఈక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులకు ఆంగ్లబోధన చేపట్టేందుకు వీలుగా ఆయా కేంద్రాల్లో విద్యార్థులను గ్రూపులుగా చేసి బోధన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆటపాటలతో ఆంగ్లబోధన

అంగ్లబోధన చేపట్టేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని చర్యలు చేపట్టారు.   ప్రతి అంగన్‌వాడీ టీచర్‌కు అందుకు అనుగుణంగా శిక్షణ ఇచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో ఆంగ్లవిద్యను బోధించేందుకు  తీసుకోవాల్సిన మెళకువలు సైతం పూర్తిచేశారు. ఇందులో భాగంగా నర్సరీ పిల్లలకు ఆటపాటలు, బొమ్మలతో, మూడు నాలుగు ఏండ్లలోపు పిల్లలకు ఎల్‌కేజీ, నాలుగు, ఐదేండ్లలోపు పిల్లలకు యూకేజీ  పాఠాలు బోధించనున్నారు. ఇం దుకోసం ప్రత్యేకంగా రూపొందించిన చార్టులను అంగన్‌వాడీ కేంద్రాలకు చేరవేశారు. వీటితో పాటు పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలను సైతం అందజేయనున్నారు.

ఆంగ్ల బోధనకు శ్రీకారం 


విద్యావిధానంలో వస్తున్న పోటీకి అనుగుణంగా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధనకు శ్రీకారం చుట్టింది. సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దనే ఆలోచనలతో ప్రభుత్వం అంగన్‌వాడీల్లో ఆంగ్ల విద్య కోసం చర్యలు తీసుకున్నది. పూర్వ  ప్రాథమిక స్థాయిల్లోనే చిన్నారులకు ఆంగ్ల బోధన చేయాలని నిర్ణయించింది. అందుకు కావాల్సిన ఏర్పాట్లను సైతం చేపట్టింది. దీంతో చిన్నారులకు  లబ్ధి చేకూరనున్నది. 

-స్వరాజ్యం, ఇన్‌చార్జి సీడీపీవో  

 

VIDEOS

logo