గురువారం 22 అక్టోబర్ 2020
Yadadri - Jul 27, 2020 , 00:03:26

సాగు లెక్క ఇక ప‌క్కా...!

సాగు లెక్క ఇక ప‌క్కా...!

  • n   జిల్లాలో వానకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 3.84లక్షల ఎకరాలు
  • n   ఇప్పటి వరకు 2.31 లక్షల ఎకరాల్లో సాగును చేపట్టిన రైతాంగం
  • n   క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల వివరాలు సేకరిస్తున్న ఏఈవోలు
  • n   ఈ వానకాలం నుంచి రెండు పంటల వివరాల నమోదుకు అవకాశం  
  • n   ప్రభుత్వ చర్యలతో సులువుగా మద్దతు ధర పొందనున్న అన్నదాతలు

గతేడాది వరకు వ్యవసాయ విస్తరణ అధికారులు ఏం రాస్తే అదే రికార్డు. పంటల వివరాలు సరిగా నమోదుగాక కొనుగోలు సమయంలో రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం సాగు లెక్కను పక్కాగా చేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పర్యటిస్తూ ఏ గుంటలో ఏ పంట సాగు చేస్తున్నారో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 92 క్లస్టర్ల పరిధిలో 2,17,107 మంది రైతులు ఉండగా.. వానకాలంలో 3.84లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు తగ్గట్టుగా రైతులు నియంత్రిత సాగు పద్ధతుల్లో ఇప్పటికే 2.31లక్షల ఎకరాల్లో పంటల సాగు చేపట్టారు. ఈ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. అయితే గతానికి భిన్నంగా ఒకే సీజన్‌లో రైతులు సాగు చేసిన రెండు పంటల లెక్క తేలనుంది. ఫస్ట్‌ క్రాప్‌, సెకండ్‌ క్రాప్‌ ఆప్షన్‌ ఇవ్వడంతో అధికారులు వానకాలంలో ఇప్పటికే సాగు చేసిన పంటలతో పాటు, ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలు, అంతర పంటల వివరాలను సైతం రికార్డు చేస్తుండడం విశేషం. 

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


గత సీజన్‌లో ఓ రైతు పండించిన కందులను కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా ఆన్‌లైన్‌లో సదరు రైతు కందులను సాగు చేసినట్లు నమోదు కాలేదని పేర్కొంటూ కొనుగోలు చేయకుండా తిరస్కరించారు. ఇలా పత్తి, జొన్న, పెసర్లు వంటి పంటలను పండించిన వేలాది మంది రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇకపై ఇటువంటి సమస్య ఎదురు కావద్దనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ అధికారులు సాగు తేల్చేందుకు రైతుల వారీగా సర్వే చేపడుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాల్లో ప్రస్తుతం చేపడుతున్న పంటల సాగు లెక్కల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలు పక్కాగా తేలనున్నాయి. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేస్తున్న సందర్భంలోనే సంబంధిత రైతుల ఫోన్‌ నంబరు, పంటల రకం, విస్తీర్ణం, సాగులో యంత్రాలను ఉపయోగిస్తున్నారా? లేక కాడెద్దులతో చేస్తున్నారా! తదితర వివరాలను సైతం సేకరిస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి వానకాలంలో చేపట్టిన సర్వేలో ఒకే సీజన్‌లో రైతులు సాగు చేసిన రెండు పంటల లెక్కలను అధికారులు తేల్చనున్నారు. మొన్నటి వరకు ఒకే పంట వివరాలను మాత్రమే అధికారులు నమోదు చేసేవారు. అయితే ఆగస్టు నాటికే ఆరుతడి పంటలు చేతికొస్తుండగా.. ఆ తర్వాత వెంటనే వానకాలం సీజన్‌ కింద రైతులు వరి, పత్తి వంటి పంటలను సాగు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పత్తి, కందులు, జొన్న తదితర పంటల్లో అంతర పంటగా ఇతర పంటలను కూడా చేపడుతున్నారు. మొన్నటి వరకు అధికారులు ఒకే పంటను నమోదు చేస్తూ వస్తుండటంతో కొనుగోలు సమయంలో మద్దతు ధర పొందే విషయంలో రైతులకు న్యాయం జరిగేదికాదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభు త్వం ఒకే సీజన్‌లో సాగు చేసిన రెండు పంటల వివరాలను నమోదు చేసేందుకు అవకాశం కల్పించడంతో ఇక నుంచి రైతులు రెండు పంటలకు మద్దతు ధరను పొందే అవకాశం ఉన్నది.

మార్పులు.. చేర్పులకూ అవకాశం...

ఏ రైతు పేరున ఏ పంట వేశారో తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న అధికారులు సంబంధిత డేటాను మార్కెటింగ్‌ శాఖకు సైతం పంపనున్నారు. ఈ డేటాను అనుసరించే రానున్న రోజుల్లో పంటల కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటు, నిధుల కేటాయింపులను ప్రభుత్వం చేపట్టనున్నది. పంటల వివరాలు తప్పుగా నమోదైతే పండించిన పంటలకు రైతులు మద్దతు ధరను పొందడం కష్టమవుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరిస్తున్న ఏఈవోలు ఏ రోజుకారోజు ఆన్‌లైన్‌లో పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. వెంటనే రైతుకు ఫోన్‌లో సమాచారం వెళ్తుండగా.. ఆ వివరాల్లో తప్పులుంటే రైతులు వెంటనే ఏఈవోకు ఫోన్‌ ద్వారా తెలిపితే ఆన్‌లైన్‌లో మార్పులు, చేర్పులకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది అధికారులు ఇష్టమొచ్చినట్లుగా పంటల వివరాలను నమోదు చేయడంతో మద్దతు ధరకు రైతులు అమ్ముకునే వీలులేక అనేక సమస్యలు తలెత్తగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన విధానంతో గత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది.

జిల్లా వ్యాప్తంగా 2.31లక్షల ఎకరాల్లో పూర్తయిన సాగు

జిల్లాలో ప్రస్తుత వానకాలం పంటల్లో భాగంగా మొత్తం 3,84,617 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాలు సమృద్ధిగా కురవడం.. బోరు, బావుల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరుగడంతో ఈసారి సాగు ఊపు మీద ఉన్నది. ఈ మేరకు ఇప్పటి వరకు 2.31 లక్షల ఎకరాల్లో పంటలను వేయడం పూర్తయింది. వరికి సంబంధించి సన్న, దొడ్డురకం పంటల సాగు ఈ వానకాలంలో 1,54,029 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటి వరకు 89,981 వరి సాగు పూర్తయింది. మరో 57,885 ఎకరాల్లో నాటేందుకు వరి నాట్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే పత్తి 1,73,993 ఎకరాల్లో సాగవ్వనుండగా, ఇప్పటికే 1,54,703 ఎకరాల్లో విత్తనాలను విత్తడం పూర్తైంది. గతంలో జిల్లాలో 25వేల ఎకరాల్లోనే కంది పంటల సాగుఉండగా, వ్యవసాయ శాఖ ఈసారి 50వేలకు పెంచిం ది. ఈ నేపథ్యంలో 26,891 ఎకరాల్లో కంది సాగుకు రైతులు ఉపక్రమించారు. వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా జొన్న 1,334 ఎకరాల్లో, పచ్చ జొన్న 396 ఎకరాల్లో, పెసర్లు 50 ఎకరాల్లో, మరో 52 ఎకరాల్లో పల్లి సాగుకు సంబంధించి విత్తనాలను విత్తడం కూడా పూర్తయింది. మిగిలిన ఎకరాల్లోనూ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. 

జిల్లాలో మండలాల వారీగా వ్యవసాయ శాఖ  అధికారుల వద్ద ఉన్న రైతుల వివరాలు..

మండలం                        రైతులు

ఆలేరు                             10,803

ఆత్మకూరు(ఎం)                 12,080

గుండాల                          11,488

భూదాన్‌ పోచంపల్లి             13,080

భువనగిరి                         18,266

బీబీనగర్‌                          10,924

వలిగొండ                         20,592

అడ్డగూడూరు                      8,330

చౌటుప్పల్‌                       14,720 

మోటకొండూర్‌                   9,559

మోత్కూరు                        9,082

నారాయణపురం               13,739

రామన్నపేట                     14,297

బొమ్మల రామారం            12,214

రాజాపేట                        12,931

తుర్కపల్లి                        13,408 

యాదగిరిగుట్ట                  11,594

మొత్తం                       2,17,107

logo