గురువారం 22 అక్టోబర్ 2020
Yadadri - Jul 27, 2020 , 00:03:47

ద‌శాబ్దాల నిరీక్ష‌ణ‌కు తెర‌

ద‌శాబ్దాల నిరీక్ష‌ణ‌కు తెర‌

  • n పెద్దకాల్వ  డ్రైనేజీ 
  • నిర్మాణానికి  ఆమోదం
  • n రూ. 4కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం
  • n వచ్చే నెలలో మొదలవనున్న టెండర్‌ ప్రక్రియ
  • n ఆవెంటనే యుద్ధప్రాతిపదికన జరుగనున్న పనులు 
  • n వందలాది కుటుంబాలకు లబ్ధి

చౌటుప్పల్‌:  చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ప్రాంత వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు పెద్ద కాల్వ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు మోక్షం లభించింది. పెద్ద కాల్వ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని గత ప్రభుత్వాలకు స్థానికులు వందలాది సార్లు విన్నవించినా  ఫలితం కనిపించలేదు. దీంతో వందలాది కుటుంబాలు మురుగు కంపుతో సావాసం చేయాల్సిన దీన పరిస్థితి. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో 40ఏండ్లుగా ఈ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న పెద్ద కాల్వ సమస్యకు పరిష్కారం లభించింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు హయంలో ఈ కాల్వ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 4కోట్ల యూడీసీ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ ప్రాంత వాసులకు తీపికబురందించింది.

వచ్చే నెలలో టెండర్‌ ప్రక్రియ..

పెద్ద కాల్వ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు టెండర్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. 4కోట్ల నిధులు సైతం విడుదల చేసింది. వచ్చేనెల మొదటి వారంలో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు మెరుపు వేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే టెండర్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు మున్సిపల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెండర్‌ ప్రక్రియ పూర్తైన వెంటనే యుద్ధప్రాతిపదికన డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

వందలాది కుటుంబాలకు లబ్ధి

చౌటుప్పల్‌ నడిబొడ్డున పెద్ద కాల్వ ఉంది. దినాదినాభివృద్ధి చెందుతున్న చౌటుప్పల్‌లో వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీంతో ఆ ఇండ్ల నుంచి వచ్చే మురుగు మొత్తం పెద్ద కాల్వలోనే జమ అవుతున్నది. మురుగు నీరు పారుతుండటంతో కాల్వ పక్కన ఉన్న వందలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చేది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌గున్యా రోగాల బారిన పడేది. దీంతో దవాఖానల చుట్టూ తిరుగుతూ ఇల్లుగుల్ల చేసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం కాల్వ డ్రైనేజీ నిర్మాణానికి పచ్చజెండా ఊపడంతో ఇకపై వీరి కష్టాలు తీరనున్నాయి. ఈకాల్వకు స్థానిక కస్తూర్బా పాఠశాల పక్కన ఉన్న మురుగు కాల్వను అనుసంధానం చేస్తూ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. తంగడపల్లి చౌరస్తా నుంచి వలిగొండ క్రాస్‌రోడ్డు వరకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. 

సమస్య పరిష్కారం కావడం సంతోషంగా ఉంది


చౌటుప్పల్‌ వాసులు 40ఏండ్లుగా పెద్ద కాల్వ మురుగు సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాలుగా మురుగుతో సావాసం చేయాల్సిన దీనస్థితి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సహకారంతో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి  దృష్టికి తీసుకువెళ్లి రూ. 4కోట్ల నిధులు విడుదల చేయించాం. దీంతో పెద్ద కాల్వ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి మోక్షం లభించింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రులు కేటీఆర్‌, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్‌. బూర నర్సయ్యగౌడ్‌కు కృతజ్ఞతలు. అందరి సహకారంతో ఇకపై మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తా.                     

 - వెన్‌రెడ్డి రాజు,  మున్సిపల్‌ చైర్మన్‌, చౌటుప్పల్‌ 


logo