శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Jul 26, 2020 , 00:03:17

తీజ్ తీన్‌మార్‌

తీజ్ తీన్‌మార్‌

  • మరో మూడు రోజుల్లో ప్రకృతి పండుగ 
  • తొలకరి చినుకుల మధ్య గిరిజనుల ఆటాపాట 
  • యేటా శ్రావణ మాసంలో ఉపవాసాలు 
  • నవధాన్యాల మొలకలకు ప్రత్యేక పూజలు 
  • తొమ్మిది రోజుల పాటు సంబురాలు 
  • సంప్రదాయ పండుగకు ముస్తాబవుతున్న తండాలు

తీజ్‌.. పేరు వింటేనే గిరిజనులు పులకించిపోతారు. తొలకరి చినుకుల మధ్య జరుపుకునే ప్రకృతి పండుగ కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తారు. అన్నా చెల్లెళ్ల అనుబంధాలకు ప్రతీక.. ఆడపిల్లలు ఆడిపాడే వేడుక అయిన  ఆ అపురూప సంబురం రానే వచ్చింది. మూడు రోజుల్లో వేడుకలు ప్రారంభించేందుకు తండాలన్నీ ముస్తాబవుతున్నాయి. ప్రతి యేటా శ్రావణ మాసంలో పుట్టమన్ను తెచ్చి, వెదురుబుట్టలో నవధాన్యాలను పోసి అత్యంత భక్తి శ్రద్ధలతో గిరిజన దేవేతలను ఆరాధిస్తారు. నిష్టగా ఉపవాసం ఉండి నిత్యపూజలు చేస్తారు. ఈ నెల చివరి వరకూ తొమ్మిది రోజుల పాటు జరుపుకునే తీజ్‌ సంబురాలు అంబరాన్నంటుతాయి. డప్పుల మోతలు.. కేరింతల నడుమ సాగే సంబురం బతుకమ్మ పండుగను తలపిస్తుంది. పంటలు బాగా పండాలని.. ఆరోగ్యంగా ఉండాలని.. గిరిజన యువతులకు మంచి భర్త రావాలని భవానీమాతను కోరుకుంటారు. ఈ నేపథ్యంలో గిరిజనుల సంప్రదాయ పండుగపై ఈ వారం సండే స్పెషల్‌... 

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


తొమ్మిది రోజులపాటు సంబురాలు..

వెదురు బుట్టలలో నారు పోయడంతో తీజ్‌ ఉత్సవాలు మొదలవుతాయి. గోధుమలు, శనగలు లేకుంటే ఇతర ధాన్యాలను తెచ్చి వేడుకలకు ముందే నానబెడుతారు. మొదటిరోజున ఉదయం యువతులు స్నానం చేసి డప్పుచప్పుళ్లతో వెళ్లి పుట్టమన్ను, మేకల ఎరువును సేకరించి తీసుకొస్తారు. వెదురు బుట్టల్లో పుట్టమన్ను, ఎరువును నింపి నానబెట్టిన గోధుమలను యువతుల చేతుల మీదుగా కుటుంబ సభ్యులంతా కలిసి బుట్టల్లో చల్లుతారు. నారు వచ్చాక బుట్టలకు గిరిజన దేవతలైన మేరామ్మ, సేవాభాయి, తుంజాభవాని, సీత్లా భవాని వంటి పేర్లు పెడుతారు. సిద్ధం చేసిన బుట్టలను పందిరి మీద వరుస క్రమంలో ఉంచుతారు. ప్రతిరోజు నారుపై యువతులు నీళ్ల పోస్తారు. మొక్కలు ఏపుగా పెరగడానికి రోజుకు మూడుసార్లు నియమనిష్టలతో తొమ్మిది రోజులపాటు నీళ్లు పోస్తారు. డప్పుల మోతల నడుమ ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తుండటంతో వెదురు బుట్టలు ఉంచిన ప్రాంతం ప్రతి రోజూ సందడి సందడిగా ఉంటుంది. తీజ్‌ ఉత్సవాల్లో భాగంగా ఏడు రోజులు గిరిజనులు రొట్టెలు, బెల్లం కలిపిన ముద్దను భవానీ మాతకు సమర్పించి దామోలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తీజ్‌ బుట్టల వద్ద ఉన్న సేవాభాయికి కూడా నైవేద్యాన్ని సమర్పిస్తారు. నీటితో నింపి ఉన్న కుండపై వేప కొమ్మలను ఉంచి దీని ముందు జొన్నపిండితో ముగ్గులు వేసి దీపం వెలిగిస్తారు. వెండితో తయారు చేసిన కులదేవత మేరామ్మ తల్లి విగ్రహాన్ని వెండి నాణేన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మేక పోతులను బలి ఇస్తారు. తొమ్మిది రోజులపాటు జరిగే వేడుకల్లో భాగంగా యువతులు తమ ఇండ్ల ముందు ఏర్పాటు చేసుకునే ఊయలలో ఊగుతూ పాటలు పాడుతూ సంతోషంగా గడుపుతారు.

నిమజ్జనంతో ముగియనున్న సంబురాలు..