ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 25, 2020 , 00:03:01

స్వామివారి రథం

స్వామివారి రథం

ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆండాళ్‌ అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలాలయంలో అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. అమ్మవారిని ప్రత్యేకమైన పంచామృతంతో అభిషేకించారు. మూల మంత్ర, మృత్యు మంత్ర హోమాలు జరిపారు. ద్రవిడవేద తమిళ పాశురపఠనాలు ప్రత్యేకంగా నిర్వహించారు. సాయం త్రం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకమైన ఆరాధన జరిపి, ఆస్థానంలో అమ్మవారి జన్మవృత్తాతాన్ని చెప్పారు. అనంతరం అమ్మవారి జన్మదినోత్సవ పూజ కార్యక్రమాలు చేపట్టారు. పంచాస్ర్తాగమశాస్త్రం ప్రకారం నిర్వహించిన ఈ వేడుకలు ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, దివ్య ప్రబంధ పారాయణదార్‌ నల్లందీగల్‌ సీతామనోహరాచార్యులు, స్థానాచార్యులు రాఘవాచార్యు లు ఆధ్వర్యంలో ప్రధానార్చక బృందం నిర్వహించగా, ఆల య అర్చకులు, ఉప అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.  

అమ్మవారికి ఊంజల్‌సేవ


యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శుక్రవారం నిత్యారాధనలతో పాటు సాయంత్రం అమ్మవారికి ఊంజల్‌ సేవను కోలాహలంగా నిర్వహించారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. 

స్వామివారికి  నిత్యపూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలను అర్చకులు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉదయమే ఆలయంలో సుప్రభాతం నిర్వహించిన అర్చకులు బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలతో అభిషేకించి తులసీ పత్రాలతో అర్చన చేశారు. మంటపంలో దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. మహా మంటపంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ శ్రీసుదర్శన నారసింహహోమం, కల్యాణ సేవ, నిత్యకల్యాణ వేడుకలు శాస్ర్తోక్తంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నివేదన జరిపించి, శయనోత్సవం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సామాజిక దూరం, మాస్కులు ధరించి శ్రీస్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 1,31,108 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ. 1,31,108 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 1,900, ప్రసాద విక్రయాలతో రూ. 95,890, మినీబస్సు ద్వారా రూ. 540, వాహనపూజల ద్వారా రూ. 6,600, కొబ్బరికాయలతో రూ. 11,850, ఇతర విభాగాలతో రూ. 100 తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 1,31,108 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

VIDEOS

logo